బాధితులతో మాట్లాడుతున్న డాక్టర్ శ్రీనివాసరావు
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు ఆపరేషన్లలో అపశ్రుతి నెలకొంటున్నా ప్రభుత్వం తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు వైద్యులు, ఆసుపత్రుల నిర్లక్ష్యంతోనే సంఘటనలు జరుగుతున్నా జాగ్రత్తలు తీసుకోవడంలేదు. ఆగస్టు 18న రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం దత్తాయిపల్లికి చెందిన గంట్లవెళ్లి చెన్నమ్మ కంటి పరీక్ష చేయించుకొని సమీపంలోని ఆసుపత్రిలో ఆపరేషన్‌కు వచ్చింది. మత్తు మందు వికటించడంతోనే ఆమె చనిపోయిందన్న విమర్శలొచ్చాయి. ఆ ఘటన మరువకముందే తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 19 మంది కంటి వెలుగు కింద పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరమన్నారు. వారు రిఫర్ చేశాకే వరంగల్‌లోని జయ నర్సింగ్ హోంకు వచ్చారు.
ఆపరేషన్లు చేశాక 17 మందికి ఇన్‌ఫెక్షన్ వచ్చింది. వాళ్లకి కంటిలోపల మంటతోపాటు వాపు వచ్చింది. ఒకరోజు ఆలస్యమైతే అందరికీ కళ్లుపోయి ఉండేవని ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా కంటి వెలుగులో కొందరు వైద్యులు, కొన్ని ఆసుపత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పైగా ఆయా సంఘటనలకు తమకు బాధ్యత లేదన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తుండటం గమనార్హం.
ఇంకా ఆపరేషన్లు మొదలు పెట్టలేదట...
వరంగల్ జిల్లాలో కంటి ఆపరేషన్లు వికటించడంపై ప్రభుత్వం వింత వాదనలు మొదలు పెట్టింది. 19 మందికి ఆపరేషన్లు ‘కంటి వెలుగు’కింద చేసినవి కాదని వివరణ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. పైగా జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కింద వారికి ఆపరేషన్లు చేసినట్లు పేర్కొంటున్నారు. ఇక్కడ రెండు విషయాలు ఒకదానికి ఒకటి సంబంధం లేనివిగా ఉన్నాయి. కంటి వెలుగు కిందే ఆయా బాధితులకు కంటి పరీక్షలు చేశారు. వారిని పరీక్షించిన వైద్యులు క్యాటరాక్ట్ ఉందని నిర్దారించి, ఆపరేషన్‌కు రిఫర్ చేశారు. కంటి వెలుగు కింద ఆపరేషన్లు చేయడానికి గుర్తించిన ఆసుపత్రికే వారు వెళ్లారు. అక్కడే వారి ఆపరేషన్ వికటించింది. అయినా తమకు సంబంధం లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొనడం హాస్యాస్పదం. ఇక రెండోది... జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కిందనే ఆపరేషన్లు చేశామని, కంటి వెలుగు కింద ఇంకా ఆపరేషన్లు మొదలు కాలేదని చెబుతున్నారు.
వాస్తవంగా ప్రభుత్వం కంటి వెలుగు కింద ఆపరేషన్లు చేయడంలేదు. ఈ ఆపరేషన్లనన్నింటినీ జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కిందనే చేయాలని నిర్ణయించారు. కాబట్టి కంటి వెలుగుకు ఈ ఘటనకు సంబంధం లేదని ఎలా చెప్పగలరు? సరోజినీ ఆసుపత్రిలో రెండేళ్ల క్రితం పలువురికి ఆపరేషన్ వికటించి కళ్లుపోయిన సంగతి విదితమే. ఇప్పుడూ వరంగల్ లోనూ జరిగిందని అధికారులు చెబుతున్నారు. వరంగల్‌లో ఇంత పెద్ద ఘటన జరిగి, బాధితులను ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి తీసుకొస్తే ఉన్నతాధికారులెవరూ పట్టించుకోలే దు. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మాత్రమే అందుబాటులో ఉన్నారు.
ఆపరేషన్ థియేటర్ సీజ్...
వరంగల్ జయ నర్సింగ్ హోం ఆపరేషన్ థియేటర్‌ను సీజ్ చేశామని, ఘటనపై విచారణకు ఆదేశించామని డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జయ నర్సింగ్ హోమ్ ఘటన దురదృష్టకరమన్నారు. అక్కడ ఈ నెల 26న 19 మందికి జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కింద క్యాటరాక్ట్ ఆపరేషన్లు జరిగాయన్నారు. 28న వారు నర్సింగ్ హోంకి వెళ్లగా, అందులో ఇద్దరి పరిస్థితి బాగుందన్నారు. మిగిలిన 17 మందికి ఎండ్ ఆప్తాలమైటీస్ అనే సమస్య వచ్చినట్లుగా గుర్తించారన్నారు. దీంతో వారికి కంటి లోపల మంటతోపాటు వాపు వచ్చిందన్నారు. విషయం తెలిసిన వెంటనే బాధితులను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించామన్నారు. అందులో 11 మందికి విట్రెక్టమీ ఆపరేషన్లు కూడా చేశామన్నారు. బాధితులంతా కొద్ది రోజుల్లో కోలుకుంటారని స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక వైద్య బృందాన్ని వరంగల్‌కు పంపించామన్నారు. విచారణ నివేదిక మేరకు నర్సింగ్ హోంపై చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరావు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment