యూపీ కుర్రాడి ఘనత
ఐఐటీ ముంబై టెక్‌ఫెస్ట్‌లో ఆవిష్కరణ
లఖీంపూర్‌ఖేరీ(ఉత్తరప్రదేశ్): అజ్ఞానాంధకా రంలో మగ్గిపోతున్న వారికి అక్షరజ్ఞానం పంచితే వారి జీవితం వెలుగులమయం అవుతుందని పెద్దలంటారు. అంధత్వం లేకపోయినా తీవ్రస్థాయిలో దృష్టిలోపంతో బాధపడే వాళ్ల ప్రపంచం ఒక రకంగా చీకటిమయం. వారి ప్రపంచాన్ని వెలుగుమయం చేసేందుకు ఓ యువకుడు బయల్దేరాడు. వినూత్న ఆవిష్క రణలు చేస్తూ తీవ్ర దృష్టిలోప బాధితులకు అండగా నిలబడ్డారు. అధునాతన కృత్రిమ మేధతో పనిచేసే స్మార్ట్ కళ్లద్దాలను ఆవిష్కరించారు. స్మార్ట్ నీళ్లసీసా, నేలసారాన్ని కొలిచే స్మార్ట్ పరికరం తయారుచేసి ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన 28 ఏళ్ల మునీర్ ఖాన్ తాజాగా ‘ఏఐ విజన్ ప్రో’ పేరిట కొత్తరకం కళ్లజోడును సృష్టించాడు.
ఈనెల 17న ఐఐటీ ముంబైలో జరిగిన టెక్‌ఫెస్ట్‌లో దీనిని ఆవిష్కరించారు. ‘‘ తీవ్ర దృష్టిలోపం ఉన్న వాళ్లు కృత్రిమ మేధతో పనిచేసే ఈ కళ్లద్దాలు ధరిస్తే తమ రోజువారీ పనులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసు కోవచ్చు. సెన్సార్లు, కెమెరాలు, ఎన్‌విడి యా జెట్సాన్ ప్రాసెసర్లు, లీడార్ సాంకేతికత, ఏఐ మోడల్ కంప్యూటేషన్‌లతో ఇది పనిచేస్తుంది. కళ్లద్దాల ముందున్న అంశాలను రియల్‌టైమ్‌లో సంగ్రహించి, ధరించిన వారికి దిశానిర్దేశం చేస్తుంది. ఇది ధరిస్తే ఎదుటి వారి ముఖాలను గుర్తు పట్టొచ్చు. అనారోగ్యం వేళ వేసుకోవాల్సిన మందులు, ఆహారం మధ్య తేడాలను చెప్తుంది. నడిచేటప్పుడు దారిలో అడ్డుగా ఏవైనా ఉంటే హెచ్చరిస్తుంది. చుట్టుపక్కల సమీపంలో ఏమేం ఉన్నాయో చెబుతుంది. ముద్రించిన వాటిని చదివేందుకు సాయపడుతుంది’’ అని మునీర్ చెప్పారు.
మట్టిలో మాణిక్యం
ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ఖేరీలో గౌరి యా గ్రామం మునీర్ సొంతూరు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మునీర్‌ను పేద రికం వెక్కిరించింది. తను ఏడాది వయసు ఉన్నప్పుడు తండ్రి చనిపోయారు. చదువు ల్లో మేటి అయిన మునీర్‌ను ఎలాగైనా చదివించాలని ఆయన తల్లి, నలుగురు అన్నయ్యలు ఎంతో కష్టపడ్డారు. సొంతూరిలో పదో తరగతి దాకా ప్రభుత్వ పాఠశాలలో చదివిన మునీర్ తర్వాత ఇంటర్ మాత్రం ప్రైవేట్‌లో పూర్తిచేశాడు. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లోని భీమ్‌టాల్‌లో ఉన్న బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్‌లో అడ్మిషన్ సాధించాడు.
రెండో ఏడాదిలోనే ఫ్రాన్స్, రష్యాల నుంచి పరిశోధనా ఇంటర్న్‌షిప్‌లను సాధించి ఔరా అనిపించాడు. కృత్రిమ మేధ, సెన్సార్ టె క్నాలజీలపై ఆసక్తితో వాటిలో పరిశోధనలు చేశాడు. కొలంబియా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తిచేశాక అమెరికా, భారత్‌లో కార్యకలాపాలు కొనసాగించేలా క్యాడర్ టెక్నాలజీస్ సంస్థను స్థాపించాడు. కొలంబియాలో చదువుకునే రోజుల్లోనే హైడ్రోహోమీ పేరిట స్మార్ట్ వాటర్ బాటిల్‌ను తయారుచేశాడు.
భారత్‌లో రైతన్నలకు సాయపడేలా మరో అద్భుత ఆవిష్కరణ చేశాడు. నేలసారం ఏ స్థాయిలో ఉందో తెల్సుకునేందుకు పరిశోధనశాలకు మట్టి నమూనాలను పంపాల్సిన పనిలేకుండా చిన్న పరికరంపై మట్టిని ఉంచితే కొద్దిసేపట్లోనే ఆ నేలలోని ధాతువులు, మూలకాల పరిమాణాన్ని, నేలతీరును ఇట్టే చెప్పేస్తుంది. ‘స్మార్ట్ సాయిల్ టెస్టింగ్ డివైజ్’గా అందుబాటులోకి వచ్చిన ఈ పరికరంతో మునీర్ ఈ ఏడాది యువ శాస్త్రవేత్త అవార్డ్‌ను సైతం జూలైలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment