కంటివెలుగుపై ప్రత్యేక దృష్టి | YSR Kantivelugu Programme Starting By Ys Jagan In Anantapur | Sakshi
Sakshi News home page

కంటివెలుగుపై ప్రత్యేక దృష్టి

Published Thu, Oct 10 2019 8:11 AM | Last Updated on Thu, Oct 10 2019 8:11 AM

YSR Kantivelugu Programme Starting By Ys Jagan In Anantapur - Sakshi

అనంత మనవడు.. అలుపెరుగని బాటసారి.. అఖిలాంధ్రుల మనస్సు చూరగొన్న నేత.. అభివృద్ధికి     ప్రతీక.. అధికార హోదాలో నేడు జిల్లాకు రానున్నారు.     ప్రతిపక్ష నాయకుడిగా జిల్లాలో పాదయాత్ర చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ‘అనంత’కు విచ్చేస్తున్నారు. ఇక్కడి నుంచే ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు అధికార పార్టీ నేతలంతా సిద్ధమయ్యారు. స్వాగత తోరణాలు, హోర్డింగ్‌లతో నగరాన్ని అలంకరించారు. 

సాక్షి, అనంతపురం :  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తరహాలోనే అధికారం చేపట్టిన వెంటనే  ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేసిన జగన్‌మోహన్‌ రెడ్డి ఇప్పటికే 108, 104 సర్వీసులకు పునర్జీవం పోశారు. వైద్యసేవలు మెరుగుపర్చేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నారు. తాజాగా దృష్టిలోపంతో బాధపడుతున్న చిన్నారులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని సీఎం ‘అనంత’ నుంచే ప్రారంభించనున్నారు. ఇందుకోసం నగరంలోని జూనియర్‌ కళాశాలలో జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.  

5,78,330 విద్యార్థులకు ‘కంటి వెలుగు’ 
‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ అమలుకు జిల్లాలో 4,114 ప్రభుత్వ, 775 ప్రైవేట్‌ పాఠశాలను అధికారులు గుర్తించారు. తొలి రెండు దశల్లో జిల్లాలోని 4,889 ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లలోని 5,78,330 మంది విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మొదటి దశలో ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు ఎంపిక చేసిన విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం 2,440 మంది ఆశ, ఏఎన్‌ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులకు స్క్రీనింగ్‌ చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 2,440 మెడికల్‌ కిట్లను వివిధ పీహెచ్‌సీలకు పంపారు. నవంబర్‌ 1వ తేదీ నుంచి 31 వరకు రెండో దశలో భాగంగా దృష్టిలోపంతో బాధపడుతున్న విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేయడంతో పాటు సమస్య తీవ్రత అనుగుణంగా శస్త్ర చికిత్సలకు రెఫర్‌ చేస్తారు. రెండో దశకు రూ.48.025 లక్షల బడ్జెట్‌ను కేటాయించారు.  

7,799 మంది భాగస్వామ్యం 
‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ విజయవంతం చేయడానికి కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖాధికారులు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, తదితర శాఖలు 7,799 మందిని భాగస్వామ్యులు చేయనున్నారు.   

ఆరు దశల్లో 22 లక్షల మందికి.. 
‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ ద్వారా ఆరు దశల్లో జిల్లాలోని 22,10,491 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అంతే కాకుండా ఉచితంగా కళ్లద్దాల పంపిణీ, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేస్తారన్నారు. జిల్లా జనాభా 44,20,986 కాగా... అందులో 50 శాతం మందికి విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తదితరులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించారు.  

సర్వం సిద్ధం 
వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నగరంలోని జూనియర్‌ కళాశాలలో ఉదయం 11 గంటల నుంచి వివిధ స్టాళ్లను పరిశీలించనున్నారు. దీంతో పాటు నేత్రదానం, మాతా, శిశు సంరక్షణ, వైఎస్సార్‌ ఆరోగ్యరక్ష, విద్యార్థులకు స్క్రీనింగ్, కళ్లద్దాల పంపిణీ తదితర విషయాలను అధికారులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వివరిస్తారు. ఉదయం 11.35 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సీఎం వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం చిన్నారులకు కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు.

జిల్లా జనాభా : 44,20,986 
వైద్య పరీక్షలకు ఎంపిక చేసిన విద్యార్థులు : 5,78,330
ప్రభుత్వ పాఠశాలల సంఖ్య  : 4,118
ప్రైవేట్‌ పాఠశాలల సంఖ్య : 775
కంటి పరీక్షలు నిర్వహించే బృందాలు : 2,440
మెడికల్‌ కిట్లు పంపిణీ చేసింది : 2,440
కార్యక్రమంలో పాల్గొనే సిబ్బంది, ఎన్‌జీఓలు : 7,799

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement