సాక్షి, అమరావతి: కళ్లు మసకబారడం, కంటి శుక్లాలతో చూడటానికి ఇబ్బందులు పడ్డ అవ్వాతాతల కష్టాలకు ప్రభుత్వం చరమగీతం పలికింది. 60 ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వమే ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అద్దాలు కూడా ఉచితంగా ఇస్తోంది. దీంతో ఇన్నాళ్లూ మసక మసక కంటిచూపుతో బాధపడ్డ అవ్వాతాతలు ఇప్పుడు ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడ్డారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం అవ్వాతాతలకు చేస్తున్న కంటి పరీక్షల సంఖ్య 12.19 లక్షలు దాటింది. ఇందులో 6.85 లక్షల మందికి పైగా కళ్లద్దాలు అవసరమని వైద్యులు తేల్చారు. అంటే.. 56 శాతం మందికి పైగా కళ్లద్దాలు అవసరం. వీరికి దశల వారీగా ప్రభుత్వం కళ్లద్దాలు ఉచితంగా అందిస్తోంది. అలాగే కంటి శుక్లాలతో బాధపడ్డవారికి ప్రభుత్వం ఉచితంగా కేటరాక్ట్ ఆపరేషన్లు చేయించడంతో బాధితులకు పెద్ద సమస్య నుంచి విముక్తి లభించింది. పరీక్షలు చేసిన 12.19 లక్షల మందిలో 1.09 లక్షల మందికి కేటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని గుర్తించగా ఇప్పటికే 91 శాతం మందికి సర్జరీలు పూర్తి చేశారు. ఇంత పెద్ద ఎత్తున కంటి వైద్య పరీక్షలు చేస్తున్న రాష్ట్రం దేశంలోనే లేకపోవడం గమనార్హం.
297 మండలాల్లో పరీక్షలు పూర్తి
సెప్టెంబర్ 30 నాటికి రాష్ట్రంలో 297 మండలాల్లో అవ్వాతాతలకు కంటి పరీక్షలు పూర్తయ్యాయి. మరో 370 మండలాల్లో కొనసాగుతోంది. రోజుకు 50 కేసులకుపైగా పరీక్షలు చేసే బృందాలు 33 పనిచేస్తున్నాయి. అలాగే 25 నుంచి 50 వరకు చేసే బృందాలు 195, 10 నుంచి 25 వరకు చేసే బృందాలు 129, పది మంది కంటే తక్కువగా చేసే బృందాలు 21 విధులు నిర్వహిస్తున్నాయి. కంటి వైద్యులు, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్‌లు మొత్తం కలిపి 370 బృందాలు పనిచేస్తున్నాయి. ఇవి వారానికి సగటున 55 వేల మందికి పైగా పరీక్షలు చేస్తున్నాయి.
99 వేల మందికిపైగా సర్జరీ పూర్తి
రాష్ట్రవ్యాప్తంగా కంటిశుక్లాలతో సరిగా చూపులేక బాధపడుతున్న అవ్వాతాతల్లో ఇప్పటివరకు 99,752 మందికి కేటరాక్ట్ సర్జరీలు పూర్తి చేశారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12,898 మందికి శస్త్రచికిత్స నిర్వహించారు. ఇందులో 11,700 సర్జరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, 54 వేలకుపైగా ఎన్జీవో ఆస్పత్రుల్లో, 33 వేలకు పైగా ప్రైవేటు ఆస్పత్రుల్లో (ఆరోగ్యశ్రీ కింద) చేశారు. దీనికంటే ముందే తొలి దశలో అన్ని స్కూళ్లలో 66 లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేసిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంకా ఎక్కువ చేయాలి..
ప్రస్తుతం చేస్తున్న వాటికంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కువగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేయాలని సూచించాం. ఇప్పటికే ప్రభుత్వ వైద్యులకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో అత్యాధునిక వైద్యానికి సంబంధించిన శిక్షణ ఇప్పించాం. కంటి సర్జరీలకు అవసరమైన వైద్య ఉపకరణాలన్నీ అందుబాటులో ఉన్నాయి. బోధనాస్పత్రుల్లో ఆపరేషన్లు ఎక్కువగా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
– డా.హైమావతి, నోడల్ అధికారి, వైఎస్సార్ కంటివెలుగు
వీడుతున్న ‘మసక’ తెరలు
Published Sun, Oct 3 2021 3:48 AM | Last Updated on Sun, Oct 3 2021 3:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment