కంటి ‘వెలుగు’ కావాలి! | Telangana People More Interest In Second Phase Kanti Velugu Programme | Sakshi
Sakshi News home page

కంటి ‘వెలుగు’ కావాలి!

Published Sat, Jan 14 2023 1:23 AM | Last Updated on Sat, Jan 14 2023 10:48 AM

Telangana People More Interest In Second Phase Kanti Velugu Programme - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం రెండో విడత మొదలవనుండటంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. గతంలో కంటి పరీక్షలు చేసినప్పుడు ఇచ్చిన అద్దాలు ఇప్పుడు పనిచేయడం లేదని, కొత్తవి ఇవ్వాలన్న విజ్ఞప్తులతోపాటు.. ఆపరేషన్లు అవసరమయ్యే వారికి వెంటనే చేయించేలా ఏర్పాట్లు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. కేవలం పరీక్షలు జరిపి అద్దాలు, మందులతో సరిపెట్టవద్దని.. శస్త్రచికిత్స చేయించాలని బాధితులు కోరుతున్నారు.

ఘనంగా ప్రారంభించినా..
రాష్ట్రంలో ప్రజల దృష్టి సమస్యలను నివారించేందుకు ప్రభుత్వం 2018 ఆగస్టు 15న ‘కంటి వెలుగు’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్ర జనాభాలో 25% మంది ఏదో ఒక స్థాయిలో కంటి సమస్యలతో బాధపడుతున్నారన్న విషయాన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, వార్డులు, పట్టణాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎనిమిది మందితో కూడిన వైద్యబృందాలు పరీక్షలు చేపట్టాయి.

రూ.196.79 కోట్ల వ్యయంతో 826కిపైగా బృందాలతో నాలుగున్నర నెలలపాటు కార్యక్రమం కొనసాగింది. తొలిరోజున 1,09,000 మందిని పరీక్షించారు. గరిష్టంగా ఒక రోజున లక్షన్నర మందికి కంటి పరీక్షలు చేశారు. మొత్తంగా 38 లక్షల మందికిపైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో అవసరమైన వారికి అద్దాలు, మందులు ఇచ్చారు. ఆరున్నర లక్షల మందికిపైగా శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. ఇందులో మూడో వంతు మందికి ఆపరేషన్లు చేసినా.. ఆస్పత్రుల్లో సిబ్బంది, పరికరాలు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా మిగతా వారికి నిర్వహించలేకపోయారు.

ఈసారి ఆపరేషన్లు చేస్తారా?
‘కంటి వెలుగు’ పథకం రెండో విడత ఈనెల 18న ఖమ్మం వేదికగా మొదలుకానుంది. శస్త్రచికిత్సలు అవసరమయ్యే పలు రకాల కంటి వ్యాధులతో బాధపడేవారు ఈసారి తమకు ఊరట లభిస్తుందనుకున్నా.. అధికారుల తీరుతో ఆందోళన నెలకొంది. ‘కంటి వెలుగు’కు సంబంధించిన ప్రకటనల్లో, వివరాల్లో ఎక్కడా శస్త్రచికిత్సల ప్రస్తావన  రావడం లేదు.

గతంలో చేసిన పరీక్షల ప్రకారమే నాలుగున్నర లక్షల మందికిపైగా శస్త్రచికిత్సల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి దానికి అదనంగా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందువల్ల ఆపరేషన్లు చేయించే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు వయసు మీద పడుతున్న కొద్దీ కంటి సమస్యలు తీవ్రమవుతుంటాయని, అందువల్ల ఏటా కంటి పరీక్షలు నిర్వహించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

మసకబారుతున్న చూపు!
క్రితంసారి ఇచ్చిన కంటి అద్దాల్లో చాలామందికి ఇప్పుడవి పనిచేయడం లేదు. వారిలో చూపు మసకబారి దృష్టి లోపాలు పెరిగిపోతున్నాయి. వీరిలో కొందరు శస్త్రచికిత్స అవసరమైన స్థితికి చేరినట్టు అంచనా. కంటిచూపు బాధితుల్లో అధికులు పేద, మధ్య తరగతివారే. వీరిలో కొందరు అప్పోసప్పో చేసి ప్రైవేటులో చికిత్స చేయించుకుంటున్నా.. చాలామందికి ఆపరేషన్‌ చేయించుకునే స్తోమత లేక అంధత్వం బారిన పడుతున్నారు.

అప్పుడిచ్చిన అద్దాలు సరిగా పనిచేయట్లేదు.. 
ప్రభుత్వం కంటి వెలుగు పథకం కింద కంటి అద్దాలు ఇచ్చింది. అయితే కొన్నిరోజుల నుంచి అవి సరిగా పనిచేయట్లేదు. సరిగా కనిపించడం లేదు. ఆ అద్దాలు పెట్టుకోవట్లేదు. కొత్త అద్దాలు ఇవ్వాలి.
– తోకునూరి నర్సమ్మ, చింతపల్లి, సీరోలు మండలం, మహబూబాబాద్‌ జిల్లా

ఈసారైనా ఆపరేషన్‌ చేస్తారో..లేదో! 
నాకు ఒక కన్ను పూర్తిగా కనిపించదు. తొలివిడత కంటి వెలుగు కార్యక్రమంలో డాక్టర్లు పరీక్షించి.. ఆపరేషన్‌ చేయాలని చెప్పారు. ఇంతవరకు చేయలేదు. చాలా ఇబ్బంది అవుతోంది. ఈసారి చేయిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడైనా అవుతుందో లేదో..     
– రంగమ్మ, సోంపురం, కేటీదొడ్డి, జోగుళాంబ గద్వాల జిల్లా

కంటి వెలుగుకు సహకరిస్తాం 
ప్రభుత్వం పేదల కోసం మంచి కార్య క్రమం చేపట్టింది. దృష్టి సమస్యలతో బాధపడుతున్న వారికి కంటి పరీక్షలు నిర్వ హించి అద్దాలు ఇవ్వడం అభినందనీయం. ప్రభుత్వం పిలిస్తే ప్రైవేటుగా ప్రాక్టీసు చేస్తున్న వేలమంది ఆప్తా ల్మాలజిస్టులు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) తరఫున స్వచ్ఛందంగా కంటివెలుగులో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.
– డాక్టర్‌ బీఎన్‌ రావు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement