ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వికారాబాద్ : సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఏ ప్రాణికైనా అన్ని అవయవాల్లోకెల్లా అతి ముఖ్యమైనవి కళ్లు. ఇవి ఉంటేనే విశ్వంలో దేన్నయినా చూడగలం. ముఖ్యంగా మానవునికి చూపు బాగుంటేనే ఏ పనినైనా సక్రమంగా నిర్వర్తించగలడు. పాశ్చాత్య, అభివృద్ధి చెందిన దేశాల్లో వైద్యం, బీమాకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దాదాపు 30శాతం మంది మూడు పూటలా తిండికి కరువై.. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే చెబుతోంది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పౌష్టికాహారం అందకపోవడంతో నేత్ర సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించింది. ఈ రోజుల్లో కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు ఖరీదైపోయాయి. ఆర్థిక స్థోమత అంతంతమాత్రంగానే ఉన్నవారు కంటి పరీక్షలు చేయించుకోలేక పోతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. చక్కని చూపు కోసం ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ఈ ప్రక్రియ మొదలు పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
వాస్తవానికి ఈ శిబిరాలు ఏప్రిల్ నెలలోనే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ రైతుబంధు పథకం అమలులో అధికారులు బిజీగా ఉన్న కారణంగా వచ్చేనెల నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే చెక్కుల పంపిణీ, పాసుపుస్తకాల పంపిణీ కోసం వచ్చే 20 వరకు గడువు పొడిగించడంతో.. ఈ కార్యక్రమం నిర్దేశిత సమయానికి ప్రారంభమవుతుందా.. లేదా అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
నిత్యం 25 గ్రామాల్లో పరీక్షలు...
జిల్లాలో 367 గ్రామపంచాయతీలు, 501 రెవెన్యూ గ్రామాలున్నాయి. మొత్తం జనాభా 9,67,356 మంది. తాండూరులోని జిల్లా ఆస్పత్రితో పాటు వికారాబాద్, పరిగి, కొడంగల్‌లో నియోజకవర్గ స్థాయి దవాఖానాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. జిల్లాలో నిత్యం 25 గ్రామాల్లో కంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఒక్కో బృందం ఒక్కో గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేసి అవసరమైనవారికి అక్కడే ఉచితంగా కంటి అద్దాలు అందజేయనున్నారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సల కోసం నగరంలోని సరోజినీదేవి, ఎల్‌వీ.ప్రసాద్ తదితర ప్రముఖ కంటి వైద్యాలయాలకు రిఫర్ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. శుక్లం, మెల్ల కన్ను, కార్నియా అంధత్వం, రెటినోపతి, డయాబెటిక్, దృష్టిలోపాలు, రిఫ్రాక్టివ్ దోషం, టెరిజియమ్ తదితర సమస్యలను గుర్తించి చికిత్స చేయనున్నారు. దృష్టిలోపం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహా రం ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
సమాచారం లేదు
ఊరూరా కంటి పరీక్షల కో సం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటుచేసే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం, ఆదేశాలు అందలేదు. కార్యక్రమం ఉంటుంది కానీ.. ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదు. రైతు బంధు, రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా అన్ని శాఖల అధికారులు బిజీబిజీగా ఉన్నా రు. ఈ కారణంగా నేత్ర శిబిరాలపై స్పష్టత లేదు. – దశరథ్, జిల్లా వైద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment