నేత్ర వైద్య పరీక్షలు చేస్తున్న ఆప్తాలమిస్టు
వీరఘట్టం: నేత్ర చికిత్సలకు తెలుగుదేశం ప్రభుత్వం మంగళం పలికింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా నేత్ర చికిత్సలను నిర్వహించే శిబిరాలను రెండేళ్లుగా నిలిపివేసింది. ఓ వైపు కంటి వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుంటే.. మరో వైపు ప్రభుత్వం నుంచి వైద్యం అందని పరిస్థితి నెలకొంది. బాధితుల్లో ఆర్థిక స్థోమత ఉన్న వారు ప్రైవేటు కంటి ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకుంటున్నారు. ఆర్థిక స్థోమత లేని నిరుపేదలు మాత్రం స్వచ్ఛంద సంస్థలు నేత్ర శిబిరాలను ఎప్పుడు నిర్వహిస్తాయా అని ఆశగా ఎదురుచూస్తూ కాలం వెల్లబుచ్చుతున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటితో పాటు నాలుగు ఏరియా, సామాజిక ఆస్పత్రులు, జిల్లా కేంద్రంలో ప్రధాన ఆస్పత్రి రిమ్స్ ఉన్నాయి. అయితే జిల్లాలో ప్రస్తుతం 30 వేల మంది పైబడి కంటి రోగులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 40 ఏళ్లు దాటిన వారికి సాధారణంగా కంటి సమస్యలు వస్తుంటాయి. దీంతో ప్రతి ఏటా సుమారు 6 వేల వరకు కంటి రోగుల సంఖ్య పెరుగుతోంది.
క్లస్టర్ విధానానికి మంగళం
గతంలో వైద్య విధాన పరిషత్‌లో క్లస్టర్ విధానం ఉండేది. జిల్లా అంధత్వ నివారణ శాఖ ఆధ్వర్యంలో ఈ క్లస్టర్ పరిధిలో ఉండే ఆప్తాలమిస్టు కంటి రోగులకు గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి వారం నేత్ర శిబిరాలు నిర్వహించి స్వచ్ఛంద సంస్థల ద్వారా శస్త్ర చికిత్సలు జరిపించేవారు. అయితే 2016 జూలై 13న క్లస్టర్ విధానానికి ప్రభుత్వం మంగళం పలికింది. విజన్ సెంటర్లు అంటూ కొత్త విధానం తీసుకు వచ్చింది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి వారం జరిగే నేత్ర శిబిరాలు నిలిచిపోయాయి. గ్రామీణ ప్రాంత కంటి రోగులకు నేత్ర చికిత్సలు కరువయ్యాయి.
విజన్ సెంటర్లకు స్పందన కరువు
వైద్య విధాన పరిషత్‌లో క్లస్టర్ విధానం రద్దు చేసిన తర్వాత జిల్లాలో రణస్థలం, రాజాం, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, నరసన్నపేట, పలాస, పాతపట్నంలో కంటి రోగుల కోసం విజన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లలో 14 మంది ఆప్తాలమిస్టులు ఉన్నారు. అయితే ఈ విజన్‌సెంటర్లు కంటి రోగులకు సరైన సేవలు అందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు పాలకొండ, హరిపురం, టెక్కలి, శ్రీకాకుళం, కొత్తూరులో సర్వీసు సెంటర్లు ఉన్నాయి. వీటిలో ఉన్న ఆరుగురు ఆపరేషన్ సర్జన్లు ద్వారా కంటి తనిఖీలు, శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. అయితే దూరప్రాంతాలలో ఉన్న గ్రామీణులు ఈ సేవలను వినియోగించుకోలేక పోతున్నారు. గతంలో వలే ప్రతి మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి వారం ఆరోగ్య చికిత్సలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ విధానం మార్చలేం
గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించే నేత్ర శిబిరాలను ప్రభుత్వం నిలిపేసింది. ఇది ప్రభుత్వ విధానం. మేం ఏమీ చేయలేం. ప్రస్తుతం విజన్ సెంటర్లతో పాటు ఏరియా, సామాజిక ఆస్పత్రుల్లో నేత్ర వైద్య పరీక్షలు చేస్తున్నాం. ఏ గ్రామంలోనైనా నేత్ర రోగులు ఎక్కువగా ఉంటే సమాచారం ఇవ్వాలి. అక్కడ ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహిస్తాం.– డాక్టర్ రమణకుమార్,అంధత్వ నివారణశాఖ,జిల్లా ప్రొగ్రాం అధికారి, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment