eye treatment
-
AP: ఇంటింటా కంటి వెలుగు
సాక్షి, అమరావతి: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. కంటి సమస్యల నివారణే లక్ష్యంగా వైఎస్సార్ కంటి వెలుగు, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉండగా.. వీరిలో 1,24,71,561 (24 శాతానికి పైగా) ప్రజలకు కంటి వైద్య పరీక్షలు చేయించింది. చూపు సంబంధిత సమస్యలు గుర్తించి, వారికి అవసరమైన వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వమే చేయిస్తోంది. రాష్ట్రంలో కంటిచూపు సంబంధిత సమస్యల నివారణే లక్ష్యంగా ‘వైఎస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని 2019లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద తొలి రెండు విడతల్లో 60,393 పాఠశాలల్లో 66,17,613 విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. దృష్టి సమస్యలున్న 1,85,227 మంది విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వం కళ్లద్దాలు పంపిణీ చేయడంతోపాటు.. 310 మందికి కేటరాక్ట్ సర్జరీలు చేయించింది. 60 ఏళ్ల పైబడిన అవ్వాతాతల్లో కంటి సమస్యల నివారణ కోసం మూడో దశ కార్యక్రమాన్ని 2021లో మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా 47.57 లక్షల మంది వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి.. 46.22 లక్షల మందిలో కంటి సమస్యలు గుర్తించారు. మందులతో నయమయ్యే సమస్యలున్న 32.15 లక్షల మందికి ప్రభుత్వమే ఉచితంగా మందులు అందించింది. మరో 12.40 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయడంతోపాటు, 1.66 లక్షల మందికి కేటరాక్ట్ ఆపరేషన్లు చేయించింది. అన్నివర్గాల వారికీ వర్తింపు రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. గ్రామ, వార్డు స్థాయిల్లో నిర్వహిస్తున్న సురక్ష వైద్య శిబిరాల్లో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో చూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అన్నివర్గాల ప్రజలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇలా రెండు దశల్లో ఇప్పటివరకూ 10.96 లక్షల మందికి వైద్య శాఖ పరీక్షలు చేయించింది. 3.27 లక్షల మందిలో మందులతో నయమయ్యే సమస్యలు గుర్తించి అక్కడికక్కడే మందులు అందజేశారు. మరో 6,22,057 మందికి కళ్లద్దాలు అందజేసి.. 77,531 మందికి కేటరాక్ట్ ఆపరేషన్లను ప్రభుత్వమే చేయించింది. మొత్తంగా ఇప్పటివరకూ 2.44 లక్షల మందికి కేటరాక్ట్ సర్జరీలు, 20.20 లక్షల మందికి కళ్లద్దాలను ప్రభుత్వం అందించింది. -
శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు బద్రీనాథ్ కన్నుమూత
సాక్షి, చెన్నై: కంటి చికిత్స లతో ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్.ఎస్.బద్రీనాథ్(83) వయోభారంతో చెన్నైలో మంగళవారం కన్ను మూశారు. 1978లో శంకర నేత్రాలయ పేరిట స్వచ్ఛంద సంస్థను ఆయన ఏర్పాటు చేశారు. చెన్నై నుంగంబాక్కం కేంద్రంగా శంకర నేత్రాలయ ద్వారా అనేక బ్రాంచీలతో ఉచితంగా పేదలకు సేవలు అందించారు. రోజుకు కనీసం తన బృందం ద్వారా 1,200 మందికి చికిత్సలు, వంద మందికి ఆపరేషన్లు చేసే వారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1996లో పద్మభూషణ్‌తో కేంద్రం సత్క రించింది. అలాగే బీసీ రాయ్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. చెన్నై ట్రిప్లికేన్‌లో 1940 ఫిబ్రవరి 24న బద్రీనాథ్ జన్మించారు. 1962లో మద్రాస్ వైద్యకళాశా లలో వైద్య కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఆమెరి కాలో ఉన్నత విద్య ను అభ్యసించారు. 1970లో చెన్నై అడయార్‌లో వాలంటరీ హెల్త్ సర్వీస్ పేరిట సేవా కార్య క్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన మృతి నేత్ర వైద్య వర్గాల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. -
ప్రపంచంలోనే తొలిసారిగా కంటిమార్పిడి
న్యూయార్క్: ప్రపంచంలోనే తొలిసారిగా కంటి మార్పిడి శస్త్రచికిత్స అమెరికాలో జరిగింది. న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగాన్ వైద్య సంస్థకు చెందిన వైద్యులు ఈ ఘనత సాధించారు. కరెంట్ షాక్ ప్రమాదంలో ముఖంలో ఎడమ భాగం పూర్తిగా దెబ్బ తిన్న ఆరోన్ జేమ్స్ అనే మాజీ సైనికుడు కంటి మారి్పడి చేయించుకున్న తొలి వ్యక్తిగా రికార్డులకెక్కాడు. ఇందుకోసం వైద్యులు ఏకంగా 21 గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. ఇప్పటిదాకా కరోనాను మార్చిన ఉదంతాలున్నాయి గానీ ఇలా పూర్తిగా కంటినే కొత్తగా అమర్చడం మాత్రం ఇదే తొలిసారి. ‘‘మే 21న ఈ ఆపరేషన్ నిర్వహించాం. రోగికి మొత్తం ముఖం ఎడమ భాగమంతటితో పాటు ఎడమ కంటిని కూడా పూర్తిగా కొత్తగా అమర్చాం. మొత్తం ప్రక్రియలో ఏకంగా 140 మంది వైద్య నిపుణుల సేవలు తీసుకున్నాం. అతనికి ఎడమ కంటిలో చూపు రాలేదు. కాకపోతే ఆర్నెల్ల తర్వాత కూడా ఆ కన్ను పూర్తి ఆరోగ్యంతో ఉండటమే ఓ అద్భుతం. రెటీనాకు రక్తప్రసారం బాగా జరుగుతోంది. కంటికి రక్తం తీసుకొచ్చే నాళాల పనితీరు సజావుగా ఉంది. ఇది నిజంగా గొప్ప విషయం. చూపు కూడా ఎంతో కొంత వస్తే ఇంకా అద్భుతంగా ఉండేది’’ అని వైద్య బృందం వివరించింది. అయితే, ‘‘ఇది కేవలం కంటిని పూర్తిగా మార్చడం సాధ్యమేనని నిరూపించేందుకు చేసిన సాంకేతిక ఆపరేషన్ మాత్రమే. అయితే దాత తాలూకు మూల కణాలను, బోన్ మారోను దృష్టి నరంలో చొప్పించాం. కనుక చూపు వచ్చే ఆస్కారాన్నీ కొట్టిపారేయలేం’’ అని చెప్పింది! -
హైకోర్టులో ఉచిత దంత, కంటి చికిత్స శిబిరం
సాక్షి,హైదరాబాద్: హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్, రోహిణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి, దంత చికిత్స శిబిరాన్ని మంగళవారం హైకోర్టులో నిర్వహించారు. ఈ శిబిరాన్ని జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ప్రారంభించారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరంలో పలువురు న్యాయవాదులు కంటి, దంత చికిత్సతో పాటు మధుమేహ (షుగర్), రక్తపోటు (బీపీ)కు ఉచిత పరీక్షలు చేయించుకున్నారు. -
వైఎస్సార్ కంటి వెలుగుతో ఎందరికో చూపు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా చూపు కోల్పోయిన ఎంతో మందిలో వెలుగులు నింపినట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ పి.శ్యామ్‌ప్రసాద్ చెప్పారు. ఏపీ ఆప్తాల్మిక్ సొసైటీ (ఏపీవోఎస్) ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న 6వ రాష్ట్ర నేత్ర వైద్యుల సదస్సు ఐకాన్–2021ను శనివారం డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నేత్ర వైద్యంలో ఆధునిక పద్ధతులను వివరిస్తూ ముద్రించిన జర్నల్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా నేత్ర వైద్యుల సంఘం కార్యదర్శి డాక్టర్ నమ్రతా శర్మ, ఏపీ ఆప్తాల్మిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎం.పర్నికుమార్, ప్రధాన కార్యదర్శి ఎన్.విష్ణువర్ధన్‌రావు, ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ ఎ.శ్రీహరి, ఉపాధ్యక్షుడు డాక్టర్ జీఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అత్యాధునిక కంటి వైద్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి వైద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా రాష్ట్రంలోనే అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పానికి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి యాజమాన్యం అంగీకారం తెలిపింది. దీంతో సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కంటి ఆస్పత్రి ఏర్పాటుకానుంది. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్. రావు, వ్యవస్థాపక సభ్యుడు జి. ప్రతిభారావు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. కడపలో టెరిషియరీ కేర్ ఐ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ కేబినెట్లో తీసుకున్న నిర్ణయంపై ఆస్పత్రి యాజమాన్యం సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే.. రాష్ట్రంలో కాంప్రహెన్సివ్ ఐ కేర్‌కు సంబంధించి ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ ముఖ్యమంత్రితో ప్రాథమికంగా చర్చలు కూడా జరిపింది. ఈ సందర్భంగా ఏపీలో అంతర్జాతీయ స్థాయిలో కంటి ఆస్పత్రిని ఏర్పాటుచేయాలని.. అంధత్వ నివారణకు స్క్రీనింగ్ నుంచి సర్జరీ వరకూ అన్ని స్థాయిలలోనూ అత్యాధునిక వైద్యం ఇక్కడే అందించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధంచేయాలని సీఎం జగన్ సూచించగా.. అందుకు ఆస్పత్రి యాజమాన్యం సంసిద్ధత తెలిపింది. అంతేకాక.. రాష్ట్రంలోని అన్ని అనాధ శరణాలయాల్లోని చిన్నారులకు నేత్రవైద్య పరీక్షలు, చికిత్స ఉచితంగా చేసేందుకు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి ముందుకొచ్చింది. ఈ సమావేశంలో ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ ప్రశాంత్ గార్గ్, వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌రెడ్డి పప్పూరు, సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. -
'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్
doctor uses iPhone 13 Pro Max camera for eye treatment. వైద్య చరిత్రలో ఇదో అద్భుతం.అతి సున్నితమైన కంటి చూపును మెరుగు పరిచేందుకు ఓ డాక్టర్ యాపిల్ ఐఫోన్13ను ఉపయోగించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.ఫోన్లో ఉన్న మ్యాక్రోమోడ్ టెక్నాలజీని జోడించి కంటి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్లు సైతం 'డాక్టర్ బాబు'..కార్నియా రాపిడి నయమైందని అంటున్నారు.వినడానికి వింతగా ఉన్న ఇది మెడికల్ మిరాకిల్ అని అంటున్నారు వైద్య నిపుణులు. అమెరికా కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో అనే ప్రాంతానికి చెందిన టామీ కార్న్ టెక్సాస్ సౌత్ వెస్ట్రన్ మెడికల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. అనంతరం 21 సంవత్సరాలుగా కంటి వైద్యుడిగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం షార్ప్ మెమోరియల్ ఆస్పత్రిలో ప్రముఖ ఆప్తమాలజిస్ట్‌గా,డిజిటల్ ఇన్నోవేటర్(టెక్నాలజీతో చేసే వైద్యం)గా పనిచేస్తున్నారు. అయితే తాజాగా ఈయన,ఐఫోన్13 ప్రో మ్యాక్స్‌లో ఉన్న మ్యాక్రోమోడ్‌ని ఉపయోగించి'ఐ'ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంతేకాదు ఈ టెక్నాలజీ ద్వారా కంటి చూపు ఏ స్థాయిలో ఉందో గుర్తించి ఫోటోల్ని క్యాప్చర్ చేస్తున్నారు. ఆ ఫోటోల సాయంతో కార్నియా ఆపరేషన్ తరువాత వచ్చే రాపిడి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ఇలా సాధారణ ట్రీట్మెంట్తో పరిష్కరించలేని ఎన్నో సున్నితమైన సమస్యల్ని మ్యాక్రోమోడ్ ఫీచర్ తో కంటికి ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో లింక్డిన్లో పోస్ట్ చేశారు. మ్యాక్రోమోడ్ ఫీచర్ అంటే? ప్రొఫెషనల్‌గా ఫోటోలు తీయాలంటే ఫోటోగ్రాఫర్ కావాల్సిన అవసరం లేదు. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. సినిమాటిక్ మోడ్, మ్యాక్రోమోడ్ ఫీచర్ల సాయంతో సాధారణ లొకేషన్లలో అందంగా ఫోటోల్ని క్యాప్చర్ చేయోచ్చు.ఇప్పుడు ఐఫోన్13 ప్రో మ్యాక్స్‌లో ఉన్న మ్యాక్రోమోడ్ ఫీచర్‌ను ఉపయోగించే డాక్టర్ టామీ కార్న్ కంటి వైద్యం చేస్తున్నారు. ఫోన్లో ఎన్ని ఫోటో ఫీచర్స్ ఉన్నా..మ్యాక్రోమోడ్ చాలా ప్రత్యేకం. ఉదాహరణకు కంట్లో ఉన్న అతి సూక్ష్మమైన నలుసుని సైతం అడ్వాన్స్డ్ మ్యాక్రోమోడ్ టెక్నాలజీతో హెచ్డీ క్వాలిటీ ఫోటోల్ని తీయొచ్చు. ఐఫోన్13 ప్రో మ్యాక్స్‌తో ట్రీట్మెంట్.. కంటిలో ముందు భాగాన్ని కార్నియా అంటారు. ఇది చాలా పలచగా ఉంటుంది. వెలుతురిని కంటి లోపలి భాగాలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఇటీవల ఓ వ్యక్తి కార్నియా ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ ఆపరేషన్ తరువాత తాత్కాలికంగా కంటి లోపల రాపిడి జరుగుతుంది. ఆ సమస్యను అధిగ మించేలా ఐఫోన్ 13లో ఉన్న మ్యాక్రో మోడ్‌తో కంట్లో కార్నియాను చెక్ చేశారు. అనంతరం ఆ సమస్య గురించి డాక్టర్ టామీకార్న్ పేషెంట్‌ను అడగ్గా..తన కంటి చూపు మెరుగుపడిందని సంతోషంగా చెప్పాడు. ఆ పేషెంట్‌కు అందించిన ట్రీట్మెంట్ విధానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చదవండి: ఎవరబ్బా ఈ వీడియో తీసింది.. ఓ రేంజ్లో ఉంది -
మల్కాపూర్‌లో కంటి వెలుగుకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచిత కంటి పరీక్షలు చేయడంతోపాటు అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు, మందులు, శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు ఉద్దేశించిన కంటి వెలుగు పథకానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పంద్రాగస్టు రోజైన బుధవారం మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ఏర్పాట్లపై వైద్యారోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో సమీక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో కంటి చూపు సమస్యలతో ఏ ఒక్కరూ బాధపడకుండా చూడాలనే సదుద్దేశంతో ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. ఐదు నెలల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయితీల్లో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణకు 812 వైద్య బృందాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు సీఎంకు నివేదించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని గ్రామాల్లో, వార్డును యూనిట్‌గా తీసుకుని పట్టణాల్లో కంటి వెలుగు క్యాంపులను నిర్వహిస్తున్నట్లు వివరించారు. వైద్య బృందాలు మరింత నాణ్యమైన పని విధానాన్ని కనబరిచేందుకు వారానికి 2 రోజులు వారాంతపు సెలవులు ఇవ్వాలన్నారు. -
40 లక్షల మందికి కళ్లద్దాలు
సాక్షి, హైదరాబాద్: ‘కంటి వెలుగు’కింద రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 3.5 కోట్ల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించనుంది. అందులో 40 లక్షల మందికి కళ్లద్దాలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు కళ్లద్దాలను ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ‘ఎస్సల్లార్’ సరఫరా చేయనుంది. జిల్లాలకు ఇప్పటికే 32 లక్షల కళ్లద్దాలు.. ఇప్పటికే 32 లక్షల కళ్లద్దాలు జిల్లాలకు సరఫరా అయ్యాయి. మొత్తంగా 36 లక్షల కళ్లద్దాలు, రీడింగ్ గ్లాసులు సరఫరా చేస్తారు. వాటిని అక్కడికక్కడే తక్షణమే అందజేస్తారు. ఇతరత్రా లోపంతో బాధపడుతున్న వారికి ప్రిస్కిప్షన్ ఇస్తే సంబంధిత కంపెనీ మూడు, నాలుగు వారాల్లో సరఫరా చేయనుంది. ఒక్కో కళ్లజోడు ఖరీదు రూ.100 కాగా, ఆ ప్రకారం ఎస్సల్లార్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. మొత్తం పరీక్షలు చేశాక దాదాపు 3 లక్షల మందికి శస్త్రచికిత్సలు అవసరం అవుతాయని సర్కారు అంచనా వేసింది. వారందరికీ ప్రభుత్వం ఉచిత శస్త్రచికిత్సలు చేయనుంది. ఇందుకోసం 114 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను, స్వచ్ఛంద సంస్థలను గుర్తించారు. మొత్తం కార్యక్రమాన్ని కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ద్వారా అమలు చేస్తారు. 150 శాశ్వత విజన్ సెంటర్లు రాష్ట్రంలో అంధత్వ నివారణ లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కళ్లద్దాలు ఉచితంగా ఇవ్వడం, ఉచిత శస్త్రచికిత్సలు చేయడం, ఉచిత మందులు సరఫరా చేయడం ఇందులో కీలకమైనవి. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 106 కోట్ల రూపాయలు కేటాయించింది. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి యూనిట్‌గా కంటి పరీక్షలు జరుగుతాయి. మొత్తం 799 బృందాలను ఏర్పాటు చేశారు. అందులో 940 మంది మెడికల్ ఆఫీసర్లు, వెయ్యి మంది కంటి వైద్య నిపుణులు ఉంటారు. వారికి సాయంగా ఎనిమిది వేల మంది సిబ్బంది ఉంటారు. వారంతా శిక్షణ పొందినవారే. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆరు నెలలపాటు అమలుచేస్తారు. భవిష్యత్తులో కంటి సమస్యతో బాధపడే వారికోసం 150 విజన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. వాటిలో బాధితులకు నిరంతరం కంటి వైద్యం అందుబాటులో ఉంచుతారు. ఇక ఆర్బీఎస్కే కార్యక్రమం ద్వారా బడి పిల్లలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తారు. కాగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తుంటే.. వైద్య ఆరోగ్య శాఖ మాత్రం విస్త్రృత ప్రచారం కల్పించడంలో విఫలమైందన్న విమర్శలు వినవస్తున్నాయి. -
కళ్లకు కష్టాలు
వీరఘట్టం: నేత్ర చికిత్సలకు తెలుగుదేశం ప్రభుత్వం మంగళం పలికింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా నేత్ర చికిత్సలను నిర్వహించే శిబిరాలను రెండేళ్లుగా నిలిపివేసింది. ఓ వైపు కంటి వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుంటే.. మరో వైపు ప్రభుత్వం నుంచి వైద్యం అందని పరిస్థితి నెలకొంది. బాధితుల్లో ఆర్థిక స్థోమత ఉన్న వారు ప్రైవేటు కంటి ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకుంటున్నారు. ఆర్థిక స్థోమత లేని నిరుపేదలు మాత్రం స్వచ్ఛంద సంస్థలు నేత్ర శిబిరాలను ఎప్పుడు నిర్వహిస్తాయా అని ఆశగా ఎదురుచూస్తూ కాలం వెల్లబుచ్చుతున్నారు. ఇదీ పరిస్థితి జిల్లాలో 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటితో పాటు నాలుగు ఏరియా, సామాజిక ఆస్పత్రులు, జిల్లా కేంద్రంలో ప్రధాన ఆస్పత్రి రిమ్స్ ఉన్నాయి. అయితే జిల్లాలో ప్రస్తుతం 30 వేల మంది పైబడి కంటి రోగులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 40 ఏళ్లు దాటిన వారికి సాధారణంగా కంటి సమస్యలు వస్తుంటాయి. దీంతో ప్రతి ఏటా సుమారు 6 వేల వరకు కంటి రోగుల సంఖ్య పెరుగుతోంది. క్లస్టర్ విధానానికి మంగళం గతంలో వైద్య విధాన పరిషత్‌లో క్లస్టర్ విధానం ఉండేది. జిల్లా అంధత్వ నివారణ శాఖ ఆధ్వర్యంలో ఈ క్లస్టర్ పరిధిలో ఉండే ఆప్తాలమిస్టు కంటి రోగులకు గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి వారం నేత్ర శిబిరాలు నిర్వహించి స్వచ్ఛంద సంస్థల ద్వారా శస్త్ర చికిత్సలు జరిపించేవారు. అయితే 2016 జూలై 13న క్లస్టర్ విధానానికి ప్రభుత్వం మంగళం పలికింది. విజన్ సెంటర్లు అంటూ కొత్త విధానం తీసుకు వచ్చింది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి వారం జరిగే నేత్ర శిబిరాలు నిలిచిపోయాయి. గ్రామీణ ప్రాంత కంటి రోగులకు నేత్ర చికిత్సలు కరువయ్యాయి. విజన్ సెంటర్లకు స్పందన కరువు వైద్య విధాన పరిషత్‌లో క్లస్టర్ విధానం రద్దు చేసిన తర్వాత జిల్లాలో రణస్థలం, రాజాం, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, నరసన్నపేట, పలాస, పాతపట్నంలో కంటి రోగుల కోసం విజన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లలో 14 మంది ఆప్తాలమిస్టులు ఉన్నారు. అయితే ఈ విజన్సెంటర్లు కంటి రోగులకు సరైన సేవలు అందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు పాలకొండ, హరిపురం, టెక్కలి, శ్రీకాకుళం, కొత్తూరులో సర్వీసు సెంటర్లు ఉన్నాయి. వీటిలో ఉన్న ఆరుగురు ఆపరేషన్ సర్జన్లు ద్వారా కంటి తనిఖీలు, శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. అయితే దూరప్రాంతాలలో ఉన్న గ్రామీణులు ఈ సేవలను వినియోగించుకోలేక పోతున్నారు. గతంలో వలే ప్రతి మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి వారం ఆరోగ్య చికిత్సలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ విధానం మార్చలేం గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించే నేత్ర శిబిరాలను ప్రభుత్వం నిలిపేసింది. ఇది ప్రభుత్వ విధానం. మేం ఏమీ చేయలేం. ప్రస్తుతం విజన్ సెంటర్లతో పాటు ఏరియా, సామాజిక ఆస్పత్రుల్లో నేత్ర వైద్య పరీక్షలు చేస్తున్నాం. ఏ గ్రామంలోనైనా నేత్ర రోగులు ఎక్కువగా ఉంటే సమాచారం ఇవ్వాలి. అక్కడ ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహిస్తాం.– డాక్టర్ రమణకుమార్,అంధత్వ నివారణశాఖ,జిల్లా ప్రొగ్రాం అధికారి, శ్రీకాకుళం -
స్వామిగౌడ్ హెల్త్ బులిటెన్ విడుదల
-
ఢిల్లీకి కేసీఆర్
23న కోవింద్ ‘రాష్ట్రపతి’ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న కేసీఆర్ కేంద్ర మంత్రులతో భేటీ.. కంటి శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు. కొన్ని అధికారిక కార్యక్రమాలతో పాటు కేసీఆర్ తన కంటికి శస్త్ర చికిత్స కూడా చేయించుకుంటారని తెలిసింది. నిజానికి ఈ శస్త్రచికిత్స కోసం మే లోనే సీఎం తన కుటుంబసభ్యులతో పాటు ఢిల్లీ వెళ్లారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు, కొద్ది రోజుల తర్వాతే శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించినట్టు సమాచారం. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. కోవింద్ అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఆ మేరకు ఈ పర్యటనలో శస్త్ర చికిత్స చేయించుకోవచ్చని టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. -
నగరంలో మారిషస్ ప్రధానికి శస్త్రచికిత్స
హైదరాబాద్: మారిషస్ ప్రధానమంత్రి అనిరుధ్ జగన్నాథ్ గురువారం సోమాజిగూడలోని మ్యాక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కంటి పరీక్షలు చేయించుకున్నారు. మ్యాక్సీవిజన్ ఐ హాస్పిటల్స్ కో చైర్మన్, చీఫ్ సర్జన్ డాక్టర్ కాసు ప్రసాద్‌రెడ్డి ఆయనకు పరీక్షలు చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కాసు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ మారిషస్ ప్రధానమంత్రి అనిరుధ్ జగన్నాథ్ తన కంటి చికిత్స కోసం హైదరాబాద్‌ను అందులోనూ మాక్స్ విజన్‌ను వైద్యానికి ఎంచుకోవడం గర్వకారణంగా ఉందని, బారతదేశంలో ఉన్న మెడికల్ టెక్నాలజీ, సదుపాయాలపై ఆయనకు మంచి అభిప్రాయం ఉందని పేర్కొన్నారు. అనిరుధ్ జగన్నాథ్ (84) రెండు నేత్రాల్లో గ్లకోమా, కాటరాక్ట్‌లు ఉండటం వల్ల ఆపరేషన్ క్లిష్టంగా మారిందని, అయినా ఒక్కో నేత్రానికి విడిగా శస్త్ర చికిత్స చేసి విజయవంతం చేశామన్నారు. అనిరుధ్ జగన్నాథ్‌కు భారతీయ వైద్యం గురించి మంచి అవగాహన ఉందని, భారత్‌తో సత్సంబంధాలు మెరుగుపరిచేలా ఆయన కృషి చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.