సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీలకు భవనాలను వేగంగా నిర్మించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయంలోగా తాత్కాలిక భవనాలను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సంగారెడ్డి, వనపర్తి, జగిత్యాల, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండంలలో ఈ కాలేజీలను నెలకొల్పాలని సంకల్పించారు.
కానీ వాటి తాత్కాలిక భవనాల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. సకాలంలో భవనాల నిర్మాణం జరగకపోతే జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) తనిఖీల సందర్భంగా సమస్యలు వచ్చే అవకాశముంది. ఈ అంశాలను ఎత్తిచూపుతూ ఈ నెల 12న ‘సాక్షి’ప్రధాన సంచికలో ‘వైద్య కాలేజీలేవీ?’శీర్షికన కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి హరీశ్‌రావు.. కొత్త కాలేజీ భవనాల నిర్మాణంపై ఆయా జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ప్రతి మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పురోగతిని తెలుసుకున్నారు. కాంట్రాక్టర్లు, వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ), తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) అధికారులతోనూ మంత్రి చర్చించారు. నిర్ణీత సమయంలోగా భవనాలను నిర్మించాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు
ఇటీవలే వైద్యారోగ్యశాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి హరీశ్‌రావు.. ప్రజారోగ్య వ్యవస్థను గాడిలో పెట్టడంపైనా దృష్టిపెట్టారు. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. వైద్యులే సమయపాలన పాటించడం లేదని, ఇక కిందిస్థాయి సిబ్బంది గురించి అడిగేవారే లేకుండా పోతున్నారన్న ఆరోపణలపై స్పందించారు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది నిర్ణీత సమయంపాటు ఆస్పత్రుల్లో ఉండాలని స్పష్టం చేశారు.
సమయపాలన పాటించనివారిపై కఠిన చర్యలు చేపడతామని చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, సీసీ కెమెరాలు సరిగా పనిచేసేలా చూడాలని హరీశ్‌రావు ఆదేశించారు. రాష్ట్ర, జిల్లాస్థాయిల ఉన్నతాధికారులు కూడా ఆకస్మిక తనిఖీలను చేపట్టాలని సూచించారు. విభాగాల వారీగా ఖాళీలు, భర్తీపై నివేదికలు అందజేయాలని అధికారులను కోరారు. ఇక 108, 104, పల్లె దవాఖానాల బలోపేతానికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానిపై నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment