ఆదివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు జీఆర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి తదితరులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించేందుకు వైద్యారోగ్య శాఖ సర్వ సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేసుకుని రంగంలోకి దిగాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న కంటి పరీక్షలపై ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం సమీక్షించారు.
ఓ అంచనాకు రండి..
‘రాష్ట్రంలో ఎన్ని కంటి పరీక్షా శిబిరాలు నిర్వహించాలో తొలుత నిర్ధారించాలి. ఒక వైద్య బృందం ఒక రోజుకు ఎంత మందికి పరీక్ష చేయగలుగుతుందో అంచనాకు రావాలి. అందుకు అనుగుణంగా జనాభాను బట్టి ప్రతి గ్రామానికి అవసరమైనన్ని వైద్య బృందాలను పంపాలి. ఒకే రోజు గ్రామంలోని అందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలి. వరుసగా ఒక్కో గ్రామం పూర్తి చేయాలి. వైద్య బృందానికి వారంలో ఐదు రోజులు మాత్రమే పని కల్పించాలి. పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన పరికరాలను ముందే సమకూర్చుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 900 వైద్య బృందాలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే పొరుగు రాష్ట్రాల కంటి వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలి’ అని ఆదేశించారు. కంటి పరీక్షలు నిర్వహించిన తర్వాత అవసరమైన వారికి వెంటనే కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేయాలని సూచించారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని గుర్తించి కంటి వైద్యశాలలకు రిఫర్ చేయాలన్నారు.
విస్తృత ప్రచారం చేయాలి..
‘గ్రామాలు, పట్టణాల్లో చాలా మంది కంటి జబ్బులతో బాధ పడుతున్నారు. కంటి జబ్బు ఉన్నా గుర్తించకుండా నెట్టుకొస్తున్న వారు కూడా ఉన్నారు. అందరికీ ముందుగా అవగాహన కల్పించాలి. ప్రభుత్వం నిర్వహించే కంటి వైద్య శిబిరాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి’ అని సీఎం పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు జీఆర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ వాకాటి కరుణ, వైద్యారోగ్య శాఖ ఓఎస్‌డీ గంగాధర్, చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎన్‌పీసీబీ డైరెక్టర్ మోతీలాల్ నాయక్, సీఐవో గోపీకాంత్ రెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment