సాక్షి, హైదరాబాద్: మాతా, శిశు సంరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మాతృ మరణాల రేటు (ఎంఎంఆర్) గణనీయంగా తగ్గటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్‌ఆర్‌ఎస్) ప్రత్యేక బులిటెన్ 2018–20 ప్రకారం, రాష్ట్రంలో ఎంఎంఆర్ 43కు తగ్గింది. 2017–19లో ఇది 56 ఉండగా, వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల ఎంఎంఆర్ ఏకంగా 13 పాయింట్లు తగ్గింది. తద్వారా అతి తక్కువ మరణాలతో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.
కేరళ, మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జాతీయ సగటు 97గా నమోదైంది. అంటే తెలంగాణ కన్నా రెట్టింపు అన్నమాట. 2017–19లోనూ తక్కువ ఎంఎంఆర్‌లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రం ఏర్పడేనాటికి ఎంఎంఆర్ 92గా ఉండేది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల క్రమంగా తగ్గుతూ ఇప్పుడు 43కు చేరింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 49 పాయింట్లు తగ్గింది. జాతీయ సగటు 2014లో 130గా ఉండగా... ఇప్పుడు 97కు తగ్గింది. కేవలం 33 పాయింట్లు మాత్రమే తగ్గుదల నమోదైంది.
►అత్యధిక మాతృమరణాలు నమోదవుతున్న టాప్ మూడు రాష్ట్రాల్లో అస్సాం 195, మధ్యప్రదేశ్ 173, ఉత్తర్ ప్రదేశ్ 167గా నమోదయ్యాయి. 2017–19 నుంచి 2018–20 మధ్య ఆయా రాష్ట్రాల్లో ఎంఎంఆర్ తగ్గకపోగా పెరిగింది. మధ్యప్రదేశ్‌లో 10 పాయింట్లు, హరియాణాల్లో 14 పెరగగా, ఉత్తర్ ప్రదేశ్‌లో ఎంఎంఆర్ తగ్గుదలలో ఎలాంటి పురోగతి నమోదు కాలేదు.
ఐరాస ప్రకారం 70 కంటే తక్కువ లక్ష్యం...
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ‘మాతృ మరణం అనేది ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు లేదా గర్భం ముగిసిన 42 రోజులలోపు సంబంధిత కారణాల వల్ల జరుగుతుంది. 15–49 ఏళ్ల వయస్సుగల సంబంధిత మహిళల్లో లక్షకు జరిగే మరణాలను లెక్కలోకి తీసుకుంటారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డీజీ) లక్ష్యం లక్షకు 70 కంటే తక్కువ చేయాలని నిర్ణయించగా, తెలంగాణ ఎప్పుడో ఆ లక్ష్యానికి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కేసీఆర్ కిట్, మాతా శిశు సంరక్షణ చర్యల్లో భాగంగానే ఎంఎంఆర్ తగ్గింది.
కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా ప్రతి ఒక్క గర్బిణిని నమోదు చేసుకోవడం, ప్రతి నెలా చెకప్స్ చేయించడం, ఉచితంగా అమ్మ ఒడి వాహన సేవలు అందించడం వల్ల గర్భిణులకు నాణ్యమైన సేవలు అన్ని దశల్లో అందుతున్నాయి. అరికట్టగలిగిన మాతృ మరణాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంలో భాగంగా మిడ్ వైఫరీ వ్యవస్థను ప్రభుత్వం ప్రారంభించింది. ఎంపిక చేసిన నర్సులకు శిక్షణ ఇచ్చి వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు 207 మంది మిడ్ వైఫరీ నర్సులు సేవలు అందిస్తున్నారు.
వైద్య, ఆరోగ్య శాఖ కృషి అభినందనీయం: మంత్రి హరీశ్‌రావు
ఎంఎంఆర్ 56 నుంచి 43కు తగ్గటం గొప్ప విషయం. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలతో పాటు, ఇతర సంరక్షణ చర్యలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రంలో 300 అమ్మ ఒడి వాహనాలు ఉండగా, ఈ ఏడాది ఇప్పటివరకు 12.61 లక్షల మంది గర్బిణులు లబ్ధి పొందారు. మొత్తం కేసీఆర్ కిట్ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.1,525 కోట్లు.
ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కృషి అభినందనీయం. ఎంఎంఆర్ తగ్గుదలలో డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు వెనుకబడ్డాయి. అత్యధిక మాతృ మరణాలు నమోదవుతున్న టాప్ మూడు రాష్ట్రాలు అస్సాం, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాలే.
Comments
Please login to add a commentAdd a comment