
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచిత కంటి పరీక్షలు చేయడంతోపాటు అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు, మందులు, శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు ఉద్దేశించిన కంటి వెలుగు పథకానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పంద్రాగస్టు రోజైన బుధవారం మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ఏర్పాట్లపై వైద్యారోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్షించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో కంటి చూపు సమస్యలతో ఏ ఒక్కరూ బాధపడకుండా చూడాలనే సదుద్దేశంతో ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. ఐదు నెలల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయితీల్లో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణకు 812 వైద్య బృందాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు సీఎంకు నివేదించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని గ్రామాల్లో, వార్డును యూనిట్‌గా తీసుకుని పట్టణాల్లో కంటి వెలుగు క్యాంపులను నిర్వహిస్తున్నట్లు వివరించారు. వైద్య బృందాలు మరింత నాణ్యమైన పని విధానాన్ని కనబరిచేందుకు వారానికి 2 రోజులు వారాంతపు సెలవులు ఇవ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment