TSMSIDC
-
కొత్త మెడికల్ కాలేజీలు త్వరగా పూర్తి కావాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న తొమ్మిది వైద్య కళాశాలల పనులను వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయం నుంచి నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్.హెచ్.ఎం), తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్య కళాశాలల పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. గత ఏడాది 8 మెడికల్ కాలేజీలను ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయనున్న కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగామ, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని కాలేజీల్లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ వైద్య మండలి బృందం పరిశీలనకు వచ్చేనాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలన్నారు. మాతా, శిశు కేంద్రాలను త్వరగా పూర్తి చేయాలి.. నిర్మాణంలో ఉన్న మాతా, శిశు సంరక్షణ కేంద్రాలను త్వరగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నిమ్స్, గాంధీ ఆసుపత్రుల ఆవరణల్లో నిర్మిస్తున్న మాతా, శిశు కేంద్రాలను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అలాగే వివిధ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న 13 తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లను వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్చురీల పనులు, 12 సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్‌ల పనులను కూడా మంత్రి సమీక్షించారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల సమీపంలో తొమ్మిది క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. కాగా, అన్ని ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. మందుల సరఫరాలో ఎలాంటి నియంత్రణ ఉండవద్దని, అవసరమైన మేరకు మందులను ఆయా ఆసుపత్రులకు సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, 24 గంటల్లోగా పరీక్ష ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా చూసుకోవడం సూపరింటెండెంట్ల బాధ్యత అని స్పష్టంచేశారు. ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తూ వైద్య పరికరాలు సమకూర్చుతోందని, ఈ నేపథ్యంలో అవి ప్రజలకు పూర్తిస్థాయిలో సద్వినియోగపడేలా చూడాలని చెప్పారు. ఈ సమీక్షలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, టి.ఎస్.ఎం.ఎస్.ఐ.డి.సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, డి.ఎం.ఇ. రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరో 123 ఔషధాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు బయట ప్రైవేటుగా మందులు కొనాల్సిన అవసరం రాకుండా.. అవసరమైన ఔషధాలన్నింటినీ అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అత్యవసర, సాధారణ మందుల సంఖ్యను పెంచాలని.. కొత్తగా 123 రకాల మందులను అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 720 రకాల మందులను ఫ్రీగా ఇస్తుండగా.. ఈ జాబితాను 843కు పెంచింది. ఇందులో అత్యవసర మందుల జాబితా (ఈఎంఎల్)లో 311, ఇతర సాధారణ (అడిషనల్) మందుల జాబితా (ఏఎఎల్)లో 532 మందులు ఉన్నాయి. తమిళనాడులో పరిశీలన జరిపి.. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని పటిష్టం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్.. మందుల జాబితాను సంస్కరించాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. దీనితో ప్రస్తుత అవసరాలు, భవిష్యత్ పరిస్థితులకు అనుగుణంగా సమగ్ర జాబితా రూపొందించడంపై వైద్యారోగ్య శాఖ కసరత్తు చేసింది. ఇందులో భాగంగా టీఎస్ఎంఎస్ఐడీసీ బృందం తమిళనాడుకు వెళ్లి అక్కడి విధానంపై అధ్యయనం చేసింది. ఏఎంఎల్, ఈఎంఎల్ జాబితాలో ఎన్ని రకాల మందులున్నాయి, ప్రొక్యూర్మెంట్ విధానం ఎలా ఉంది వంటి అంశాలను పరిశీలించింది. పూర్తి వివరాలతో నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదిక స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ.. మందుల తుది జాబితాను రూపొందించింది. మొత్తం మందులను 30 కేటగిరీలుగా విభజించి, ఒక్కో కేటగిరీలో మందుల ఎంపిక కోసం ఆయా విభాగాల్లోని ఇద్దరు వైద్య నిపుణులను నియమించింది. తుది జాబితాను సిద్ధం చేసింది. ప్రొక్యూర్మెంట్ విధానంలో మార్పులు ఇప్పటివరకు అత్యవసర జాబితాలోని మందులు కావాలంటే ఇండెంట్ పెట్టాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడీ విధానాన్ని మార్చేశారు. అత్యవసర జాబితాలోని 311 మందులను ఇక మీద వినియోగం ఆధారంగా సేకరించనున్నారు. ప్రతి ఆస్పత్రి కచ్చితంగా మూడు నెలలకు సరిపడా మందుల బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. సాధారణ జాబితాలోని 532 మందుల్లో 313 మందులను కేంద్రీకృత సేకరణ కింద టీఎస్ఎంఎస్ఐడీసీ సేకరిస్తుంది. దీనికోసం ఆయా విభాగాల హెచ్వోడీలు, సూపరింటెండెంట్లు ముందుగానే ఇండెంట్ పెడుతుంటారు. మరో 219 రకాల మందులను డీ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ కింద ఆస్పత్రులు నేరుగా సేకరించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. మొత్తం 843 రకాల మందుల్లో టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా 624 రకాలను సేకరిస్తారు. అవసరమైన మందులన్నీ అందుబాటులో.. చికిత్సలో భాగంగా అవసరమయ్యే ప్రతీ ఔషధాన్ని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచి.. రోగులకు పూర్తి ఉచితంగా అందించేందుకు సర్కారు కృషి చేస్తోంది. టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా పెద్ద మొత్తంలో మందుల సేకరణ చేస్తూనే.. వికేంద్రీకృత విధానంలో భాగంగా అవసరమైన, అరుదైన మందులను ఆస్పత్రులు తక్షణమే కొనుగోలు చేసి రోగులకు ఇచ్చే ఏర్పాటు చేసింది. దీంతో పేద ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. కొత్త విధానాన్ని వెంటనే అమలు చేసేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో జీవో విడుదల చేయనున్నట్టు సమాచారం. బయట మందులు కొనే అవసరం రాకుండా.. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేవారు అవసరమైన మందులను బయట ప్రైవేటుగా కొనే అవసరం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని.. అందులో భాగంగానే మందుల సంఖ్యను పెంచుతోందని అధికారులు చెప్తున్నారు. కొత్తగా పెంచిన మందుల్లో యాంటీ బయాటిక్స్, శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజ లవణాలు, వివిధ రోగాల చికిత్సలో ప్రత్యేకంగా అవసరమయ్యే మందులు, చిన్న పిల్లలకు ఇచ్చే సిరప్లు ఉన్నట్టు సమాచారం. బీ1, బీ2, బీ 6, బీ12, కె, ఈ, డీ, సీ విటమిన్లు, ఐరన్ మాత్రలు, వివిధ విటమిన్ల కాంబినేషన్ మాత్రలు, క్లాక్సాసిల్లిన్, సిప్రొఫ్లాక్సిన్, క్లావులనేట్, సెపోడాక్సిన్, ఓ ఫ్లాక్సాసిల్లిన్ వంటి యాంటీ బయాటిక్స్, ఇతర మందులు ఉన్నట్టు తెలిసింది. వీటిని వివిధ మోతాదులలో అందుబాటులో ఉంచనున్నారు. అధికారికంగా జీవో విడుదలైన తర్వాత ఏయే రకాల మందులు, ఏయే మోతాదులలో సిద్ధంగా ఉంచుతారన్న పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. -
ఒమిక్రాన్‌ను ఓడిద్దాం
సాక్షి, హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాపిపై ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. దేశంలో ఒమిక్రాన్ కేసు ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కానప్పటికీ అధికారులు ముందు జాగ్రత్తగా అన్ని రకాల ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అత్యవసర మందులు, సర్జికల్ పరికరాలు తదితరాలను సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) అధికారులు ఆగమేఘాల మీద 2.5 లక్షలకు పైగా రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, వేల సంఖ్యలో ఫావిపిరావిర్ మాత్రలు, యాంపోటెరిసిన్ ఇంజెక్షన్లు, పొసాకొనాజోల్ గ్యాస్ట్రో రెసిస్టెంట్ మాత్రలను సిద్ధం చేశారు. లక్షల సంఖ్యలో పీపీఈ కిట్లతో పాటు పల్స్ ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, ఎన్–95, సర్జికల్ మాస్క్‌లను సిద్ధం చేశారు. కరోనా టెస్ట్‌లు చేసేందుకు 32 లక్షలకు పైగా ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య చాలా తక్కువగా ఉంది. వాటిని మరింత పెంచాలని తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో ఆ కిట్లను భారీగా కొనుగోలు చేయాలని యోచిస్తున్నారు. మోనోక్లోనాల్ కొనుగోలుపై దృష్టి కరోనాబారిన పడినవారు త్వరగా కోలుకోవాలంటే అందుకు మోనోక్లోనాల్ యాంటీబాడీస్ ఔషధాన్ని ఇప్పుడు అనేక ప్రైవేట్, కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇస్తున్నారు. దాని ధర మార్కెట్లో రూ. 60 వేల వరకు ఉంటుంది. కరోనా సోకిన వారికి నిర్ణీత డోస్‌లు ఇస్తే, వేగంగా కోలుకుంటున్నట్లు ఇటీవల పలు పరిశోధనలు వెల్లడించాయి. అయితే ఈ మందు ప్రైవేట్‌లోనే ఎక్కువగా లభ్యం అవుతోంది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వద్ద పెద్దగా అందుబాటులో లేదు. హైదరాబాద్ గాంధీ, నిమ్స్ వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఇది లభిస్తోంది. వాటిని కేవలం వీఐపీల కోసమే వాడుతుండగా, ప్రస్తుతం ముఖ్యమైన ఈ మందు కొనుగోలుపై దృష్టి సారించాలని భావిస్తున్నారు. అత్యవసరంగా టెండర్లు వేసి తెప్పించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వానికి ఈ మేరకు ప్రతిపాదనలు పంపుతామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
కరోనా సెకండ్ వేవ్: రానున్న మూడు నెలలూ గడ్డురోజులే!
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభణ నేపథ్యంలో మరో మూడు నెలల పాటు గడ్డు రోజులే ఉంటాయని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. గతేడాది కంటే ఈసారి మూడింతల కేసులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తీవ్రంగా కేసులు పెరుగుతాయని, గతేడాది ఆయా నెలలతో పోలిస్తే అవి మూడింతలు ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమావేశమై పరిస్థితిని అంచనా వేశారు. వైరస్ వ్యాప్తి, విస్తరణ తీవ్రత ఊహకు అందని విధంగా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు మొత్తం యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. కరోనా వ్యాక్సినేషన్‌ను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. టెస్టింగ్, ట్రాకింగ్ చేయడంతోపాటు హోం ట్రీట్మెంట్ కిట్లను పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. టెస్టులు, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రాంతాల వారీగా చేపట్టాలని, కోవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించాలని, అన్ని ఆసుపత్రులను కోవిడ్ చికిత్స కోసం సిద్దం చేయాలని పేర్కొన్నారు. అలాగే ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించేలా, మాస్క్‌లు ధరించేలా చర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు. మరోవైపు 15 లక్షల హోం ఐసోలేషన్ కిట్లను సిద్దం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ)ని ప్రభుత్వం ఆదేశించింది. తొలుత సగం, తర్వాత సగం సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఇప్పటివరకు 4 లక్షల కిట్లు సిద్ధమైనట్లు సమాచారం. ప్రైవేట్‌లో 50 శాతం పడకలు కరోనాకే... ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 50 శాతం పడకలను కరోనా చికిత్సల కోసం కేటాయించాలని వైద్య, ఆరోగ్యశాఖ కోరింది. ప్రస్తుతం ఆయా ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలకు 20 శాతం, ఇతర సాధారణ చికిత్సలకు 80 శాతం పడకలు కేటాయించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో బెడ్స్ కోసం వేచి ఉండాల్సి వస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల సంఘాల ప్రతినిధులతో ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు భేటీ అయ్యారు. కనీసం సగం పడకలను కరోనా రోగులకు, మిగిలిన సగం సాధారణ వైద్య సేవలకు కేటాయించాలని సూచించారు. ఎలెక్టివ్ సర్జరీలను కనీసం మరో 3 నెలల పాటు వాయిదా వేసుకోవాలన్నారు. ఆసుపత్రిలో చేరిక అవసరమని కచ్చితంగా భావిస్తేనే పడక కేటాయించాలని స్పష్టంచేశారు. ఐసోలేషన్‌లో ఉండాల్సిన రోగులకు గతంలో మాదిరిగా కొన్ని ఎంపిక చేసిన హోటళ్లలో గదులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కరోనా బాధితుల చికిత్సలకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులనే వసూలు చేయాలని తేల్చిచెప్పారు. 20 పడకలున్న చిన్నపాటి ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలను ప్రారంభించుకోవచ్చని ఆయన తెలిపారు. చదవండి: కరోనా వ్యాప్తి: స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్ బంద్ -
ట్రీట్మెంట్ స్టార్ట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ)కు ప్రాథమిక చికిత్స మొదలైంది. నాంపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాలు వేశాక పసి పిల్లలకు ప్రమాదకరమైన ట్రెమడాల్ మాత్రలు వేయడం, వికటించడం, ఇద్దరు చనిపోయిన విషయం విదితమే. దీంతో టీఎస్ఎంఎస్ఐడీసీలో ప్రక్షాళనకు అధికారులు పూనుకున్నారు. ఈ సంఘటన అనంతరం మొత్తం వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై సర్కారు తీవ్ర అసంతృప్తితో ఉంది. ముఖ్యంగా ట్రెమడాల్ మాత్రలు అవసరం లేకపోయినా ఏకంగా 33 లక్షల మాత్రలను రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించారు. అందులో టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు, ఫార్మసిస్టులు, కంపెనీలు కుమ్మక్కు అయ్యారని తెలిసింది. నాంపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేవలం 500 మాత్రలు అవసరమని చెబితే ఏకంగా 10 వేలు పంపించిన సంఘటన చాలా సీరియస్ అయింది. దీంతో ఈ మాత్రలు అవసరానికి మించి ఇష్టారాజ్యంగా సరఫరా చేసిన సంఘటనలో పాత్రధారులపైనా, ఫార్మసిస్టులపైనా వేటు వేయాలని టీఎస్ఎంఎస్ఐడీసీ నిర్ణయించింది. ఔషధ నియంత్రణ విభాగం నుంచి మొదలుపెడితే టీఎస్ఎంఎస్ఐడీసీ వరకు పాత్రధారులపై ఇటీవల వేటు ప్రారంభమైంది. అయితే కేవలం చిన్నవారిని బలి తీసుకుంటున్నారని, పెద్దల పాత్రపై ఏమాత్రం పట్టించుకోవడంలేదన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న 33 లక్షల ట్రెమడాల్ మాత్రలను వెనక్కు తెప్పించి సంబంధిత కంపెనీకి పంపించారు. ఆ కంపెనీకి అంతకుముందే సొమ్ము ఇచ్చినందున వాటి విలువను ఇతరత్రా అడ్జెస్ట్ చేయాలని నిర్ణయించారు. రెండు కోట్ల రూపాయల విలువైన గడువు తీరిన మందులను కూడా వెనక్కు తెప్పిస్తున్నారు. ఇప్పటివరకు గడువు తీరిన మందులను కంపెనీలకు వెనక్కు ఇచ్చేవారు కాదు. ఆ నష్టాన్ని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీనే భరించేది. కంపెనీలతో కొందరు అధికారులు కుమ్మక్కై ఇలా చేసేవారన్న విమర్శల నేపథ్యంలో ఇక నుంచి మూడు నెలల ముందు గడువు ముగిసే వాటిని కంపెనీలకు అప్పగించాలని నిర్ణయించినట్లు టీఎస్ఎంఎస్ఐడీసీ తెలిపింది. ఆయనకు అంత జీతమా? కీలకస్థానంలో ఓ అధికారి కనుసైగల్లోనే టీఎస్ఎంఎస్ఐడీసీ నడుస్తోందన్న వాదన ఉంది. ఎవరు ఎండీగా వచ్చినా ఆయనను మచ్చిక చేసుకొని విచ్చలవిడిగా దోపిడీ చేస్తుంటారన్న ప్రచారం ఉంది. అతని వేతనం నెలకు రూ. 2.50 లక్షలు, అతను వాడే వ్యక్తిగత కారు కోసం రూ.46 వేల రవాణా భత్యం నెలకు ఇస్తారన్న ప్రచారం ఉంది. పది కిలోమీటర్ల దూరం ఉండే ఇంటి నుంచి కార్యాలయానికి వచ్చే అతనికి అంత జీతభత్యాలు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. నెలా రెండు నెలలకోసారి ఢిల్లీ టూర్ పేరిట మరో రూ.40 వేలు ఆయనకు చెల్లిస్తున్నారని ఉద్యోగులు అంటున్నారు. ఈ విషయంపై కొందరు ఉద్యోగులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఆరా తీసినట్లు, అతని పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో త్వరలో అతనిపై వేటువేసే అవకాశాలున్నట్లు టీఎస్ఎంఎస్ఐడీసీకి చెందిన ఓ కీలకాధికారి తెలిపారు. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన వైద్య ఉత్పత్తుల్లో ఒక దానికి సంబంధించి మూడు బ్యాచ్ నంబర్లు గల వాటిని తిరిగి వెనక్కు తెప్పిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఆ బ్యాచ్ నంబర్లను కంపెనీ కూడా వెనక్కు తెప్పిస్తోందన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆ ఉత్పత్తుల బ్యాచ్ నంబర్లు బయటపడ్డాయని, వాటిని తెప్పిస్తున్నామని చెప్పారు. సంస్థను ప్రక్షాళన చేస్తున్నాం టీఎస్ఎంఎస్ఐడీసీలో నెలకొన్న కొన్ని రకాల లోపాలను సరిదిద్దుతున్నాం. అక్రమాలు జరిగినచోట కఠినంగా వ్యవహరిస్తున్నాం. ట్రెమడాల్ మాత్రలు వికటించిన ఉదంతం తర్వాత ప్రక్షాళన చేపట్టిన మాట వాస్తవమే. గడువు తీరిన మాత్రలు, మందులను వెనక్కు పంపించాలని నిర్ణయించాం. గతంలో వాటిని కాల్చడమో ఏదో ఒకటి చేసేవారం. కానీ, ముందుగానే కంపెనీకి అప్పగించాలని నిర్ణయించాం. తద్వారా నష్టాలను భరించాల్సిన అవసరం టీఎస్ఎంఎస్ఐడీసీకి ఉండదు. 33 లక్షల ట్రెమడాల్ మాత్రలను ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వెనక్కు తెప్పించి కంపెనీకి అప్పగించాం. – చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ, టీఎస్ఎంఎస్ఐడీసీ -
కళ్లు పోగొట్టినోళ్లకు చెల్లింపులు
సాక్షి, హైదరాబాద్: 2016 మే 26.. హైదరాబాద్‌లోని సరోజినీ కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి 13 మందికి కళ్లు పోయాయి. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కంటి ఆపరేషన్‌కు కలుషితమైన ‘ఐవీ ఫ్లూయిడ్స్ ఆర్ఎల్ సొల్యూషన్’వాడటం వల్లే ఇంతమందికి కళ్లు పోయినట్లు అంచనా వేశారు. ఈ ఐవీ ఫ్లూయిడ్స్ సరఫరా చేసిన కంపెనీకి రూ.కోట్ల బిల్లులు చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఇప్పుడు రంగం సిద్ధం చేసింది. సంబంధిత కంపెనీపై కేసులు నడుస్తుంటే, ఆ బిల్లుల సొమ్ము చెల్లించాలంటూ సర్కారుకు ప్రతిపాదనలు పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్లాక్ లిస్టులో పెట్టి విచారణ జరుపుతున్నా.. నాగపూర్‌కు చెందిన హసీబ్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆ ఐవీ ఫ్లూయిడ్స్‌ను సరఫరా చేసింది. సరోజినీ కంటి ఆసుపత్రిలో బాధితులకు ఆపరేషన్ సమయంలో 16,385, 16,386, 16,387 బ్యాచ్ నంబర్లోని ఐవీ ఫ్లూయిడ్స్‌ను ఉపయోగించారు. తర్వాత అవి కలుషితమైనవిగా అధికారులు గుర్తించారు. ఆ కంపెనీ సరఫరా చేసిన మిగిలిన ఐవీ ఫ్లూయిడ్స్‌ను ప్రభుత్వం తక్షణమే నిలుపుదల చేసింది. కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆ కంపెనీకి చెందిన కొన్ని ఐవీ ఫ్లూయిడ్స్ నమూనాలను పరీక్షలకు పంపింది. దీంతో ఆసుపత్రులు ఆ కంపెనీకి చెందిన ఐవీ ఫ్లూయిడ్స్ నిల్వలను వెనక్కు పంపేశాయి. దాదాపు రూ.1.35 కోట్ల విలువైన ఫ్లూయిడ్స్ జిల్లాల నుంచి తెప్పించారు. కొరత ఏర్పడకుండా టీఎస్ఎంఎస్ఐడీసీ ప్రమాణాలు పాటించే మరో కంపెనీకి చెందిన ఫ్లూయిడ్స్‌ను తక్షణమే తెప్పించి రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులకు ప్రభుత్వం సరఫరా చేసింది. మరోవైపు తాను సరఫరా చేసిన ఐవీ ఫ్లూయిడ్స్‌కు బిల్లులు సమర్పించాలని ప్రభుత్వాన్ని హసీబ్ కంపెనీ కోరింది. దీటుగా స్పందించిన టీఎస్ఎంఎస్ఐడీసీ.. వెనక్కు పంపిన ఐవీ ఫ్లూయిడ్స్ నిల్వలకు బిల్లులు ఇవ్వబోమని స్పష్టంచేసింది. అయితే మొత్తం రూ.3.62 కోట్ల విలువైన ఐవీ ఫ్లూయిడ్స్ సరఫరా చేశామని, అందులో రూ.1.35 కోట్ల విలువైన సరుకును వెనక్కు తీసుకున్నందున అప్పటికే ఆసుపత్రుల్లో ఉపయోగించిన రూ.2.27 కోట్ల విలువైన సరుకుకు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కంపెనీ కోరింది. ఈ నేపథ్యంలో టీఎస్ఎంఎస్ఐడీసీ వర్గాలు కంపెనీకి పెండింగ్ బిల్లులను చెల్లించాలని ప్రభుత్వానికి నివేదించాయి. ఇటీవల జరిగిన సంస్థ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో దీన్ని ప్రతిపాదించడం గమనార్హం. ప్రమాణాల్లో తేడా లేనందునే: టీఎస్ఎంఎస్ఐడీసీ హసీబ్ కంపెనీ సరఫరా చేసిన ఐవీ ఫ్లూయిడ్స్ నమూనాలను పరీక్షించగా.. ప్రమాణాల్లో ఎక్కడా తేడా లేదని నిర్ధారణ అయినట్లు టీఎస్ఎంఎస్ఐడీసీ చెబుతోంది. మరి బాధితుల కళ్లు ఎలా పోయాయన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. కలుషితమైనవనే అనుమానం ఉండటం, ఆ ఫ్లూయిడ్స్‌పై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉండటంతో అప్పటివరకు నిల్వ ఉన్న సరుకును అధికారులు వెనక్కు పంపించారు. అప్పటికే వాడిన ఐవీ ఫ్లూయిడ్స్‌కు మాత్రం బిల్లులను చెల్లించాలని ప్రతిపాదించారు. మరోవైపు వాడిన ఫ్లూయిడ్స్ కూడా కలుషితం కాదని ఎలా నిర్ధారణ చేయగలరన్న ప్రశ్నకూ బదులు లేదు. ఈ పరిస్థితుల్లో కంపెనీకి బిల్లులు చెల్లించాలనుకోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటి ప్రమాణాల్లో తేడా లేనందున బిల్లులు చెల్లించాలని భావిస్తున్నామని, దీనిపై మేనేజ్మెంట్ కమిటీకి ప్రతిపాదనలు పంపిన మాట వాస్తవమేనని టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. ఆ ప్రతిపాదనపై కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. -
కొలిక్కిరాని పైసల పంచాయితీ
- ఏపీఎంఎస్‌ఐడీసీకి తెలంగాణ ఉద్యోగుల తాళం - సామగ్రి విజయవాడకు తరలిస్తుండగా నిరసన - టీఎస్ఎంఎస్ఐడీసీకి రూ.70 కోట్ల బాకీ సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో విభజన వివాదాలు ఇంకా కొలిక్కి రావడంలేదు. తొమ్మిదో షెడ్యూల్లోని వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఎంఎస్ఐడీసీ)లో పైసల పంచాయితీ మరోసారి రగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ) కార్యాలయంలోని సామగ్రిని విజయవాడకు తరలిస్తున్నారని తెలుసుకొని టీఎస్ ఎంఎస్ఐడీసీ ఉద్యోగులు బుధవారం అక్కడికి వెళ్లారు. విభజన ప్రక్రియలో భాగంగా తెలంగాణకు రావాల్సిన రూ.70 కోట్లను విడుదల చేయాలంటూ ఏపీ ఎంఎస్‌ఐడీసీకి తాళం వేశారు. ఈ సంస్థ ఆస్పత్రులకు అవసరమైన మందులను, సామగ్రిని కొనుగోలు చేసి సరఫరా చేస్తుంది. అభివృద్ధి పనులను చేయిస్తుంది. టెండర్ల ప్రక్రియ సమయంలో కాంట్రాక్టర్లు ఆయా పనులకు కేటాయించిన మొత్తంలో ఏడు శాతాన్ని ఈఎండీగా చెల్లిస్తారు. పనులు పూర్తి చేసి బిల్లులు తీసుకునే సమయంలో ఈఎండీ మొత్తాన్ని సైతం కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణలో పనులు పూర్తి చేసినవారికి చెల్లించాల్సిన మొత్తం ఏపీఎంఎస్ఐడీసీ బ్యాంకు ఖాతాలోనే ఉంది. రాష్ట్ర విభజన ప్రక్రియ సమయంలో ఏపీఎంఎస్ఐడీసీ ఆస్తులను, నిధులను చార్టర్డ్ అకౌంటెంట్లు లెక్కలు వేశారు. తెలంగాణకు రూ.70 కోట్లు ఇవ్వాలని సంస్థ మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరించాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఇది జరిగి మూడేళ్లు అవుతున్నా టీఎస్ఎంఎస్ఐడీసీకి రావాల్సిన బాకీని ఏపీఎంఎస్ఐడీసీ చెల్లించడంలేదు. ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు ఈ నిధులను మూడు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. తమకు రావాల్సిన నిధులను తమ ఖాతాల్లో జమ చేయాలని టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు బ్యాంకులకు గతంలోనే పలుసార్లు లేఖలు రాశారు. దీనికి ఏపీఎంఎస్ఐడీసీ అధికారుల నుంచి స్పందన లేదు. మరోవైపు ఏపీఎంఎస్ఐడీసీ కార్యాలయంలోని సామాన్లను విజయవాడకు తరలించాలని ఆ సంస్థ అధికారులు నిర్ణయించారు. రెండు రోజులుగా దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. విషయం తెలుసుకున్న టీఎస్ఎంఎస్ఐడీసీ చీఫ్ ఇంజనీరు, మరో ఇద్దరు అధికారులు మంగళవారం ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ వెంకటగోపినాథ్ వద్దకు వెళ్లారు. అయితే, ఆయన తెలంగాణ అధికారులను కలిసేందుకు ఇష్టపడలేదని తెలిసింది. దీంతో టీఎస్ఎంఎస్ఐడీసీ ఉద్యోగులు పలువురు ఏపీఎంఎస్ఐడీసీ కార్యాలయంలోని ఫైనాన్స్ విభాగం గదికి తాళం వేశారు. టీఎస్ఎంఎస్ఐడీసీకి రావాల్సిన రూ.70 కోట్లను వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. -
నిర్లక్ష్యపు ‘చూపు’ వల్లే..
♦ సరోజినీ ఆసుపత్రిలో పలువురికి కంటి చూపు పోయింది.. ♦ నాణ్యత పరీక్షలు చేయించకపోవడం వల్లే ఘటన ♦ టీఎస్ఎంఎస్ఐడీసీకి ‘కాగ్’ అక్షింతలు ♦ మందులు, పరికరాల నిధులు ఖర్చు చేయలేదని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: గతేడాది సరోజినీ ఆసుపత్రిలో పలువురికి కంటి చూపు పోవడం వెనుక నిర్లక్ష్యమే కారణమని కాగ్ తేల్చింది. ఆపరేషన్ల సమయంలో కలుషిత రింగర్ లాక్టేట్ ద్రావణాన్ని ఇవ్వటం వల్ల ఇన్ఫెక్షన్ సోకిందని, దీంతో 13 మంది కంటి చూపు కోల్పోయారని స్పష్టం చేసింది. ఆరుగురికి కంటి చూపు తిరిగి వచ్చినా.. మిగిలిన రోగులు ‘చూపు’ కోసం ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని కాగ్ తెలిపింది. ఇలాంటి ఘటనలు ఇంకా జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. కాగ్ ఇంకా ఏం చెప్పిందంటే.. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) గతేడాది మార్చిలో 24,456 సీసాల (మూడు బ్యాచ్‌ల్లో) ‘కాంపౌండ్ సోడియం లాక్టేట్ ఇంజెక్షన్ ఐపీ 500 ఎంఎల్’ను ఒక సంస్థ నుంచి కొనుగోలు చేసింది. వీటిని హైదరాబాద్ కేంద్రీయ ఔషధ సంస్థ (సీఎంఎస్) ద్వారా సరోజినీ కంటి ఆసుపత్రి సహా వివిధ ఆసుపత్రులకు పంపిణీ చేసింది. అయితే సరఫరా సంస్థ ఇచ్చిన అంతర్గత నివేదిక తప్ప వీటికి ప్రయోగశాలలో నాణ్యత పరీక్షలు చేయించలేదు. సరోజినీ కంటి ఆసుపత్రిలో ఈ మందును గతేడాది జూన్ 30వ తేదీన జరిగిన శస్త్రచికిత్సల సమయంలో 13 మంది రోగులకు వినియోగించారు. ఆ మరుసటి రోజున ఈ రోగులు ఇన్ఫెక్షన్కు గురయ్యారు. ఆరుగురికి కంటి చూపు తిరిగి వచ్చినా మిగిలిన రోగులు కంటిచూపు తిరిగి పొందడం కోసం ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఆపరేషన్ల సమయంలో కలుషిత రింగర్ లాక్టేట్ ద్రావణాన్ని ఇవ్వటమేనని ఇన్ఫెక్షన్కు కారణం. నిధుల విడుదల అంతంతే.. మందులు, ఔషధాలు, పరికరాల కొనుగోలుకు బడ్జెట్లో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేయలేదు. 2014–16 సంవత్సరాల్లో వచ్చిన నిధులను టీఎస్ఎంఎస్ఐడీసీ పూర్తిగా వినియోగించలేదు. 2014–15లో దాదాపు 40 శాతం నిధులు ఖర్చు చేయలేదు. మందులు, ఔషధాలు, సర్జికల్ పరికరాలను కొనేముందు టీఎస్ఎంఎస్ఐడీసీ వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల అవసరాలను పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఆయా ఆసుపత్రులు స్థానిక దుకాణాల నుంచి అధిక ధరలకు తెచ్చుకున్నాయి. రాష్ట్రంలో 635 రకాల నిత్యావసర మందులకుగాను 237 రకాల మందుల కొనుగోలుకు ఏర్పాటులేవీ చేయలేదు. 2014–16 మధ్య ఇచ్చిన 197 పర్చేజ్ ఆర్డర్లకు సరఫరాదారు సంస్థలు సరఫరా చేయలేదు. దీంతో మందులు లభించక అనేకమంది రోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఆదిలాబాద్, హైదరాబాద్, వరంగల్‌లోని కేంద్రీయ ఔషధ సంస్థ (సీఎంఎస్) కేంద్రాలు 80 శాతం కన్నా తక్కువ కాలపరిమితి కలిగిన మందులను తీసుకున్నాయి. ఆదిలాబాద్, హైదరాబాద్‌లలో తీసుకున్న మందుల్లో క్రియాశీలక పదార్థాలు నిర్దేశిత స్థాయికన్నా తక్కువగా ఉన్నాయి. ఐదు ఆసుపత్రుల్లో రూ.8.30 కోట్ల విలువైన మందులు, సర్జికల్ పరికరాలను పెద్దమొత్తంలో స్థానిక దుకాణాల నుంచి కొనుగోలు చేశారు. అవి సీఎంఎస్ కేంద్రాల్లో ఉన్నాయా లేదా కూడా ఆసుపత్రి వర్గాలు నిర్ధారించుకోలేదు. అలాగని కొనుగోళ్లలో పారదర్శకత కోసం రేటు కాంట్రాక్టు విధానాన్నీ అనుసరించలేదు. రూ.6.50 లక్షల వెంటిలేటర్.. రూ.11 లక్షలకు కొనుగోలు ఆదిలాబాద్, హైదరాబాద్, వరం గల్ సీఎంఎస్ కేంద్రాల్లో కొన్ని మందులు నిల్వ లేకపోవడంతో ఆసుపత్రుల్లో కొరత ఏర్పడింది. కొన్ని మందులను నిర్ణీత ఉ ష్ణోగ్రత వద్ద పదిలపరచవలసి ఉండగా ఆదిలాబాద్, వరంగల్ సీఎంఎస్ కేంద్రా ల్లో భద్రపరిచేందుకు శీతలీకరణ ఏర్పా ట్లు లేవు. గాంధీ ఆసుపత్రికి 2015లో 50 వెంటిలేటర్లు కొనుగోలు చేశారు. మార్కె ట్లో రూ.6.50 లక్షలున్న వెంటిలేటర్‌ను రూ.11 లక్షలతో కొనుగోలు చేశారు. ఇం దులో ప్రభుత్వ సొమ్ము పెద్ద ఎత్తున నష్ట పోయి ఉండొచ్చు. ఇలాంటివి ఎన్ని జరిగాయో..! సరోజినీ ఆస్పత్రి ఘటన ఓ ఉదాహరణ మాత్ర మే. ఇంకా అనేకం జరిగి ఉండొచ్చు. 2014–16 మధ్య టీఎస్ఎంఎస్ఐడీసీ రూ.237 కోట్ల విలువైన మందులు, సర్జికల్ పరికరాలు కొనుగోలు చేసింది. అవన్నీ నిబంధనల ప్రకా రం నాణ్యత పరిశీలన నివేదికలు అందిన తర్వాతే పంపిణీ చేశారన్న నమ్మకం లేదు. ఆసుపత్రుల్లో రోగులకు భరోసా కూడా లేదు. నాణ్యత విశ్లేషణ నివేదికలు అందిన తర్వాతే మం దులను పంపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -
ఎంజీఎంలో మరో నాసిరకం ఔషధం?
- ప్రాలీడోక్సైజ్ క్లోరైడ్ ఇంజక్షన్ లో ఫంగస్..! ఎంజీఎం: ప్రభుత్వాస్పత్రులకు టీఎస్ ఎంఎస్ఐడీసీ ద్వారా సరఫరా చేస్తున్న ఔషధాలలో నాసిరకమైనవి సరఫరా అవుతున్నట్లు ఆరోపణలు సద్దుమణగకముందే ఆదివారం ఎంజీఎం ఆస్పత్రిలో మరో ఔషధంలో ఫంగస్ వచ్చినట్లు సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో డ్రగ్ అధికారులు ఆదివారం రాత్రి శాంపిల్స్ సేకరించారు. క్రిమిసంహారక మందు తాగడంతో పాటు ఏదైనా విషం తాగి కొట్టుమిట్టాడుతున్న రోగులకు అందించే ప్రాలీడోక్సైజ్ క్లోరైడ్ ఇంజక్షన్‌లో ఫంగస్ వచ్చినట్లు వైద్యసిబ్బంది గుర్తించారు. అయితే, ఈ విషయాన్ని ఎంజీఎం పరిపాలనాధికారులు వెలుగులోకి రాకుండా జాగ్ర త్తలు తీసుకోగా, విషయాన్ని రోగులు వెలుగులోకి తీసుకొచ్చారు. దీంతో అధికారులు ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఎంజీఎంకు వచ్చారు. ఫార్మాసిస్టులు అందుబాటులో లేకపోవంతో డ్రగ్ అధికారులు శాంపిల్స్ సేకరించడానికి రెండు గంటల సమయం పట్టింది. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి సరఫరా అరుున 1604502 బ్యాచ్‌కు చెందిన ప్రాలీ డోక్సైమ్ క్లోరైడ్ ఇంజక్షన్‌లో ఫంగస్ ఉన్నట్లు ఆరోపణలు రావడంతో రోగులకు ఈ బ్యాచ్ ఇంజక్షన్లు అందించవద్దని డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఎంజీఎం ఫార్మాసిస్టులను అదేశించారు. ఔషధ నియంత్రణ శాఖ జేడీ అమృతరావు, డీడీ సురేంద్రనాథ్సాయి అదేశాల మేరకు వీటి శాంపిల్స్‌ను పరిశీలిస్తున్నామన్నారు. -
నాసిరకం మందులకు రాజముద్ర!
టీఎస్ఎంఎస్ఐడీసీలో అవినీతి తాండవం కమీషన్లు ఇస్తే నాణ్యతా ప్రమాణాలు లేకున్నా ఆమోదం ముడుపులివ్వకుంటే మంచి మందులైనా కొర్రీలు అనాలసిస్ విభాగంలో కొందరు ఫార్మసిస్ట్‌ల ఇష్టారాజ్యం పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ)లో అవినీతి తాండవిస్తోంది! అక్రమార్కుల ధన దాహానికి మందుల నాణ్యత గాలికి కొట్టుకుపోతోంది!! సంస్థలోని అనాలసిస్ వింగ్ (నాణ్యతా ప్రమాణాలు పరీక్షించే విభాగం)లో కొందరు ఫార్మసిస్ట్‌లు ముడుపులిస్తే నాసిరకం మందులకు రాజముద్ర వేస్తూ ముడుపులివ్వకుంటే మంచి మందులైనా అంగీకరించడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కుల అండ చూసుకొని టీఎస్ఎంఎస్ఐడీసీకి మందులు, సర్జికల్స్ తదితరాలు సరఫరా చేసే సప్లయర్లు నాసిరకం మందులు సరఫరా చేస్తున్నారు. నిబంధనల ప్రకారమైతే 220 రకాల మందులతోపాటు కొన్ని సర్జికల్ వస్తువులకు అనాలసిస్ వింగ్‌లో నాణ్యతా ప్రమాణాలను పరీక్షించి ఆమోదం తెలపాల్సి ఉంది. వీటికి సంబంధించిన నమూనాలను ఔషధ నియంత్రణ మండలి ల్యాబొరేటరీతోపాటు, హైదరాబాద్‌లోని మరో రెండు ప్రైవేటు ల్యాబొరేటరీల్లో పరీక్షలు నిర్వహించాలి. అయితే ఈ ల్యాబొరేటరీలు ఇచ్చే నివేదికలపై అనాలసిస్ వింగ్‌లోని వారికే మొదట సమాచారం అందుతోంది. దీంతో వారు ఈ నివేదిక ఆధారంగా సప్లయర్లకు సమాచారమిస్తున్నారు. ఒకవేళ మందులు నాసిరకం అని తేలితే.. వెంటనే ల్యాబొరేటరీలు ఇచ్చిన నివేదికలను పక్కన పెట్టి, మరో కొత్త బ్యాచ్ మందులను ల్యాబొరేటరీలకు పంపి సరిచేస్తున్నారు. ముడుపులు ఇవ్వకుంటే నాసిరకం అని తేలకపోయినా సరిగా లేవని ఫిర్యాదులు పంపి వాటిని పక్కన పెడుతున్నారు. తాజాగా తెలంగాణలో 15 రకాల మందులు నాసిరకం అని ఔషధ నియంత్రణశాఖ తేల్చింది. అయితే నాసిరకం అని తేలాక కూడా వాటిని వెనక్కు తీసుకురాకుండా రోగులకు ఇస్తున్నారు. ఈ తతంగం వెనక టీఎస్ఎంఎస్ఐడీసీ అనాలసిస్ వింగ్‌లో పనిచేస్తున్న ఒక ఫార్మసిస్ట్ చక్రం తిప్పుతున్నట్టు తెలిసింది. ఇటీవలే ఇన్చార్జి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా నియమితులైన అధికారి కూడా వీటిని అరికట్టలేని పరిస్థితి నెలకొంది. టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీగా ప్రస్తుతానికి సురేశ్ చందానే కొనసాగుతుండగా ఆయన సమయం కేటాయించకపోవడంతో అక్రమాల బాగోతం నియంత్రణలోకి రావట్లేదు. బ్లాక్‌లిస్టులో ఉన్నవి కొన్నే! రాష్ట్రంలో బ్లాక్‌లిస్టులో ఉన్న నాసిరకం మందులు మచ్చుకు కొన్ని మాత్రమేనని తెలుస్తోంది. అనాలసిస్ విభాగంలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్‌ల సాయంతో మందుల బ్యాచ్‌లు మార్చి తిరిగి ల్యాబొరేటరీలకు పంపించడం, మంచివని తేల్చి మళ్లీ మార్కెట్లోకి పంపించడం రివాజుగా మారింది. ఈ సంస్థ ఉమ్మడిగా ఉన్నప్పుడు సైతం పలుసార్లు ఇలాంటి కమీషన్ల బాగోతం బయటపడినా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు తెలంగాణ మౌలిక వైద్య సదుపాయాల సంస్థలో ఇలాంటి ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. -
పీహెచ్సీ పరికరాల కొనుగోళ్లు వాయిదా
ఇప్పటికీ రాని బ్లడ్‌బ్యాంకు యంత్రాలు ఈడీపై తీవ్రమవుతున్న ఆరోపణలు బదిలీ అయినా కదలని అధికారి టీఎస్ఎంఎస్ఐడీసీలో రోజుకో లీల సాక్షి, హైదరాబాద్: తీవ్ర అవినీతి ఆరోపణలతో రూ.200 కోట్ల విలువైన వైద్య పరికరాల కొనుగోళ్లు వాయిదాపడి నెలరోజులైనా కాకముందే మరో వివాదానికి తెరలేచింది. తెలంగాణ వ్యాప్తంగా 55 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్సీ)ల్లో రూ.20 కోట్లతో పరికరాల కొనుగోళ్లకు ఆర్డరు ఇచ్చారు. అయితే తమకు నచ్చిన కంపెనీలకే రిపోర్టు ఇవ్వమన్నారని... అలా అయితే కమిటీ సభ్యులుగా తామెందుకు రావాలని... వారి మనుషులనే తెచ్చుకుంటే సరిపోదా అంటూ కమిటీ సభ్యులు మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో పరికరాల కొనుగోళ్లు వాయిదాపడ్డాయి. అసలే పీహెచ్‌సీల్లో కనీస వసతులు లేక అల్లాడుతోంటే, మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థలో ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటం వివాదాలకు తావిస్తోంది. రక్తనిధి యంత్రాల పరిస్థితీ అంతే... ఇటీవలే రూ.9 కోట్లతో రక్తనిధి కేంద్రాలకు అవసరమైన యంత్రాలకు టెండరు పిలిచారు. అయితే ఒక కంపెనీకి టెండరు కట్టబెట్టాలని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే తాము అనుకున్న కంపెనీ రాకపోవడంతో వచ్చిన కంపెనీకి ఇప్పటికీ ఆర్డరు ఇవ్వలేదు. దీంతో డెంగీ తదితర రోగాలు వచ్చినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్లేట్లెట్స్ తదితర కణాలను వేరుచేసే యంత్రాలు లేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ)కి సరఫరా అయ్యే మందులు, యాంటీబయాటిక్స్, కాటన్, బ్యాండేజీ తదితర కొన్నిరకాలు ఔషధ నియంత్రణ శాఖ నాసిరకం అని తేల్చినా ఆ సంస్థ అధికారులు ఓకే చెబుతున్నారు. తాజాగా రోలర్ బ్యాండేజీపై ఓ కంపెనీకి సంబంధించి డ్రగ్ కంట్రోల్ విభాగం రెండు ఉత్పత్తులను నాసిరకంగా తేల్చింది. అయినా అనాలసిస్ విభాగంలో పనిచేసే ఓ ఫార్మసిస్ట్ వీటినే కొనసాగిస్తూనే ఉన్నారు. పలువురు సరఫరాదారులు అనాలసిస్ విభాగంలో పనిచేస్తున్న వారికి మామూళ్లివ్వడమే కారణమనే ఆరోపణలున్నాయి. మామూళ్ల వ్యవహారం... ప్రస్తుతం టీఎస్ఎంఎస్ఐడీసీలో ఎండీలేరు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్చందానే ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే జీఎం కూడా లేరు. ప్రస్తుతం రెవెన్యూ శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఈడీ) మాత్రమే ఉన్నారు. ఆయన చెప్పిందే వేదంగా నడుస్తోంది. గత ఆరు నెలల్లో ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో నెల కిందట బదిలీ చేశారు. ఆయన స్థానంలో పద్మారావు అనే మరో రెవెన్యూ అధికారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే ఆ ఉత్తర్వులు బేఖాతర్ అయ్యాయి. ప్రస్తుత ఈడీ తన బదిలీని ఆపుకొని అదే పోస్టులో దర్జాగా కొనసాగుతున్నారు. సరఫరాదారుల నుంచి మామూళ్లు తీసుకుని ఉన్నతాధికారులకు ఇవ్వడం వల్లే ఇక్కడ ఉండగలుగుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. సివిల్ పనులు, మందులు, పరికరాల కొనుగోలు ఇలా 1,000 కోట్ల వరకూ జరిగే ఈ వ్యవహారాలకు ఎండీ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడి ఘోరంగా తయారైంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ విభాగం పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.