Eye surgeries
-
అవ్వాతాతల కంటి పరీక్షలు వచ్చే ఏడాదికి పూర్తి
సాక్షి, అమరావతి: ఏపీలో తొలిసారిగా 60 ఏళ్లు దాటిన అవ్వాతాతలకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టింది. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో 60 సంవత్సరాలు దాటిన 56.88 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. మందులతో పాటు కంటి అద్దాలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు అన్నీ ఉచితంగానే చేస్తారు. ఇందులో ఇప్పటివరకు 13.58 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మిగిలిన వారందరికీ వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి పరీక్షలు పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, కరోనా కారణంగా ఈ పరీక్షలకు అవరోధం ఏర్పడింది. కరోనా తగ్గడంతో తిరిగి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 13.58 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా ఇందులో 4.71 లక్షల మందికి మందుల ద్వారా కంటిచూపు మెరుగుపరిచారు. 7.60 లక్షల మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించడమే కాకుండా ఉచితంగా కంటి అద్దాలు పంపిణీకి ఆర్డర్ ఇచ్చారు. ఇందులో ఇప్పటివరకు 4.69 లక్షల మంది అవ్వా తాతలకు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే, ఇప్పటివరకు 1.26 లక్షల మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించగా.. వాటిని ఒక లక్ష మందికి పూర్తిచేశారు. అక్టోబర్ రెండు నుంచి మధ్య వయస్కులకు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి అవ్వా తాతలందరికీ కంటి పరీక్షలను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలుచేస్తున్నాం. ఇప్పటికే స్కూలు పిల్లలకు పూర్తయ్యాయి. వచ్చే సెప్టెంబర్ నాటికి అవ్వాతాతల కార్యక్రమం పూర్తిచేసిన తరువాత మధ్య వయస్సుల వారికి కూడా ప్రపంచ దృష్టి దినోత్సవం అక్టోబర్ రెండు నుంచి ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధంచేస్తున్నాం. మొత్తం మీద అంధత్వ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చేయాలనే ముఖ్యమంత్రి లక్ష్యాలను సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – డా. హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు (నోడల్ అధికారి, వైఎస్సార్ కంటి వెలుగు) -
అవ్వాతాతలకు కంటి చూపు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదు.. చికిత్సలేని కారణంగా కంటిచూపునకు ఎవరూ దూరం కాకూడదు.. అన్న సత్సంకల్పంతో ప్రారంభమైన వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తోంది. ఈ యజ్ఞంలో ఇప్పటివరకు 93వేల మందికి పైగా అవ్వాతాలకు కేటరాక్ట్ (కంటి శుక్లాలు) సర్జరీలు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన వారు 56.88 లక్షల మంది ఉన్నట్లు అంచనా. వీరిలో ఇప్పటివరకు 11.80 లక్షల మందికి కంటిపరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలు చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 413 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నాయి. కరోనా కేసులు తగ్గిన తర్వాత పీహెచ్సీ స్థాయి నుంచి బోధనాసుపత్రి వరకూ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించి పరీక్షలు చేస్తున్నారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు ఇస్తున్నారు. వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల దూకుడు సెకండరీ కేర్ (వైద్యవిధాన పరిషత్) పరిధిలో ఉండే జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోని కంటి వైద్యులు శస్త్రచికిత్సల్లో దూకుడుగా వెళ్తుండగా, బోధనాసుపత్రుల్లో ఉన్న కంటి డాక్టర్లు మాత్రం తగిన స్థాయిలో సర్జరీలు చేయలేకపోతున్నారు. విచిత్రమేమంటే 11 బోధనాసుపత్రుల్లో 107 మంది కంటివైద్య నిపుణులు ఉండగా, వారంతా కలిసి 4,495 శస్త్రచికిత్సలు మాత్రమే చేశారు. అదే వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో కేవలం 40 మంది మాత్రమే ఉండగా వీరు 5,143 ఆపరేషన్లు చేశారు. వాస్తవానికి నిపుణుడైన డాక్టర్ కంటిశుక్లాల ఆపరేషన్లు రోజుకు 8 నుంచి 10 వరకూ చేయచ్చు. కానీ, డీఎంఈ ఆస్పత్రుల్లో ఉన్న పెద్ద డాక్టర్లు గడిచిన మూడు మాసాల్లో ఒక్కొక్కరు సగటున 42 మాత్రమే చేశారు. ఇప్పటికీ చాలాచోట్ల కరోనా పేరుతో చికిత్స చేయడంలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో తక్కువ కంటి ఆపరేషన్లు చేస్తున్న ఆస్పత్రులు, డాక్టర్ల వివరాలను ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా పేద రోగులకు మెరుగైన చికిత్స చేయాలని అధికారులు ఇప్పటికే వైద్యులకు పిలుపునిచ్చారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో వైద్యులకు శిక్షణ ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్యాన్నే అవ్వాతాతలకు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో ఇక్కడి వైద్యులకు బృందాల వారీగా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది. ఇందుకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో కేటరాక్ట్ సర్జరీలు మరింత నైపుణ్యంతో చేయడానికి వైద్యులకు వీలు కలుగుతోంది. కంటి వెలుగు చికిత్స వివరాలు.. ► ఇప్పటివరకూ స్క్రీనింగ్ చేసింది : 11,80,170 మందికి ► మందులు అవసరమైన వారు : 4,64,850 ► కేటరాక్ట్ ఆపరేషన్లు జరిగినవి : 93,566 ► కళ్లద్దాలు అవసరమైన వారు : 6,05,680 ► ప్రభుత్వాస్పత్రుల్లో జరిగిన కేటరాక్ట్ ఆపరేషన్లు :9,638 ► ఎన్జీవో/ఆరోగ్యశ్రీ కింద చేసినవి : 48,129 ► ప్రైవేటు ఆస్పత్రుల్లో.. : 35,799 -
కంటి ఆపరేషన్లు ఎందుకు వికటించాయి?
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జయ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు వికటించిన అంశంపై మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) తీవ్రంగా స్పందించింది. ఆ çఘటనకు సంబంధించి వివరణ కోరుతూ వైద్య ఆరోగ్యశాఖకు నోటీసులు జారీచేసింది. ఆపరేషన్లు వికటించడంలో బాధ్యత ఎవరిది? ఆస్పత్రిలో ఎక్కడ లోపం జరిగింది? అందులో ప్రభుత్వ బాధ్యత ఎంత? వైద్యుల నిర్లక్ష్యం ఉందా? వంటి అంశాలపై ప్రశ్నించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. బాధితుల పరిస్థితెలా ఉంది? వారికెలాంటి చికిత్స అందిస్తున్నారు? వంటి వివరాలనూ పంపాలని ఆదేశించి నట్లు తెలిసింది. ఇటీవల వరంగల్ జయ ఆస్పత్రిలో 17 మందికి కంటి ఆపరేషన్లు వికటించిన సంగతి తెలిసిందే. వారందరినీ హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అందులో 13 మందిని డిశ్చార్జి చేయగా.. మిగిలిన నలుగురికి చికిత్స జరుగుతోంది. ఆస్పత్రిదే బాధ్యత: కంటి ఆపరేషన్లు వికటించిన çఘటనలో వరంగల్‌లోని ప్రైవేటు ఆస్పత్రిదే బాధ్య తని వైద్యారోగ్యశాఖ నిర్ధారణకు వచ్చింది. దీన్నే హెచ్చార్సీకి విన్నవించాలని నిర్ణయించింది. హెచ్చార్సీకి వివరిస్తూ సమగ్ర నివేదికను ఆ శాఖ తయారు చేసింది. ఆపరేషన్ చేసిన వైద్యులూ బాధ్యులేనని స్పష్టం చేసింది. ఆపరేషన్ థియేటర్‌ను ప్రొటోకాల్ ప్రకారం నిర్వహించకపోవడం, రోగులకు శస్త్రచికిత్స సమయంలో నిర్లక్ష్యం కనిపించిందని వివరించింది. అవి కంటి వెలుగు కింద చేసిన ఆపరేషన్లు కావని హెచ్చార్సీకి విన్నవించనుంది. తద్వారా కంటి వెలుగు పథకంపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూడాలన్నదే సర్కారు ఉద్దేశం. ఆస్పత్రి సీజ్..? ఘటన జరిగిన వెంటనే తాము ఉన్నతస్థాయి వైద్య నిపుణుల బృందాన్ని వరంగల్‌కు పంపినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెచ్చార్సీకి పంపే నివేదికలో ప్రస్తావించింది. ఆస్పత్రిదే బాధ్యతగా నిర్ధారణకు వచ్చామని సర్కారు వెల్లడించింది. దీంతో ఆస్పత్రిపైనా, వైద్యం చేసిన డాక్టర్లపైనా చర్యలు తీసుకుంటామని విన్నవించేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. వైద్య బృందం సిఫార్సుల మేరకు ఆస్పత్రి లైసెన్సు రద్దు చేయడమా? లేదా ఆస్పత్రిని సీజ్ చేయడమా? లేదా ఆస్ప త్రిలో కంటి వైద్య విభాగాన్ని సీజ్ చేయడమా అన్నది పరిశీలన చేస్తున్నట్లు హెచ్చార్సీకి ఇచ్చే వివరణలో తెలిపింది. అలాగే వైద్యులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. -
కంటివెలుగులో చీకట్లు.. 17మందికి కళ్లుపోయే పరిస్థితి!
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు ఆపరేషన్లలో అపశ్రుతి నెలకొంటున్నా ప్రభుత్వం తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు వైద్యులు, ఆసుపత్రుల నిర్లక్ష్యంతోనే సంఘటనలు జరుగుతున్నా జాగ్రత్తలు తీసుకోవడంలేదు. ఆగస్టు 18న రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం దత్తాయిపల్లికి చెందిన గంట్లవెళ్లి చెన్నమ్మ కంటి పరీక్ష చేయించుకొని సమీపంలోని ఆసుపత్రిలో ఆపరేషన్‌కు వచ్చింది. మత్తు మందు వికటించడంతోనే ఆమె చనిపోయిందన్న విమర్శలొచ్చాయి. ఆ ఘటన మరువకముందే తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 19 మంది కంటి వెలుగు కింద పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరమన్నారు. వారు రిఫర్ చేశాకే వరంగల్‌లోని జయ నర్సింగ్ హోంకు వచ్చారు. ఆపరేషన్లు చేశాక 17 మందికి ఇన్ఫెక్షన్ వచ్చింది. వాళ్లకి కంటిలోపల మంటతోపాటు వాపు వచ్చింది. ఒకరోజు ఆలస్యమైతే అందరికీ కళ్లుపోయి ఉండేవని ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా కంటి వెలుగులో కొందరు వైద్యులు, కొన్ని ఆసుపత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పైగా ఆయా సంఘటనలకు తమకు బాధ్యత లేదన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తుండటం గమనార్హం. ఇంకా ఆపరేషన్లు మొదలు పెట్టలేదట... వరంగల్ జిల్లాలో కంటి ఆపరేషన్లు వికటించడంపై ప్రభుత్వం వింత వాదనలు మొదలు పెట్టింది. 19 మందికి ఆపరేషన్లు ‘కంటి వెలుగు’కింద చేసినవి కాదని వివరణ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. పైగా జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కింద వారికి ఆపరేషన్లు చేసినట్లు పేర్కొంటున్నారు. ఇక్కడ రెండు విషయాలు ఒకదానికి ఒకటి సంబంధం లేనివిగా ఉన్నాయి. కంటి వెలుగు కిందే ఆయా బాధితులకు కంటి పరీక్షలు చేశారు. వారిని పరీక్షించిన వైద్యులు క్యాటరాక్ట్ ఉందని నిర్దారించి, ఆపరేషన్‌కు రిఫర్ చేశారు. కంటి వెలుగు కింద ఆపరేషన్లు చేయడానికి గుర్తించిన ఆసుపత్రికే వారు వెళ్లారు. అక్కడే వారి ఆపరేషన్ వికటించింది. అయినా తమకు సంబంధం లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొనడం హాస్యాస్పదం. ఇక రెండోది... జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కిందనే ఆపరేషన్లు చేశామని, కంటి వెలుగు కింద ఇంకా ఆపరేషన్లు మొదలు కాలేదని చెబుతున్నారు. వాస్తవంగా ప్రభుత్వం కంటి వెలుగు కింద ఆపరేషన్లు చేయడంలేదు. ఈ ఆపరేషన్లనన్నింటినీ జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కిందనే చేయాలని నిర్ణయించారు. కాబట్టి కంటి వెలుగుకు ఈ ఘటనకు సంబంధం లేదని ఎలా చెప్పగలరు? సరోజినీ ఆసుపత్రిలో రెండేళ్ల క్రితం పలువురికి ఆపరేషన్ వికటించి కళ్లుపోయిన సంగతి విదితమే. ఇప్పుడూ వరంగల్ లోనూ జరిగిందని అధికారులు చెబుతున్నారు. వరంగల్‌లో ఇంత పెద్ద ఘటన జరిగి, బాధితులను ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి తీసుకొస్తే ఉన్నతాధికారులెవరూ పట్టించుకోలే దు. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఆపరేషన్ థియేటర్ సీజ్... వరంగల్ జయ నర్సింగ్ హోం ఆపరేషన్ థియేటర్‌ను సీజ్ చేశామని, ఘటనపై విచారణకు ఆదేశించామని డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జయ నర్సింగ్ హోమ్ ఘటన దురదృష్టకరమన్నారు. అక్కడ ఈ నెల 26న 19 మందికి జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కింద క్యాటరాక్ట్ ఆపరేషన్లు జరిగాయన్నారు. 28న వారు నర్సింగ్ హోంకి వెళ్లగా, అందులో ఇద్దరి పరిస్థితి బాగుందన్నారు. మిగిలిన 17 మందికి ఎండ్ ఆప్తాలమైటీస్ అనే సమస్య వచ్చినట్లుగా గుర్తించారన్నారు. దీంతో వారికి కంటి లోపల మంటతోపాటు వాపు వచ్చిందన్నారు. విషయం తెలిసిన వెంటనే బాధితులను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించామన్నారు. అందులో 11 మందికి విట్రెక్టమీ ఆపరేషన్లు కూడా చేశామన్నారు. బాధితులంతా కొద్ది రోజుల్లో కోలుకుంటారని స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక వైద్య బృందాన్ని వరంగల్‌కు పంపించామన్నారు. విచారణ నివేదిక మేరకు నర్సింగ్ హోంపై చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరావు వెల్లడించారు. -
3.77 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 3.77 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరమని వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. కంటి వెలుగు కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత నెల 15న ప్రారంభమైన ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 34.08 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 3.77 లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేయాల్సిన అవసరాన్ని వైద్యులు నిర్ధారించారని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. అందులో అత్యధికంగా 2.42 లక్షల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయాల్సిన అవసరముందన్నారు. 16,265 మందికి కరోనా, 68,788 మందికి ఇతరత్రా కంటి శస్త్రచికిత్సలు చేయాలని నిర్ధారించినట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనే అత్యధికంగా 41 వేల మందికి ఆపరేషన్లు చేయాలని గుర్తించారు. అంచనాలను మించి..: కంటి వెలుగుకింద రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల మందికి మాత్రమే ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని వైద్యారోగ్యశాఖ మొదట్లో అంచనా వేయగా ఇప్పుడు పరిస్థితి మారింది. అంచనాలకు మించి ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మొదటి అంచనాలు కాస్తా నాలుగు రెట్లు పెరగడం గమనార్హం. ఈ కార్యక్రమం ఆరు నెలలపాటు సుదీర్ఘంగా నిర్వహిస్తారు. ఒక అంచనా ప్రకారం కోటిన్నర మంది ప్రజలు కంటివెలుగు కింద పరీక్షలు చేయించుకుంటారని భావిస్తున్నారు. నాలు గు రెట్లు ఆపరేషన్లు పెరిగే అవకాశమున్నందున ఆ మేరకు ఆపరేషన్లు చేసే ఆసుపత్రుల సంఖ్యను కూడా పెంచారు. ఇప్పటివరకు 70 ఆసుపత్రులకు అనుమతిచ్చారు. అదనంగా మరో 41 ఆసుపత్రులను గుర్తించారు. ఇలా మొత్తం 111 ఆసుపత్రుల్లో కంటి ఆపరేషన్లు చేస్తారు. వారందరికీ ఆయా ఆసుపత్రుల్లో ఆప రేషన్లు చేయాలంటే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. 60 రకాల ఆపరేషన్లు ఉచితంగా.. కంటి వెలుగు కింద 60 రకాల ఆపరేషన్లను ఉచితంగా చేస్తారు. ఆరోగ్యశ్రీలో కేవలం 25 వరకు మాత్రమే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తుంటే, ఇప్పుడు ‘కంటి వెలుగు’లో 60 వరకు చేస్తున్నట్లు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అంటే కంటికి సంబంధించిన అన్ని ఆపరేషన్లు ఇందులోనే కవర్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఒక్కో కంటి ఆపరేషన్‌కు కనిష్టంగా రూ.2 వేలు, గరిష్టంగా రూ.35 వేల వరకు ప్రభుత్వం సంబంధిత ఆసుపత్రికి చెల్లిస్తుంది. కంటి పరీక్షలు, ఆపరేషన్లు ఉచితంగా చేసే పరిస్థితి రావడం తో రాష్ట్రంలో ప్రైవేటు కంటి ఆసుపత్రులు రోగులు లేక వెలవెల పోతున్నాయి. మరోవైపు కంటి అద్దాల దుకాణాలకు కూడా గిరాకీ తగ్గినట్లు చెబుతున్నారు. -
కళ్లు పోగొట్టినోళ్లకు చెల్లింపులు
సాక్షి, హైదరాబాద్: 2016 మే 26.. హైదరాబాద్‌లోని సరోజినీ కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి 13 మందికి కళ్లు పోయాయి. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కంటి ఆపరేషన్‌కు కలుషితమైన ‘ఐవీ ఫ్లూయిడ్స్ ఆర్ఎల్ సొల్యూషన్’వాడటం వల్లే ఇంతమందికి కళ్లు పోయినట్లు అంచనా వేశారు. ఈ ఐవీ ఫ్లూయిడ్స్ సరఫరా చేసిన కంపెనీకి రూ.కోట్ల బిల్లులు చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఇప్పుడు రంగం సిద్ధం చేసింది. సంబంధిత కంపెనీపై కేసులు నడుస్తుంటే, ఆ బిల్లుల సొమ్ము చెల్లించాలంటూ సర్కారుకు ప్రతిపాదనలు పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్లాక్ లిస్టులో పెట్టి విచారణ జరుపుతున్నా.. నాగపూర్‌కు చెందిన హసీబ్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆ ఐవీ ఫ్లూయిడ్స్‌ను సరఫరా చేసింది. సరోజినీ కంటి ఆసుపత్రిలో బాధితులకు ఆపరేషన్ సమయంలో 16,385, 16,386, 16,387 బ్యాచ్ నంబర్లోని ఐవీ ఫ్లూయిడ్స్‌ను ఉపయోగించారు. తర్వాత అవి కలుషితమైనవిగా అధికారులు గుర్తించారు. ఆ కంపెనీ సరఫరా చేసిన మిగిలిన ఐవీ ఫ్లూయిడ్స్‌ను ప్రభుత్వం తక్షణమే నిలుపుదల చేసింది. కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆ కంపెనీకి చెందిన కొన్ని ఐవీ ఫ్లూయిడ్స్ నమూనాలను పరీక్షలకు పంపింది. దీంతో ఆసుపత్రులు ఆ కంపెనీకి చెందిన ఐవీ ఫ్లూయిడ్స్ నిల్వలను వెనక్కు పంపేశాయి. దాదాపు రూ.1.35 కోట్ల విలువైన ఫ్లూయిడ్స్ జిల్లాల నుంచి తెప్పించారు. కొరత ఏర్పడకుండా టీఎస్ఎంఎస్ఐడీసీ ప్రమాణాలు పాటించే మరో కంపెనీకి చెందిన ఫ్లూయిడ్స్‌ను తక్షణమే తెప్పించి రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులకు ప్రభుత్వం సరఫరా చేసింది. మరోవైపు తాను సరఫరా చేసిన ఐవీ ఫ్లూయిడ్స్‌కు బిల్లులు సమర్పించాలని ప్రభుత్వాన్ని హసీబ్ కంపెనీ కోరింది. దీటుగా స్పందించిన టీఎస్ఎంఎస్ఐడీసీ.. వెనక్కు పంపిన ఐవీ ఫ్లూయిడ్స్ నిల్వలకు బిల్లులు ఇవ్వబోమని స్పష్టంచేసింది. అయితే మొత్తం రూ.3.62 కోట్ల విలువైన ఐవీ ఫ్లూయిడ్స్ సరఫరా చేశామని, అందులో రూ.1.35 కోట్ల విలువైన సరుకును వెనక్కు తీసుకున్నందున అప్పటికే ఆసుపత్రుల్లో ఉపయోగించిన రూ.2.27 కోట్ల విలువైన సరుకుకు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కంపెనీ కోరింది. ఈ నేపథ్యంలో టీఎస్ఎంఎస్ఐడీసీ వర్గాలు కంపెనీకి పెండింగ్ బిల్లులను చెల్లించాలని ప్రభుత్వానికి నివేదించాయి. ఇటీవల జరిగిన సంస్థ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో దీన్ని ప్రతిపాదించడం గమనార్హం. ప్రమాణాల్లో తేడా లేనందునే: టీఎస్ఎంఎస్ఐడీసీ హసీబ్ కంపెనీ సరఫరా చేసిన ఐవీ ఫ్లూయిడ్స్ నమూనాలను పరీక్షించగా.. ప్రమాణాల్లో ఎక్కడా తేడా లేదని నిర్ధారణ అయినట్లు టీఎస్ఎంఎస్ఐడీసీ చెబుతోంది. మరి బాధితుల కళ్లు ఎలా పోయాయన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. కలుషితమైనవనే అనుమానం ఉండటం, ఆ ఫ్లూయిడ్స్‌పై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉండటంతో అప్పటివరకు నిల్వ ఉన్న సరుకును అధికారులు వెనక్కు పంపించారు. అప్పటికే వాడిన ఐవీ ఫ్లూయిడ్స్‌కు మాత్రం బిల్లులను చెల్లించాలని ప్రతిపాదించారు. మరోవైపు వాడిన ఫ్లూయిడ్స్ కూడా కలుషితం కాదని ఎలా నిర్ధారణ చేయగలరన్న ప్రశ్నకూ బదులు లేదు. ఈ పరిస్థితుల్లో కంపెనీకి బిల్లులు చెల్లించాలనుకోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటి ప్రమాణాల్లో తేడా లేనందున బిల్లులు చెల్లించాలని భావిస్తున్నామని, దీనిపై మేనేజ్మెంట్ కమిటీకి ప్రతిపాదనలు పంపిన మాట వాస్తవమేనని టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. ఆ ప్రతిపాదనపై కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. -
'సరోజనీ' ఘటనపై విచారణకు ఆదేశం
హైదరాబాద్(మెహిదీపట్నం): మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం సరోజిని దేవి కంటి ఆస్పత్రిని సందర్శించారు. 15 మంది చూపు కోల్పోయిన ఘటనపై విచారణకు ఆదేశించారు. సెలైన్ ఇన్ఫెక్షన్ కారణంగా 15 మంది చూపుకోల్పోయారు. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే కంటి చూపు మందగించిందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే తమ తప్పు లేదని ఆసుపత్రి యాజమాన్యం అంటోంది. ప్రభుత్వం సరఫరా చేసిన మందుల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని, దాంతో కంటి చూపు మందగించిందని డాక్టర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు ప్రస్తుతానికి ఆపివేశారు. బాధితులు ఆందోళన కొనసాగుతూనే ఉంది. -
చూపు కోల్పోయిన 13 మంది
- సరోజినీలో వికటించిన కంటి ఆపరేషన్లు మెహదీపట్నం : కంటి ఆపరేషన్లు వికటించి 13 మందికి చూపు మందగించిన సంఘటన నగరంలోని సరోజిని నాయుడు అసుపత్రిలో జరిగింది. ఈ ఘటన బుధవారం జరిగింది. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే కంటి చూపు మందగించిందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై వైద్యులు మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేసిన మందుల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని, దాంతో కంటి చూపు మందగించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు ప్రస్తుతానికి ఆపివేశారు. బాధితులు ఆందోళన కొనసాగుతూనే ఉంది.