ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో బోధనాసుపత్రి | Teaching hospital in each parliamentary constituency | Sakshi
Sakshi News home page

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో బోధనాసుపత్రి

Published Wed, Feb 5 2020 4:39 AM | Last Updated on Wed, Feb 5 2020 4:40 AM

Teaching hospital in each parliamentary constituency - Sakshi

ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

రాష్ట్రంలోని 13 జిల్లాలను ఐదు జోన్లుగా ఏర్పాటు చేసుకుని, వాటిలో సూపర్‌ స్పెషాలిటీ మెడికల్‌ కోర్సులు ప్రారంభించడంపై దృష్టి సారించాలి. ఇదే సమయంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు మెడికల్‌ యూనివర్సిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. వాటి పరిధిలోని మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ అంశాలపై సమగ్ర విధానం ఉండాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

మే నాటికి వైద్య, ఆరోగ్య శాఖలో అవసరమైన సిబ్బందిని రిక్రూట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రజలకు వైద్య సేవల్లో ఎలాంటి లోపం ఉండకూడదు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏప్రిల్‌ నుంచి డబ్ల్యూహెచ్‌ఓ (వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌), జీఎంపీ (గుడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీస్‌) ప్రమాణాలతో కూడిన మందులు పంపిణీ చేయాలి.     
    – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక బోధనాసుపత్రి ఉండేలా చూడాలని, జిల్లా ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా మార్చడంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనివల్ల సిబ్బంది కొరత తీరే అవకాశాలుంటాయని, మరిన్ని మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయని  చెప్పారు. ఆస్పత్రుల్లో నాడు–నేడు, సబ్‌ సెంటర్ల నిర్మాణం, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యకార్డుల జారీపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో మంగళవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న విధానం చాలా పాతది అని, కొత్త విధానం గురించి ఆలోచించాలని సీఎం సూచించారు.

రాష్ట్రంలో తొమ్మిది చోట్ల బోధనాసుపత్రులు పెట్టేందుకు అవకాశాలున్నాయని అధికారులు సూచాయగా తెలుపుతూ.. నాలుగైదు ఆసుపత్రుల్లో వెంటనే ఈ ప్రతిపాదనను అమలు చేయవచ్చని సీఎంకు వెల్లడించారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక బోధనాసుపత్రి ఉండేలా చూడాలని, ఈ బోధనాసుపత్రులు స్వయం శక్తితో నడిచేలా ఆలోచించాలని సీఎం సూచించారు. ప్రజారోగ్య రంగం గురించి ఇదివరకటి ప్రభుత్వాలు ఆలోచించలేదని, అందువల్లే ఇవాళ పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్య వ్యవస్థను అందించడానికి కృతనిశ్చయంతో ఉన్నామని, ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక బోధనాసుపత్రి ఏర్పాటు చేసి, భవిష్యత్తులో అవి మెరుగ్గా నడిచేలా ప్రణాళిక తయారు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 11 కాలేజీలకు అదనంగా ప్రతిపాదిస్తున్న కాలేజీలతో కలిపి కనీసం 27 నుంచి 28 కాలేజీలు అవుతాయని, దీంతో భవిష్యత్తులో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. 

అవ్వాతాతలకు కంటి పరీక్షలు
మూడో విడత వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం కింద ఈ నెల 17వ తేదీ నుంచి అవ్వాతాతలకు కంటి పరీక్షలు నిర్వహించనున్నామని, దాదాపు 10 లక్షల మందికి శస్త్రచికిత్సలు అవసరమవుతాయని అంచనా వేశామని అధికారులు సీఎంకు వివరించారు. జూలై వరకూ మూడో విడత కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని, ఆపరేషన్లు ఎక్కువగా చేయాల్సి ఉన్నందున ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. స్క్రీనింగ్, లోపాల గుర్తింపు, కంటి అద్దాల పంపిణీ, ఆపరేషన్లు అన్నీ సమకాలంలో జరుగుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కాగా, అవసరం లేకున్నా సిజేరియన్‌లు చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఆ మేరకు వైద్యులకు సూచనలు చేయాలని, తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు.

రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి
తీవ్ర రోగాలతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పెన్షన్లపై ముఖ్యమంత్రి జగన్‌ ఆరా తీశారు. వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. అర్హులు ఎవ్వరూ కూడా మిగిలిపోకూడదని, ఎవరైనా మిగిలిపోతే వలంటీర్లను వినియోగించుకుని గుర్తించాలని ఆదేశించారు. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద 46,725 మందికి ఫిబ్రవరి 2 వరకు రూ.33.14 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు వివరించారు. ఆస్పత్రి నుంచి రోగి డిశ్చార్జి అవుతున్న సందర్భంలోనే రోగుల విశ్రాంతి సమయానికి ఇవ్వాల్సిన డబ్బును చేతిలో పెట్టాలని, మరింత సమర్థవంతంగా ఈ కార్యక్రమం కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. డయాబెటీస్, హైపర్‌ టెన్షన్, క్యాన్సర్, టీబీ, లెప్రసీ వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి విస్తృతంగా పరీక్షలు నిర్వహించనున్నామని, గుర్తించిన వారి వైద్యం వివరాలు ఆరోగ్య కార్డులో పొందుపరచనున్నట్లు అధికారులు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లాలో రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు పైలట్‌ ప్రాజెక్టు అమలుపై సీఎం ఆరా తీశారు.  

17న ఆసుపత్రుల్లో నాడు–నేడు ప్రారంభం
ఆరోగ్య ఉప కేంద్రాల (సబ్‌ సెంటర్లు) నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్షిస్తూ.. ‘నాడు– నేడు’లో చేపట్టే పనులు నాణ్యంగా ఉండాలని, ఈ విషయంలో రాజీ పడరాదని స్పష్టం చేశారు. నాడు – నేడులో భాగంగా 1,138 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆస్పత్రులు, 169 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. నాడు –నేడు కింద  11 మెడికల్‌ కాలేజీలు, 6 బోధనాసుపత్రుల్లో ,13 జిల్లా ఆసుపత్రుల్లో కూడా అభివృద్ధి పనులు చేపడతారు. కొత్తగా 7 మెడికల్‌ కాలేజీలు, 8 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, 1 క్యాన్సర్‌ ఆసుపత్రి, 7 నర్సింగ్‌ కాలేజీల నిర్మాణం చేపడతారు. కాగా, ఈ నెల 17న ఆసుపత్రుల్లో నాడు– నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కర్నూలులో ప్రారంభించనున్నారు. అదే రోజు సబ్‌సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన, మూడో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని కర్నూల్లోనే ప్రారంభిస్తారు.   

ఆరోగ్యశ్రీ పరిధిలోకి 1.43 కోట్ల కుటుంబాలు 
వైఎస్సార్‌ నవశకం ద్వారా రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాలను ఆరోగ్యశ్రీకి అర్హులుగా గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వార్షికాదాయ పరిమితిని రూ.5 లక్షల వరకు చేసినందున ఇంత మందికి లబ్ధి కలుగుతోందన్నారు. వీరందరికీ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కొత్త కార్డులను మార్చి 15వ తేదీలోగా ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 72, చెన్నైలో 23, బెంగళూరులో 35 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని, ఇప్పటి వరకు 3 వేల మంది రోగులు చికిత్స చేయించుకున్నారని అధికారులు వివరించారు. ఈ నెల 17న ఎనీమియా ముక్త్‌ భారత్‌లో భాగంగా ఐఎఫ్‌ఏ టాబ్లెట్లు, సిరప్‌ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సదరం సెంటర్లు 52 నుంచి 167కు పెంచామని, వారానికి 8,680 మందికి స్లాట్లు ఇస్తున్నామని, డిసెంబర్‌ 3 నుంచి ఫిబ్రవరి 3 వరకు 20,642 మందికి సర్టిఫికెట్లు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 

ఐదు జోన్లు ఇలా..  
1. కర్నూలు, వైఎస్సార్, అనంతపురం
2. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు
3. కృష్ణా, గుంటూరు
4. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి
5. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement