ఎన్జీవోల ద్వారా ‘కంటి వెలుగు’  | Government normative decision to speed up Kanti Velugu operations | Sakshi
Sakshi News home page

ఎన్జీవోల ద్వారా ‘కంటి వెలుగు’ 

Published Wed, Jul 3 2019 3:04 AM | Last Updated on Wed, Jul 3 2019 3:04 AM

Government normative decision to speed up Kanti Velugu operations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంటి వెలుగు కార్యక్రమంలో పెండింగ్‌లో ఉన్న ఆపరేషన్లను పూర్తిచేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు స్వచ్ఛంద సంస్థ లు, ఎల్వీ ప్రసాద్‌ వంటి ప్రముఖ ఆస్పత్రుల్లో వీలైనంత త్వరగా కంటి ఆపరేషన్లు చేయాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలోనూ అదనపు వసతులు కల్పించి ఆపరేషన్లు జరిగేలా ఏర్పా ట్లు చేయాలని ఆ శాఖ భావిస్తోంది. దీనికి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్నికల వల్ల నిలిచిన ఆపరేషన్లను సత్వరం పూర్తిచేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ పథకం కోసం మంజూరై నిలిచిన రూ. 87.29 కోట్ల నిధులను ప్రభుత్వం 2 రోజుల క్రితం విడుదల చేసింది. గతేడాది ఆగస్టు 15న ‘కంటి వెలుగు’ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎన్నికల నాటికి 1.55 కోట్ల మందికి కంటి పరీక్షలు చేశారు. పరీక్షలు చేయించుకున్న వారిలో చాలా మంది 18 ఏళ్లకు పైబడిన వారే ఉన్నారు. పరీక్షలు చేయించుకున్న వారిలో దాదాపు 90% మంది బడుగు బలహీనవర్గాలకు చెందిన వారే ఉన్నారు. పరీక్షల సందర్భంగా 35 లక్షల మంది కి రీడింగ్‌ గ్లాసులు ఇచ్చారు. 20 లక్షల మందికి చత్వారీ గ్లాసులు ఇవ్వాలని ప్రిస్క్రిప్షన్‌ రాశారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 7.04 లక్షల మందికి పలు రకాల ఆపరేషన్లు అవసరమని నిర్ధారించారు. అందులో 6.64 లక్షల మందికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు అవసరమని తేల్చగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో 23,629 మందికి ఆపరేషన్లు నిర్వహించారు.  

ఎలాంటి ఇబ్బందులు రాకుండా... 
లక్షలాది మందికి కంటి ఆపరేషన్లు చేయడమ నేది కత్తిమీద సాములాంటిది. అందుకే సాధారణ ప్రైవేటు ఆస్పత్రుల్లో కాకుండా సరోజినీ, ఎల్వీ ప్రసాద్‌ వంటి ప్రముఖ ఆస్పత్రుల్లోనే ఆపరేషన్లు నిర్వహించాలని సర్కారు భావిస్తోంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆపరేషన్లు చేయడానికి ముందుకు వచ్చినట్లు వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఆపరేషన్ల సందర్భంగా ఇబ్బందులు తలెత్తాయి. అవి పునరావృతం కాకుండా సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో అదనపు వసతులు కల్పించి ఆపరేషన్లు మొదలుపెట్టాలని ఆ శాఖ యోచిస్తోంది.

ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రి వర్గాలతోనూ సంప్రదించి రోజుకు ఎన్ని ఆపరేషన్లు చేయవచ్చన్న దానిపై స్పష్టతకు రానుంది. మరోవైపు కొన్ని స్వచ్ఛంద సంస్థలను గుర్తించి వాటిల్లోనూ చేయనున్నారు. ఇప్పటికే ఆపరేషన్లు అవసరమైన కొందరు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చేయించుకున్నారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. ఎందరు ఆపరేషన్లు చేయించుకున్నారనే సమాచారం తమ వద్ద లేద ని చెబుతున్నాయి. కంటి వెలుగు తర్వాత దంత వైద్య పరీక్షలపైనా సర్కారు దృష్టిసారించనుంది. అయితే ఎప్పుడన్నది తర్వాత చెబుతామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement