సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడో వంతు మందికి కంటి సమస్యలున్నట్లు ‘కంటి వెలుగు’ కింద ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో వెల్లడైంది. మంగళవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1.49 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అం దులో 49 లక్షల మంది ఏదో ఒకరకమైన కంటి సమస్యతో బాధపడుతున్నారని వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపింది. ఆ నివేదిక ప్రకారం ఇప్పటివరకు 67.68 లక్షల మంది పురుషులు, 81.24 లక్షల మంది మహిళలు కంటి పరీక్షలు చేయించుకున్నారు. పురుషుల కంటే మహిళలు 13.56 లక్షల మంది అధికంగా పరీక్షలు చేయించుకున్నట్లు తేలింది. 9,104 గ్రామాల్లో (91.66%) కంటి వెలుగు కార్యక్రమం పూర్తయింది. మిగిలిన గ్రామాల్లో ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
22.3 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు..
శని, ఆదివారాలు, సెలవు రోజులు మినహా మిగిలిన రోజుల్లో గ్రామాలు, బస్తీల్లో కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, కంటి వైద్య నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పరీక్షలు చేసిన అనంతరం అవసరమైన వారికి అక్కడికక్కడే రీడింగ్ గ్లాసులు ఇస్తున్నారు. ఇప్పటివరకు 22.30 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు అందజేశారు.
చత్వారం గ్లాసుల పెండింగ్..
చత్వారం ఉన్న వారికి ప్రిస్క్రిప్షన్ రాసిస్తున్నారు. దాని ప్రకా రం ప్రభుత్వమే ప్రత్యేకంగా గ్లాసులు తయారుచేసి ఇస్తోంది. ఇప్పటి వరకు 17.56 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ రాసివ్వగా, అందులో 7.54 లక్షల మందికి మాత్ర మే ఆయా గ్లాసులను ఇచ్చారు. 10.02 లక్షల మందికి చత్వారం గ్లాసులు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా చత్వారం గ్లాసులు అందజేయాల్సి ఉన్నందున జాప్యం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
9 లక్షల మంది ఎదురుచూపు
కంటి సమస్యలున్న వారిలో 9.07 లక్షల మందికి ఆపరేషన్లు, ఇతరత్రా వైద్య సేవలు అవసరమని వైద్య, ఆరోగ్యశాఖ నివేదికలో తెలిపింది. రాష్ట్రంలో ఎన్నికల ముందు వరకు కొం దరికి ఆపరేషన్లు నిర్వహించగా కొన్ని చోట్ల వికటించడంతో ఆపరేషన్లు నిలిపివేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినా ఇప్పటికీ ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. కంటి వెలుగు కార్యక్ర మం ముగింపు దశలో ఉంది. లక్షలాది మంది ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఆపరేష న్లు ఎప్పుడు చేస్తారో అధికారులు కూడా చెప్ప డంలేదు. దీనిపై అనిశ్చితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment