ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: 2016 మే 26.. హైదరాబాద్‌లోని సరోజినీ కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి 13 మందికి కళ్లు పోయాయి. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కంటి ఆపరేషన్‌కు కలుషితమైన ‘ఐవీ ఫ్లూయిడ్స్ ఆర్‌ఎల్ సొల్యూషన్’వాడటం వల్లే ఇంతమందికి కళ్లు పోయినట్లు అంచనా వేశారు. ఈ ఐవీ ఫ్లూయిడ్స్ సరఫరా చేసిన కంపెనీకి రూ.కోట్ల బిల్లులు చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఇప్పుడు రంగం సిద్ధం చేసింది. సంబంధిత కంపెనీపై కేసులు నడుస్తుంటే, ఆ బిల్లుల సొమ్ము చెల్లించాలంటూ సర్కారుకు ప్రతిపాదనలు పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బ్లాక్ లిస్టులో పెట్టి విచారణ జరుపుతున్నా..
నాగపూర్‌కు చెందిన హసీబ్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆ ఐవీ ఫ్లూయిడ్స్‌ను సరఫరా చేసింది. సరోజినీ కంటి ఆసుపత్రిలో బాధితులకు ఆపరేషన్ సమయంలో 16,385, 16,386, 16,387 బ్యాచ్ నంబర్‌లోని ఐవీ ఫ్లూయిడ్స్‌ను ఉపయోగించారు. తర్వాత అవి కలుషితమైనవిగా అధికారులు గుర్తించారు. ఆ కంపెనీ సరఫరా చేసిన మిగిలిన ఐవీ ఫ్లూయిడ్స్‌ను ప్రభుత్వం తక్షణమే నిలుపుదల చేసింది. కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆ కంపెనీకి చెందిన కొన్ని ఐవీ ఫ్లూయిడ్స్ నమూనాలను పరీక్షలకు పంపింది.
దీంతో ఆసుపత్రులు ఆ కంపెనీకి చెందిన ఐవీ ఫ్లూయిడ్స్ నిల్వలను వెనక్కు పంపేశాయి. దాదాపు రూ.1.35 కోట్ల విలువైన ఫ్లూయిడ్స్ జిల్లాల నుంచి తెప్పించారు. కొరత ఏర్పడకుండా టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ప్రమాణాలు పాటించే మరో కంపెనీకి చెందిన ఫ్లూయిడ్స్‌ను తక్షణమే తెప్పించి రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులకు ప్రభుత్వం సరఫరా చేసింది. మరోవైపు తాను సరఫరా చేసిన ఐవీ ఫ్లూయిడ్స్‌కు బిల్లులు సమర్పించాలని ప్రభుత్వాన్ని హసీబ్ కంపెనీ కోరింది. దీటుగా స్పందించిన టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ.. వెనక్కు పంపిన ఐవీ ఫ్లూయిడ్స్ నిల్వలకు బిల్లులు ఇవ్వబోమని స్పష్టంచేసింది.
అయితే మొత్తం రూ.3.62 కోట్ల విలువైన ఐవీ ఫ్లూయిడ్స్ సరఫరా చేశామని, అందులో రూ.1.35 కోట్ల విలువైన సరుకును వెనక్కు తీసుకున్నందున అప్పటికే ఆసుపత్రుల్లో ఉపయోగించిన రూ.2.27 కోట్ల విలువైన సరుకుకు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కంపెనీ కోరింది. ఈ నేపథ్యంలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ వర్గాలు కంపెనీకి పెండింగ్ బిల్లులను చెల్లించాలని ప్రభుత్వానికి నివేదించాయి. ఇటీవల జరిగిన సంస్థ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో దీన్ని ప్రతిపాదించడం గమనార్హం.
ప్రమాణాల్లో తేడా లేనందునే: టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ
హసీబ్ కంపెనీ సరఫరా చేసిన ఐవీ ఫ్లూయిడ్స్ నమూనాలను పరీక్షించగా.. ప్రమాణాల్లో ఎక్కడా తేడా లేదని నిర్ధారణ అయినట్లు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చెబుతోంది. మరి బాధితుల కళ్లు ఎలా పోయాయన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. కలుషితమైనవనే అనుమానం ఉండటం, ఆ ఫ్లూయిడ్స్‌పై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉండటంతో అప్పటివరకు నిల్వ ఉన్న సరుకును అధికారులు వెనక్కు పంపించారు. అప్పటికే వాడిన ఐవీ ఫ్లూయిడ్స్‌కు మాత్రం బిల్లులను చెల్లించాలని ప్రతిపాదించారు.
మరోవైపు వాడిన ఫ్లూయిడ్స్ కూడా కలుషితం కాదని ఎలా నిర్ధారణ చేయగలరన్న ప్రశ్నకూ బదులు లేదు. ఈ పరిస్థితుల్లో కంపెనీకి బిల్లులు చెల్లించాలనుకోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటి ప్రమాణాల్లో తేడా లేనందున బిల్లులు చెల్లించాలని భావిస్తున్నామని, దీనిపై మేనేజ్‌మెంట్ కమిటీకి ప్రతిపాదనలు పంపిన మాట వాస్తవమేనని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ వేణుగోపాల్ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. ఆ ప్రతిపాదనపై కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment