![Maldives hopes on Indian tourists](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/333.jpg.webp?itok=_V-iMqop)
భారత పర్యాటకుల రాకపైనే మాల్దీవుల ఆశ
ఈ ఏడాది 3 లక్షల మంది భారతీయ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యం
2023లో దౌత్య సంబంధాల కారణంగా మాల్దీవులను బహిష్కరించిన భారత పర్యాటకులు
2020–23 వరకు మాల్దీవులకు పోటెత్తిన భారతీయులు
2024లో 6వ స్థానానికి పడిపోయిన అక్కడి పర్యాటకం
సాక్షి, అమరావతి: పర్యాటక రంగమే కీలక ఆదాయ వనరుగా ఉన్న మాల్దీవుల ప్రభుత్వం భారతీయుల రాకపై ఆశలు పెట్టుకుంది. భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ఎన్నడూ లేనివిధంగా వినూత్న నిర్ణయాలతో అడుగులు వేస్తోంది. 2023లో మాల్దీవుల మంత్రులు భారత ప్రధాని మోదీపై అవమానకర రీతిలో విమర్శలు చేశారు. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఈ నేపథ్యంలో భారతీయ పర్యాటకులు ఘాటుగా స్పందించి మాల్దీవుల పర్యాటకాన్ని బహిష్కరించారు. చాలా ట్రావెల్ కంపెనీలు సైతం మాల్దీవుల పర్యాటకాన్ని బ్లాక్ లిస్టు చేశాయి. దీంతో మాల్దీవుల పర్యాటకంలో కీలకంగా ఉండే భారతీయులు భారీగా తగ్గిపోయారు.
ఫలితంగా ఆదాయ వనరులు క్షీణించడంతో పాటు అక్కడి స్థానికుల ఉపాధికి తీవ్ర విఘాతం ఏర్పడింది. ఈ క్రమంలో దౌత్య సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు గత అక్టోబర్‌లో మాల్దీవులు అధ్యక్షుడు ముయిజు భారతదేశాన్ని సందర్శించారు. ఈ తర్వాత రెండు నెలల్లో పర్యాటకుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది.
3 లక్షల మందిని ఆకర్షించే లక్ష్యంతో..
మాల్దీవుల పర్యాటకంలో భారతీయలే అగ్రస్థానంలో ఉండేవారు. కోవిడ్–19 తర్వాత 2020–23 వరకు ఇదే పరిస్థితి ఉండేది. కానీ.. దౌత్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత మాల్దీవులకు భారతీయ పర్యాటకులు తగ్గిపోయారు. 2023లో 18.87 లక్షల మంది విదేశీ పర్యాటకులు మాల్దీవులకు వెళ్లగా.. గతేడాది 20.46 లక్షలకు పెరిగారు. ఇందులో చైనా మొదటి స్థానం, రష్యా రెండో స్థానంలో నిలిచింది.
గత ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు ద్వీప సమూహ దేశానికి భారత పర్యాటకుల సందర్శనలు తగ్గిపోయాయి. 2023లో 2.09 లక్షల మంది పర్యటిస్తే 2024లో 1.30 లక్షలకు పడిపోయారు. 2024లో ఆక్కడి పర్యాటకం 6వ స్థానానికి పడిపోయింది. ఈ క్రమంలో భారతీయులపై గంపెడాశలు పెట్టుకున్న మాల్దీవుల ప్రభుత్వం ఈ ఏడాది 3 లక్షల మంది భారతీయ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ప్రణాళికలు వేస్తోంది.
విమాన సర్వీసులు పెంపు
భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు నెలవారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు మాల్దీవుల ప్రభుత్వం ప్రకటించింది. దేశీయ మీడియాలో విస్తృత ప్రచారంతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించాలని భావిస్తోంది. ఇక మాల్దీవుల్లో క్రికెట్ వేసవి శిబిరాలను కూడా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
పర్యాటకులకు సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా భారతదేశంలోని మరిన్ని గమ్యస్థానాల నుంచి విమాన సర్వీసులు నడిపేందుకు చర్యలు చేపడుతోంది. కోల్‌కతా, పుణె, చెన్నై వంటి కొత్త గమ్యస్థానాల నుంచి విమానాలు నడపనుంది.
Comments
Please login to add a commentAdd a comment