కొత్త మెడికల్‌ కాలేజీలు త్వరగా పూర్తి కావాలి | Harish Rao asks officials to speed up medical college works in Telangana | Sakshi
Sakshi News home page

కొత్త మెడికల్‌ కాలేజీలు త్వరగా పూర్తి కావాలి

Jan 8 2023 2:34 AM | Updated on Jan 8 2023 10:40 AM

Harish Rao asks officials to speed up medical college works in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న తొమ్మిది వైద్య కళాశాలల పనులను వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయం నుంచి నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌.హెచ్‌.ఎం), తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్య కళాశాలల పనులకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. గత ఏడాది 8 మెడికల్‌ కాలేజీలను ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయనున్న కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగామ, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని కాలేజీల్లో ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ వైద్య మండలి బృందం పరిశీలనకు వచ్చేనాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలన్నారు.  

మాతా, శిశు కేంద్రాలను త్వరగా పూర్తి చేయాలి.. 
నిర్మాణంలో ఉన్న మాతా, శిశు సంరక్షణ కేంద్రాలను త్వరగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నిమ్స్, గాంధీ ఆసుపత్రుల ఆవరణల్లో నిర్మిస్తున్న మాతా, శిశు కేంద్రాలను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అలాగే వివిధ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న 13 తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సెంటర్లను వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మార్చురీల పనులు, 12 సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్స్‌ల పనులను కూడా మంత్రి సమీక్షించారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల సమీపంలో తొమ్మిది క్రిటికల్‌ కేర్‌ హాస్పిటల్స్‌ ఏర్పాటు చేస్తున్నామని, ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. కాగా, అన్ని ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

మందుల సరఫరాలో ఎలాంటి నియంత్రణ ఉండవద్దని, అవసరమైన మేరకు మందులను ఆయా ఆసుపత్రులకు సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, 24 గంటల్లోగా పరీక్ష ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా చూసుకోవడం సూపరింటెండెంట్ల బాధ్యత అని స్పష్టంచేశారు.

ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తూ వైద్య పరికరాలు సమకూర్చుతోందని, ఈ నేపథ్యంలో అవి ప్రజలకు పూర్తిస్థాయిలో సద్వినియోగపడేలా చూడాలని చెప్పారు. ఈ సమీక్షలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్‌ శ్వేత మహంతి, టి.ఎస్‌.ఎం.ఎస్‌.ఐ.డి.సి చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, డి.ఎం.ఇ. రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement