మాతృత్వమే శాపమా?
► ఏపీలో ఏడాదిలోనే 577 మంది తల్లుల మృత్యువాత
► గర్భస్థ శిశు పరీక్షలు జరగకనే ఈ దుస్థితి
► లక్షకు 120 మంది తల్లులు చనిపోతున్నారు!
సాక్షి, హైదరాబాద్ ప్రసవ సమయంలో పురిటి నొప్పులు పంటి బిగువున భరించి, కన్నపేగు భూమిపై అడుగిడేదాకా ఆ తల్లి పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. భూమాతకున్నంత ఓర్పుతో ‘అమ్మ’ అనే పిలుపుకోసం పరితపిస్తుంది మహిళ. అలాంటి సందర్భంలో సరైన వైద్య సదుపాయాల్లేక, గర్భస్థ శిశు పరీక్షలు సక్రమంగా జరగక గర్భిణులు లోకం నుంచి నిష్ర్కమించాల్సిన అత్యంత దారుణ, జుగుప్సాకర పరిస్థితులు నేడు నెలకొంటున్నాయి. వైద్యసేవలు విస్తృతం చేశామని చెప్పుకుంటున్న ఏపీ సర్కారు.. ప్రసవ సమయంలో మృతి చెందుతున్న తల్లుల సంఖ్యను ఏమాత్రం తగ్గించలేకపోతోంది.
ఒక్క ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్‌లో 577 మంది తల్లులు మృతి చెందినట్లు గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి. వీరిలో అధికశాతం పేదవారే కావడం, అది కూడా గిరిజన ఏజెన్సీలైన రంపచోడవరం, పాడేరు ప్రాంతాల్లో వైద్యసేవలు సరిగా అందక తల్లులు మృతి చెందుతుండటం కలచివేసే అంశం. కొన్ని జిల్లాల్లో లక్షకు 120 మంది తల్లులు ప్రసవ సమయంలోనే మృత్యువాత పడుతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. పొరుగున ఉన్న తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో తల్లుల మరణాలు (మథర్ మోర్టాలిటీ రేటు-ఎంఎంఆర్) భారీ సంఖ్యలో తగ్గించగలిగారు.
కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య ఏ మాత్రం తగ్గక పోవడం భయాందోళన కలిగించే అంశం. మాతా శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు పేరిట ఏటా జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి వందల కోట్లు వెచ్చిస్తున్నా ఫలితం శూన్యం. గర్భస్థ శిశువైద్య పరీక్షలు సరిగా జరగకపోవడం, సిజేరియన్ ప్రసవాలు ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు పేర్కొంటున్నారు.
విశాఖ జిల్లాల్లో అత్యధిక మరణాలు..
రాష్ట్రంలో గతేడాది అత్యధిక మాతృ మరణాలు విశాఖపట్నం జిల్లాలో సంభవించడం గమనార్హం. జిల్లాలో ఏడాదిలో 55 వేల ప్రసవాలు జరిగితే 66 మంది తల్లులు మరణించారు. ఈ ప్రకారం లక్షకు 120 మంది మృతి చెందినట్టు లెక్క. ఆ తర్వాత కరువు జిల్లా అయిన అనంతపురంలో 58 వేల ప్రసవాలకు 58 మంది తల్లులు మృతి చెందారు. ఇవి కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుర్తించినవి మాత్రమే. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో లెక్కేలేదు. 2014-15 సంవత్సరానికి 577 మంది తల్లులు ప్రసవ సమయంలో మృతిచెందగా, 2015-16లోనూ అదేస్థాయిలో 577 మంది చనిపోయారు.
నిపుణులు చెబుతున్న కారణాలివే..
►గర్భం దాల్చినప్పటి నుంచే గర్భస్థ శిశు పరీక్షలు సరిగా జరగకపోవడం
► ఐరన్, ఫోలిక్ సంబంధించిన లోపాలు చాలామంది తల్లుల్లో ఉన్నట్టు గుర్తించకపోవడం ్హ అధిక రక్తపోటున్న మహిళలకు సరైన వైద్యం అందకపోవడం
►సుఖ ప్రసవానికి వైద్యులు విముఖత వ్యక్తం చేస్తూ సిజేరియన్ చేయడం
►సిజేరియన్ రెండోసారి సరిగా చెయ్యకపోతే ప్రాణాపాయం జరుగుతుండటం ్హ యాంటీనేటల్ చెకప్స్ జరగక తల్లుల గర్భస్థ పిండ వృద్ధిని అంచనా వేయలేకపోవడం ్హ హైరిస్క్ ప్రెగ్నెన్సీతో ఆస్పత్రులకు రాగానే సర్కారీ ఆస్పత్రుల్లో చేతులెత్తేయడం