Maternal and child care centers
-
Telangana: గణనీయంగా తగ్గిన మాతృ మరణాలు..
సాక్షి, హైదరాబాద్: మాతా, శిశు సంరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మాతృ మరణాల రేటు (ఎంఎంఆర్) గణనీయంగా తగ్గటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్) ప్రత్యేక బులిటెన్ 2018–20 ప్రకారం, రాష్ట్రంలో ఎంఎంఆర్ 43కు తగ్గింది. 2017–19లో ఇది 56 ఉండగా, వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల ఎంఎంఆర్ ఏకంగా 13 పాయింట్లు తగ్గింది. తద్వారా అతి తక్కువ మరణాలతో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. కేరళ, మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జాతీయ సగటు 97గా నమోదైంది. అంటే తెలంగాణ కన్నా రెట్టింపు అన్నమాట. 2017–19లోనూ తక్కువ ఎంఎంఆర్‌లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రం ఏర్పడేనాటికి ఎంఎంఆర్ 92గా ఉండేది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల క్రమంగా తగ్గుతూ ఇప్పుడు 43కు చేరింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 49 పాయింట్లు తగ్గింది. జాతీయ సగటు 2014లో 130గా ఉండగా... ఇప్పుడు 97కు తగ్గింది. కేవలం 33 పాయింట్లు మాత్రమే తగ్గుదల నమోదైంది. ►అత్యధిక మాతృమరణాలు నమోదవుతున్న టాప్ మూడు రాష్ట్రాల్లో అస్సాం 195, మధ్యప్రదేశ్ 173, ఉత్తర్ ప్రదేశ్ 167గా నమోదయ్యాయి. 2017–19 నుంచి 2018–20 మధ్య ఆయా రాష్ట్రాల్లో ఎంఎంఆర్ తగ్గకపోగా పెరిగింది. మధ్యప్రదేశ్‌లో 10 పాయింట్లు, హరియాణాల్లో 14 పెరగగా, ఉత్తర్ ప్రదేశ్‌లో ఎంఎంఆర్ తగ్గుదలలో ఎలాంటి పురోగతి నమోదు కాలేదు. ఐరాస ప్రకారం 70 కంటే తక్కువ లక్ష్యం... ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ‘మాతృ మరణం అనేది ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు లేదా గర్భం ముగిసిన 42 రోజులలోపు సంబంధిత కారణాల వల్ల జరుగుతుంది. 15–49 ఏళ్ల వయస్సుగల సంబంధిత మహిళల్లో లక్షకు జరిగే మరణాలను లెక్కలోకి తీసుకుంటారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) లక్ష్యం లక్షకు 70 కంటే తక్కువ చేయాలని నిర్ణయించగా, తెలంగాణ ఎప్పుడో ఆ లక్ష్యానికి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కేసీఆర్ కిట్, మాతా శిశు సంరక్షణ చర్యల్లో భాగంగానే ఎంఎంఆర్ తగ్గింది. కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా ప్రతి ఒక్క గర్బిణిని నమోదు చేసుకోవడం, ప్రతి నెలా చెకప్స్ చేయించడం, ఉచితంగా అమ్మ ఒడి వాహన సేవలు అందించడం వల్ల గర్భిణులకు నాణ్యమైన సేవలు అన్ని దశల్లో అందుతున్నాయి. అరికట్టగలిగిన మాతృ మరణాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంలో భాగంగా మిడ్ వైఫరీ వ్యవస్థను ప్రభుత్వం ప్రారంభించింది. ఎంపిక చేసిన నర్సులకు శిక్షణ ఇచ్చి వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు 207 మంది మిడ్ వైఫరీ నర్సులు సేవలు అందిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ కృషి అభినందనీయం: మంత్రి హరీశ్‌రావు ఎంఎంఆర్ 56 నుంచి 43కు తగ్గటం గొప్ప విషయం. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలతో పాటు, ఇతర సంరక్షణ చర్యలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రంలో 300 అమ్మ ఒడి వాహనాలు ఉండగా, ఈ ఏడాది ఇప్పటివరకు 12.61 లక్షల మంది గర్బిణులు లబ్ధి పొందారు. మొత్తం కేసీఆర్ కిట్ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.1,525 కోట్లు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కృషి అభినందనీయం. ఎంఎంఆర్ తగ్గుదలలో డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు వెనుకబడ్డాయి. అత్యధిక మాతృ మరణాలు నమోదవుతున్న టాప్ మూడు రాష్ట్రాలు అస్సాం, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాలే. -
Telangana: టార్గెట్ 100!
సాక్షి, హైదరాబాద్: మాతా, శిశు ఆరోగ్యంపై ప్రభుత్వం మరింత శ్రద్ధ చూపుతోంది. పోషకాల లోపం అధిగమించడంతో పాటు ఆరోగ్యవంతమైన తరాన్ని నిర్మించాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టింది. అంగన్వాడీ కేంద్రాల్లోని టీచర్లకు ఈ మేరకు లక్ష్యాలను నిర్దేశించింది. కేంద్రంలో నమోదైన ప్రతి లబ్ధిదారుపై నిరంతర పర్యవేక్షణ ఉంచేలా బాధ్యతలు పెట్టింది. ఒక నెల వ్యవధిలో ప్రతి అంగన్వాడీ టీచర్ సంబంధిత కేంద్రం పరిధిలోని కనీసం వంద మంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య స్థితిని అంచనా వేయాలి. లబ్ధిదారులైన గర్భిణులు, బాలింతలు, పాలిచ్చే తల్లులు, మూడేళ్లలోపు చిన్నారుల ఆరోగ్య స్థితి పరిశీలనతో పాటు చిన్నారుల బరువు తూచడం, అనారోగ్య సమస్యలు గుర్తిస్తే సమీప ఆస్పత్రులకు రిఫర్ చేయడం, అంగన్వాడీ కేంద్రం ద్వారా అందించే పోషక విలువలతో కూడిన (న్యూట్రిషన్) సరుకుల పంపిణీ పక్కాగా నిర్వహించడంలాంటి కార్యక్రమాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలి. ప్రతి నెలా నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసిన టీచర్లకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అన్ని జిల్లాల సంక్షేమాధికారులకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సర్క్యులర్లను పంపింది. అరవై శాతం దాటితే అర్హత.. అంగన్వాడీ టీచర్లకు నిర్దేశించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పోత్స్రాహకాలను ఇవ్వనుంది. ప్రతి నెలా టార్గెట్‌గా వంద లబ్ధిదారుల పరిశీలనను నిర్దేశించినప్పటికీ.. అందులో కనీసం 60 శాతం లక్ష్యం పూర్తి చేసిన వారు ప్రోత్సాహకాల పరిధిలోకి వస్తారు. వారి పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిని యూనిట్‌గా పరిగణిస్తూ ఆయా టీచర్లకు ప్రోత్సాహకాలు ఇస్తారు. నెలకు సగటున రూ.1,000 వరకు గౌరవ వేతనంతో కలిపి ఇవ్వనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల నుంచే ఈ ప్రోత్సాహకాలు ఇచ్చేలా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ క్షేత్రస్థాయిలోని అంగన్వాడీ టీచర్ల పనితీరును మదింపు చేయనుంది. ఆన్లైన్లో నమోదు అంగన్వాడీ కేంద్రం పరిధిలోని లబ్ధిదారుల ఆరోగ్యస్థితిని టీచర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి రికార్డు చేస్తారు. వారి ఇంటికి వెళ్లి నిర్దేశించిన వివరాలు సేక రిస్తారు. వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తారు. సలహాలు, సూచనలిస్తారు. పోషక విలు వల్లో లోపాలు గుర్తిస్తే వారికి అదనపు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రత్యేక జాబితాలో చేరుస్తారు. అనంతరం వారి ఇంటి వద్దకు అదనపు పౌష్టికాహారాన్ని పంపి ప్రత్యేక పరిశీలన కేటగిరీలోకి చేర్చుతారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వారి ఆరోగ్యస్థితిని సమీక్షిస్తారు. ఇది నిర్దేశిత పద్ధతిలో కొనసాగుతుంది. -
మాత, శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం
ఆదిలాబాద్‌టౌన్: మాత, శిశు మరణాల శాతం తగ్గించడమే లక్ష్యమని జిల్లా వైద్యారోగ్య శాఖ పీవో డీటీటీ డాక్టర్ మనోహర్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ వైద్య కళాశాలలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందికి మాత, శిశు మరణాల శాతం తగ్గించడంపై దక్షత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ లక్ష మంది బాలింతల్లో 92 మంది మృత్యువాత పడుతున్నారని, వెయ్యి మంది చిన్నారులగాను 28 మంది నవజాత శిశువులు చనిపోతున్నారని తెలిపారు. మాత, శిశు మరణాలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత వైద్యాధికారులు, సిబ్బందిపై ఉందన్నారు. మూడు రోజులు జరిగే శిక్షణ కార్యక్రమంలో ప్రసవానికి ముందు, తర్వా త స్టాఫ్‌నర్సులు, వైద్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జఫ్రిగో ప్రోగాం అధికారి డాక్టర్ ప్రేరణ, ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ ప్రతినిధి సత్యేంద్రనాథ్, కాగజ్‌నగర్ సీఎస్ విద్యావతి, వైద్యాధికారులు, స్టాఫ్‌నర్సులు, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
మాతృత్వమే శాపమా?
► ఏపీలో ఏడాదిలోనే 577 మంది తల్లుల మృత్యువాత ► గర్భస్థ శిశు పరీక్షలు జరగకనే ఈ దుస్థితి ► లక్షకు 120 మంది తల్లులు చనిపోతున్నారు! సాక్షి, హైదరాబాద్ ప్రసవ సమయంలో పురిటి నొప్పులు పంటి బిగువున భరించి, కన్నపేగు భూమిపై అడుగిడేదాకా ఆ తల్లి పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. భూమాతకున్నంత ఓర్పుతో ‘అమ్మ’ అనే పిలుపుకోసం పరితపిస్తుంది మహిళ. అలాంటి సందర్భంలో సరైన వైద్య సదుపాయాల్లేక, గర్భస్థ శిశు పరీక్షలు సక్రమంగా జరగక గర్భిణులు లోకం నుంచి నిష్ర్కమించాల్సిన అత్యంత దారుణ, జుగుప్సాకర పరిస్థితులు నేడు నెలకొంటున్నాయి. వైద్యసేవలు విస్తృతం చేశామని చెప్పుకుంటున్న ఏపీ సర్కారు.. ప్రసవ సమయంలో మృతి చెందుతున్న తల్లుల సంఖ్యను ఏమాత్రం తగ్గించలేకపోతోంది. ఒక్క ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్‌లో 577 మంది తల్లులు మృతి చెందినట్లు గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి. వీరిలో అధికశాతం పేదవారే కావడం, అది కూడా గిరిజన ఏజెన్సీలైన రంపచోడవరం, పాడేరు ప్రాంతాల్లో వైద్యసేవలు సరిగా అందక తల్లులు మృతి చెందుతుండటం కలచివేసే అంశం. కొన్ని జిల్లాల్లో లక్షకు 120 మంది తల్లులు ప్రసవ సమయంలోనే మృత్యువాత పడుతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. పొరుగున ఉన్న తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో తల్లుల మరణాలు (మథర్ మోర్టాలిటీ రేటు-ఎంఎంఆర్) భారీ సంఖ్యలో తగ్గించగలిగారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య ఏ మాత్రం తగ్గక పోవడం భయాందోళన కలిగించే అంశం. మాతా శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు పేరిట ఏటా జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి వందల కోట్లు వెచ్చిస్తున్నా ఫలితం శూన్యం. గర్భస్థ శిశువైద్య పరీక్షలు సరిగా జరగకపోవడం, సిజేరియన్ ప్రసవాలు ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు పేర్కొంటున్నారు. విశాఖ జిల్లాల్లో అత్యధిక మరణాలు.. రాష్ట్రంలో గతేడాది అత్యధిక మాతృ మరణాలు విశాఖపట్నం జిల్లాలో సంభవించడం గమనార్హం. జిల్లాలో ఏడాదిలో 55 వేల ప్రసవాలు జరిగితే 66 మంది తల్లులు మరణించారు. ఈ ప్రకారం లక్షకు 120 మంది మృతి చెందినట్టు లెక్క. ఆ తర్వాత కరువు జిల్లా అయిన అనంతపురంలో 58 వేల ప్రసవాలకు 58 మంది తల్లులు మృతి చెందారు. ఇవి కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుర్తించినవి మాత్రమే. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో లెక్కేలేదు. 2014-15 సంవత్సరానికి 577 మంది తల్లులు ప్రసవ సమయంలో మృతిచెందగా, 2015-16లోనూ అదేస్థాయిలో 577 మంది చనిపోయారు. నిపుణులు చెబుతున్న కారణాలివే.. ►గర్భం దాల్చినప్పటి నుంచే గర్భస్థ శిశు పరీక్షలు సరిగా జరగకపోవడం ► ఐరన్, ఫోలిక్ సంబంధించిన లోపాలు చాలామంది తల్లుల్లో ఉన్నట్టు గుర్తించకపోవడం ్హ అధిక రక్తపోటున్న మహిళలకు సరైన వైద్యం అందకపోవడం ►సుఖ ప్రసవానికి వైద్యులు విముఖత వ్యక్తం చేస్తూ సిజేరియన్ చేయడం ►సిజేరియన్ రెండోసారి సరిగా చెయ్యకపోతే ప్రాణాపాయం జరుగుతుండటం ్హ యాంటీనేటల్ చెకప్స్ జరగక తల్లుల గర్భస్థ పిండ వృద్ధిని అంచనా వేయలేకపోవడం ్హ హైరిస్క్ ప్రెగ్నెన్సీతో ఆస్పత్రులకు రాగానే సర్కారీ ఆస్పత్రుల్లో చేతులెత్తేయడం