సాక్షిప్రతినిధి, ఖమ్మం: కంటివెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ఈనెల 18న మధ్యాహ్నం ఒంటిగంటకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం నుంచి ప్రారంభిస్తారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కంటివెలుగు ఏర్పాట్లపై మంత్రి గురువారం ఖమ్మం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంటనే అన్ని జిల్లాల్లో కంటి పరీక్షలు మొదలుపెట్టేలా ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులు కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన సూచించారు.
పరీక్షలు నిర్వహించే అన్ని కేంద్రాలకు శుక్రవారం సాయంత్రానికల్లా కంటి పరీక్షల యంత్రాలు, అద్దాలు, మందులు చేరవేయాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతికి తెలపాలని చెప్పారు. జిల్లాస్థాయి అధికారులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని సమన్వయం చేసుకోవాలని, సంబంధిత బృందాలు ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఒకసారి వాట్సాప్‌లో వివరాలు అప్‌డేట్ చేయాలని మంత్రి సూచించారు.
ప్రచార కార్యక్రమాలు చేపట్టండి
ప్రజలకు కంటివెలుగుపై అవగాహన కల్పించేలా గ్రామాలు, పట్టణాల్లో ప్రచారం చేయాలని, వారికి అర్థమయ్యేలా పూర్తి వివరాలతో ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయాలని.. ఆధార్ కార్డు తప్పక తీసుకురావాలన్న విషయాన్ని చెప్పాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం ఎనిమిది నెలలు కొనసాగితే, ఈసారి వంద రోజుల్లో పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం గతంలో ఉన్న 827 బృందాలను ఈసారి 1,500కు పెంచామని చెప్పారు.
వైద్య బృందం సభ్యులకు పరీక్షా కేంద్రాలకు సమీపంలో వసతి ఏర్పాటుచేయాలన్నారు. విడతల వారీగా, 16,533 కేంద్రా (గ్రామాల్లో 12,763, పట్టణ ప్రాంతాల్లో 3,788)ల్లో క్యాంపులు ఏర్పాటు చేయనుండగా, ప్రాథమికంగా 30 లక్షల రీడింగ్ గ్లాస్‌లు, 25 లక్షల ప్రిస్కిప్షన్ అద్దాలను అవసరమైన వారికి ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వివరించారు.
క్యాంపులను సందర్శించాలి..
ఎంపీడీఓ, తహసీల్దార్, మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీఓలు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో డీఎంహెచ్‌ఓ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, ప్రోగ్రాం ఆఫీసర్లు కంటివెలుగు క్యాంపులను పర్యవేక్షించాలని మంత్రిహరీశ్‌రావు ఆదేశించారు. ప్రతిరోజూ క్యాంపులను సందర్శించేలా కలెక్టర్ టూర్ రూపొందించాలని.. మొత్తంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు పర్యవేక్షించాలని చెప్పారు.
గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులంతా ఇందులో భాగస్వాములై అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యానికి, సీఎం కేసీఆర్ సంకల్పానికి చేయూతనివ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఇ.రమేశ్‌రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, టీఎస్‌ఎంఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
18న సీఎం చేతులమీదుగా ‘కంటివెలుగు’ ప్రారంభం
Published Fri, Jan 13 2023 5:15 AM | Last Updated on Fri, Jan 13 2023 11:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment