ప్రతీకాత్మక చిత్రం
ఖమ్మం, వైద్యవిభాగం : ప్రభుత్వం ప్రతిష్ణాత్మకంగా ప్రారంభిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎ.కొండల్‌రావు తెలిపారు. ఆయన మంగళవారం తన చాంబర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు బ్యాంక్ కాలనీలో, ప్రకాశ్‌నగర్‌లోని రాజేంద్రనగర్ పాఠశాలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని చెప్పారు.
‘కంటి వెలుగు’ కోసం 36 బృందాలను సిద్ధం చేశామన్నారు. 25 బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో, ఏడు బృందాలు ఖమ్మం నగరంలో పరీక్షలు నిర్వహిస్తాయని, మరో నాలుగు అదనపు బృందాలను అందుబాటులో ఉంచనున్నట్టు వివరించారు. ప్రతి రోజు ఒక్కో బృందం గ్రామీణ ప్రాంతాల్లో 250 మందిని, పట్టణ ప్రాంతాల్లో 300 మందిని పరీక్షిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు 1,59,851 కళ్లద్దాలు వచ్చాయన్నారు.
ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు పరీక్షించిన తర్వాత మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో నిపుణులు పరీక్షించి అవసరమైన వారికి మందులు, ఐ డ్రాప్స్, కళ్ళద్దాలు ఇస్తారని చెప్పారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో, మమత ఆసుపత్రి, అఖిల కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు కూడా నిర్వహిస్తారని చెప్పారు. తప్పదనుకుంటే హైదరాబాద్ ఆస్పత్రికి పంపిస్తారని చెప్పారు. జిల్లాలో ఈ కార్యక్రమం ఆరు నెలలపాటు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమ విజయవంతానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు రావాలని కోరారు.
మాట్లాడుతున్న డాక్టర్ కొండల్‌రావు
Comments
Please login to add a commentAdd a comment