వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అధికారులు
కరీంనగర్‌సిటీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 15 నుంచి అమలు చేసే కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించి గ్రామాల వారీగా మెడికల్ టీమ్‌లు పర్యటించే షెడ్యూల్ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కె జోషి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో కంటి వెలుగు, సాధారణ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు, హరితహారంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించేలా సంబంధిత మంత్రులు ప్రజాప్రతినిధులతో ఆగస్టు మొదటివారంలో సమావేశం నిర్వహించాలని సూచించారు. ఆగస్టు 15న ప్రారంభమయ్యే గ్రామాలను ముందుగానే నిర్ణయించి మెడికల్ టీంలను పంపించాలని సూచించారు.
అన్ని గ్రామాలలో కంటి వెలుగు కార్యక్రమం కవర్ అయ్యేలా చూడాలన్నారు. ప్రతీ మెడికల్ టీంలో మెడికల్ ఆఫీసర్, ఆప్టిమెర్రిక్ తప్పనిసరిగా ఉండాలన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరినీ పరీక్ష చేసేలా చూడాలన్నారు. ప్రజలకు ఉత్తమ కంటి వైద్య సేవలనందించాలన్నారు. అన్ని జిల్లాలకు తగినన్ని కళ్లజోడ్లను పంపించామని, రాష్ట్ర వ్యాప్తంగా 113 ఆసుపత్రులను గుర్తించామని, కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు.
ఆకుపచ్చ తెలంగాణకు పునరంకితమవ్వాలి..
నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని బుధవారం ముఖ్యమంత్రి గజ్వేల్‌లో ప్రారంభిస్తారని తెలిపారు. హరితహారంలో అందరూ భాగస్వాములై మొక్కలు నాటి ఆకుపచ్చ తెలంగాణ సాధనకు పునరంకితం కావాలన్నారు. రాష్ట్రంలో వర్షాల ఆరంభం నుంచి హరితహారం కొనసాగుతుందని, నాటిన మొక్కల రక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. నాటిన మొక్కలన్నింటికీ జియో ట్యాగింగ్ చేయాలన్నారు. జియోట్యాగింగ్ చేసిన వాటికే ఉపాధిహామీ నిధుల విడుదల ఉంటుందని తెలిపారు.మొక్కలు నాటే విధానం, సంరక్షించే పద్ధతులపై అటవీ, విద్యాశాఖలతో అవగాహన శిబిరాలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామం, ప్రతీ పాఠశాలకు స్వచ్ఛ పాఠశాల, హరిత పాఠశాల నినాదం చేరేలా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ
ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ స్టేష న్ల హేతుబద్ధీకరణ త్వరగా పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితా రూపకల్పన, పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు, హేతుబద్ధీకరణ బోగస్ ఓటర్ల తొలగింపు, చనిపోయిన ఓటర్ల తొలగింపు, నూతన ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై కలెక్టర్లు దృష్టి సారిం చాలన్నారు. దివ్యాంగుల కోసం పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక సౌకర్యాల ఏర్పాటుతో పాటు వారిని ఓటర్లుగా నమోదు చేయడానికి ప్రత్యేక కృషి చేయాలన్నారు.
ఓటర్లను చైతన్యం చేసే కార్యక్రమాలు నిర్వహించాలని, సమస్యలపై ప్రత్యేక దృ ష్టి సారించాలన్నారు. ఈవీఎంలు నిల్వ చేయడానికి అవసరమైన గోడౌన్‌లను సిద్ధం చేసుకోవాల ని సూచించారు. ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలుగా అధికారులను నియమించాలన్నారు. వీసీలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్‌వో అయేషా మస్రత్‌ఖానమ్, అంధత్వ నివారణ అధికారి రత్నమాల, డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌రావు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment