సమావేశంలో మాట్లాడుతున్న హరీశ్. చిత్రంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 18 నుంచి ప్రారంభించనున్న రెండో దఫా కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు కార్యక్రమం సన్నద్ధతపై మంగళవారం మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయనతోపాటు ఇతర మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీఎస్ సోమేశ్‌కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు శ్వేత మహంతి, డాక్టర్ శ్రీనివాస్‌రావు, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుంచి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, పంచాయతీ, మున్సిపల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ మొదటిదఫా కంటివెలుగు కార్యక్రమంలో 1.54 కోట్ల మందికి స్క్రీనింగ్ చేసి, 50 లక్షల కళ్లద్దాలు ఇచ్చామని చెప్పారు.
అదే స్ఫూర్తితో ఇప్పుడు గ్రామం, మున్సిపల్ వార్డు కేంద్రంగా క్యాంపుల నిర్వహణ ఉంటుందని చెప్పారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలలు జరిగిందని, రెండోవిడత కంటి వెలుగు వంద పనిదినాల్లో పూర్తి చేస్తామన్నారు. మొదటి దఫా కంటివెలుగులో 827 బృందాలు పనిచేయగా, ఇప్పుడు 1,500 బృందాలను ఏర్పాటు చేశామని, తద్వారా గిన్నిస్ రికార్డులో నమోదయ్యేలా కృషి చేయాలని అన్నారు. ఒక్కో బృందంలో అప్టో మెట్రిస్ట్, సూపర్‌వైజర్, ఇద్దరు ఏఎన్‌ఎం, ముగ్గురు ఆశా, డీఈవో ఉంటారన్నారు.
55 లక్షల కళ్లద్దాల పంపిణీ...
పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామని మంత్రి హరీశ్ అన్నారు. ఇందులో 30 లక్షల రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్క్రిçప్షన్ గ్లాసెస్ ఉంటాయని, మొత్తం 55 లక్షల కళ్లద్దాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. రోజువారీ వైద్యసేవలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 12వ తేదీలోగా అన్ని జిల్లాల్లో మంత్రుల నేతృత్వంలో కంటివెలుగు సమావేశాలు నిర్వహించాలని, అన్ని మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లకు షెడ్యూల్ ఖరారు చేయాలన్నారు. రేషన్ షాపుల్లో, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో క్యాంపుల నిర్వహణ తేదీలు అందరికీ తెలిసేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో 10, జిల్లాకొక క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని మంత్రి ఆదేశారు.
Comments
Please login to add a commentAdd a comment