సాక్షి, హైదరాబాద్: ‘కంటి వెలుగు’కార్యక్రమం రికార్డు సృష్టించింది. రికార్డుస్థాయిలో కోటిమంది కళ్లల్లో వెలుగు నింపింది. ఒకవైపు ఎన్నికల ప్రచారం ఊపు మీదున్నా ‘కంటి వెలుగు’కార్యక్రమానికి ఏమాత్రం విఘాతం కలగలేదు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. ఆగస్టు 15న ప్రారంభమైన కంటి వెలుగు కింద బుధవారం నాటికి కోటి మందికి కంటి పరీక్షలు చేయడం దేశంలోనే ఒక రికార్డు అని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అభివర్ణిస్తున్నారు. ఈ మేరకు ఆ శాఖ బుధవారం ప్రభుత్వానికి నివేదిక పంపింది. దాని ప్రకారం... కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో 45.15 లక్షల మంది పురుషులు, 54.85 లక్షల మంది మహిళలున్నారు. కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో దాదాపు అందరూ 18 ఏళ్లకు పైబడినవారే. అంటే.. ఈ కోటి మంది ఓటర్లే కావడం గమనార్హం. వీరందరిపై అధికార పార్టీ ఆశలు పెట్టుకుంది. కోటి ఓట్లను కంటి వెలుగు ప్రభావితం చేస్తుందా లేదా అనేది చూడాలి. కంటి పరీక్షలు నిర్విఘ్నంగా కొనసాగుతుండటంతో లబ్ధిదారులు తమను గుర్తు పెట్టుకొని మరీ ఓటేస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
సగానికిపైగా బీసీలే...
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి లోపాలను గుర్తించాలనేది సర్కారు ఆలోచన. తద్వారా అవసరమైన వారికి కళ్లద్దాలు ఇవ్వడం, ఆపరేషన్లు నిర్వహించడం దీని ఉద్దేశం. కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో సగానికిపైగా బీసీలే కావడం గమనార్హం. ఈ వర్గాల వారంతా కూడా పేదలే కావడంతో కంటి సమస్యలను ఇన్నాళ్లు పట్టించుకోలేదు. చూపు కనిపించినా కనిపించకపోయినా అలాగే కాలం వెళ్లదీస్తూ వచ్చారు. అత్యవసర వైద్యానికే దిక్కులేనప్పుడు కంటి గురించి పట్టించుకునేవారే లేకుండా పోయారు. చివరకు ఎలాగోలా ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహించడంతో వారంతా ఆనందంలో ఉన్నారు.
16.66 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు...
కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో 36.61 శాతం మందికి ఏదో ఒక కంటి లోపం ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. అందులో 16.66 లక్షల మందికి అక్కడికక్కడే ఉచితంగా రీడింగ్ గ్లాసులు ఇచ్చారు. వారుకాకుండా చత్వారంతో బాధపడుతున్నవారు 12.95 లక్షల మంది ఉన్నారు. వారికి ప్రత్యేకంగా కళ్లద్దాలు తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో ఇప్పటివరకు 1.96 లక్షల మందికి చత్వారం గ్లాసులు అందజేశారు. వీరుగాక 4.47 లక్షల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉందని నిర్ధారణకు వచ్చారు. మరో 2.49 లక్షల మందికి ఇతరత్రా ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని వైద్యులు తేల్చారు. అందులో కొందరికి ఇప్పటికే ఆపరేషన్లు చేసినా, ప్రస్తుతం ఎన్నికలు కావడంతో మిగతావారికి బ్రేక్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఆపరేషన్లు చేస్తారని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment