సాక్షి, అమరావతి: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. కంటి సమస్యల నివారణే లక్ష్యంగా వైఎస్సార్ కంటి వెలుగు, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉండగా.. వీరిలో 1,24,71,561 (24 శాతానికి పైగా) ప్రజలకు కంటి వైద్య పరీక్షలు చేయించింది. చూపు సంబంధిత సమస్యలు గుర్తించి, వారికి అవసరమైన వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వమే చేయిస్తోంది. రాష్ట్రంలో కంటిచూపు సంబంధిత సమస్యల నివారణే లక్ష్యంగా ‘వైఎస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని 2019లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమం కింద తొలి రెండు విడతల్లో 60,393 పాఠశాలల్లో 66,17,613 విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. దృష్టి సమస్యలున్న 1,85,227 మంది విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వం కళ్లద్దాలు పంపిణీ చేయడంతోపాటు.. 310 మందికి కేటరాక్ట్ సర్జరీలు చేయించింది. 60 ఏళ్ల పైబడిన అవ్వాతాతల్లో కంటి సమస్యల నివారణ కోసం మూడో దశ కార్యక్రమాన్ని 2021లో మొదలుపెట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 47.57 లక్షల మంది వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి.. 46.22 లక్షల మందిలో కంటి సమస్యలు గుర్తించారు. మందులతో నయమయ్యే సమస్యలున్న 32.15 లక్షల మందికి ప్రభుత్వమే ఉచితంగా మందులు అందించింది. మరో 12.40 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయడంతోపాటు, 1.66 లక్షల మందికి కేటరాక్ట్ ఆపరేషన్లు చేయించింది.
అన్నివర్గాల వారికీ వర్తింపు
రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. గ్రామ, వార్డు స్థాయిల్లో నిర్వహిస్తున్న సురక్ష వైద్య శిబిరాల్లో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో చూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అన్నివర్గాల ప్రజలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇలా రెండు దశల్లో ఇప్పటివరకూ 10.96 లక్షల మందికి వైద్య శాఖ పరీక్షలు చేయించింది.
3.27 లక్షల మందిలో మందులతో నయమయ్యే సమస్యలు గుర్తించి అక్కడికక్కడే మందులు అందజేశారు. మరో 6,22,057 మందికి కళ్లద్దాలు అందజేసి.. 77,531 మందికి కేటరాక్ట్ ఆపరేషన్లను ప్రభుత్వమే చేయించింది. మొత్తంగా ఇప్పటివరకూ 2.44 లక్షల మందికి కేటరాక్ట్ సర్జరీలు, 20.20 లక్షల మందికి కళ్లద్దాలను ప్రభుత్వం అందించింది.
Comments
Please login to add a commentAdd a comment