సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల ఆరోగ్య సమాచార (హెల్త్ ప్రొఫైల్) రూపకల్పన కార్యక్రమంపై అయోమయం నెలకొంది. అన్ని గ్రామాల్లోని ప్రజలకు రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే విషయంపై వైద్యారోగ్య శాఖ తన నిర్ణయం మార్చుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రకాల పరీక్షలు చేయడం సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చింది. ముందుగా అనుకున్న ప్రకారం 50 రకాల పరీక్షలు కాకుండా.. కేవలం కంటి పరీక్షలకే పరిమితమవుతోంది. రోగ నిర్ధారణ పరీక్షలు చేసే పరికరాలు, వైద్య సిబ్బంది లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో కంటి పరీక్షలు మాత్రమే నిర్వహించేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇందులోనూ ఆలస్యం జరుగుతోంది. మొదట ఏప్రిల్‌లోనే కంటి పరీక్షలు నిర్వహించాలని భావించినా.. కళ్లద్దాలు, సిబ్బంది పూర్తిగా లేకపోవడంతో ఆలస్యమవుతోంది.
వసతులు లేవు..
వేసవిలో రాష్ట్ర మంతటా ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల క్రితమే నిర్ణయించింది. గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను విస్తృతంగా నిర్వహించి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను పూర్తి చేయాలని భావించింది. రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల పనితీరు, రక్తంలో కొవ్వు, హిమోగ్లోబిన్, కాలేయం పనితీరు, దంత తదితర 50 రకాల పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. కంటి పరీక్షలను ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. వాస్తవ పరిస్థి తులను పట్టించుకోకుండా ఈ విషయంలో హడావుడి చేశారు. మార్చి, ఏప్రిల్, మే, జూన్‌లో వీలైనంత మం దికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. సంచార వైద్య సేవలు నిర్వహించే వాహనం లోనే రోగ నిర్ధారణ పరికరాలను అమర్చి పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహి స్తామని తెలిపారు.
అనంతరం క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక తెప్పించారు. ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని, ఆరోగ్య ఉప కేంద్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని నివేదికల్లో తేలింది. కొన్ని ఏరియా ఆస్పత్రు ల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడా పరికరాలు ఉన్న దాఖలాలు లేవు. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన వైద్య శాఖ ఉన్నతాధికారులు అన్ని పరీక్షలు చేయడం తమ వల్ల కాదని ప్రభుత్వానికి నివేదించారు. తప్పనిసరిగా పరీక్షలు చేయాల్సి వస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు అన్నింటికీ అవసరమైన పరికరాలను సమకూర్చాలని సూచించారు. దీంతో అన్ని పరీక్షల అంశం పక్కనపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
తెలంగాణ కంటి వెలుగు..
రాష్ట్రవ్యాప్తంగా ఏటా కొందరికి పలు రోగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 15 ఏళ్లలోపు వారికి పరీక్షలు చేస్తున్నారు. 104 సంచార వైద్య సేవల ఆధ్వర్యంలో పెద్ద వయస్సు వారిలో కొందరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీన్ని విస్తరించాలని భావించినా పరికరాలు, సిబ్బంది కొరత కారణంగా ఇప్పుడే ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో కంటి పరీక్షల నిర్వహణకు ‘తెలంగాణ కంటి వెలుగు’ పేరుతో ఈ కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ రూపొందించింది. రాష్ట్రంలోని అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్యం అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. కళ్లద్దాల కొనుగోలు, పరీక్షల నిర్వహణ పరికరాలు, తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకం, సిబ్బంది శిక్షణ, పరీక్ష కేంద్రాల ఏర్పాట్లకు రూ.100 కోట్లు అవసరమవుతాయని ప్రణాళిక రూపొంచింది. ఈ నిధుల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రాగానే కార్యక్రమం మొదలుకానుంది.
కంటి పరీక్షలు మాత్రమే..
Published Tue, Apr 10 2018 1:55 AM | Last Updated on Tue, Apr 10 2018 1:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment