సాక్షి, హైదరాబాద్: ‘కంటి వెలుగు’కింద రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 3.5 కోట్ల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించనుంది. అందులో 40 లక్షల మందికి కళ్లద్దాలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు కళ్లద్దాలను ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ‘ఎస్సల్లార్’ సరఫరా చేయనుంది.
జిల్లాలకు ఇప్పటికే 32 లక్షల కళ్లద్దాలు..
ఇప్పటికే 32 లక్షల కళ్లద్దాలు జిల్లాలకు సరఫరా అయ్యాయి. మొత్తంగా 36 లక్షల కళ్లద్దాలు, రీడింగ్ గ్లాసులు సరఫరా చేస్తారు. వాటిని అక్కడికక్కడే తక్షణమే అందజేస్తారు. ఇతరత్రా లోపంతో బాధపడుతున్న వారికి ప్రిస్కిప్షన్ ఇస్తే సంబంధిత కంపెనీ మూడు, నాలుగు వారాల్లో సరఫరా చేయనుంది.
ఒక్కో కళ్లజోడు ఖరీదు రూ.100 కాగా, ఆ ప్రకారం ఎస్సల్లార్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. మొత్తం పరీక్షలు చేశాక దాదాపు 3 లక్షల మందికి శస్త్రచికిత్సలు అవసరం అవుతాయని సర్కారు అంచనా వేసింది. వారందరికీ ప్రభుత్వం ఉచిత శస్త్రచికిత్సలు చేయనుంది. ఇందుకోసం 114 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను, స్వచ్ఛంద సంస్థలను గుర్తించారు. మొత్తం కార్యక్రమాన్ని కస్టమైజ్డ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ద్వారా అమలు చేస్తారు.
150 శాశ్వత విజన్ సెంటర్లు
రాష్ట్రంలో అంధత్వ నివారణ లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కళ్లద్దాలు ఉచితంగా ఇవ్వడం, ఉచిత శస్త్రచికిత్సలు చేయడం, ఉచిత మందులు సరఫరా చేయడం ఇందులో కీలకమైనవి. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 106 కోట్ల రూపాయలు కేటాయించింది. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి యూనిట్‌గా కంటి పరీక్షలు జరుగుతాయి. మొత్తం 799 బృందాలను ఏర్పాటు చేశారు.
అందులో 940 మంది మెడికల్ ఆఫీసర్లు, వెయ్యి మంది కంటి వైద్య నిపుణులు ఉంటారు. వారికి సాయంగా ఎనిమిది వేల మంది సిబ్బంది ఉంటారు. వారంతా శిక్షణ పొందినవారే. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆరు నెలలపాటు అమలుచేస్తారు. భవిష్యత్తులో కంటి సమస్యతో బాధపడే వారికోసం 150 విజన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
వాటిలో బాధితులకు నిరంతరం కంటి వైద్యం అందుబాటులో ఉంచుతారు. ఇక ఆర్‌బీఎస్‌కే కార్యక్రమం ద్వారా బడి పిల్లలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తారు. కాగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తుంటే.. వైద్య ఆరోగ్య శాఖ మాత్రం విస్త్రృత ప్రచారం కల్పించడంలో విఫలమైందన్న విమర్శలు వినవస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment