maternal mortality
-
ఏపీ వైద్య శాఖ కృషి.. హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: హైరిస్క్ ప్రెగ్నెన్సీ అనేది మాతృ మరణాలకు ప్రధాన కారణం. రక్తహీనత, చిన్న వయసులో గర్భం దాల్చడం, 2 లేక 3 అబార్షన్ల అనంతరం గర్భం దాల్చడం, ఎక్కువ కాన్పులు, అధిక బీపీ, గుండె, కిడ్నీ జబ్బులు, ఇతర సమస్యలతో గర్భం దాల్చిన మహిళలను హైరిస్క్‌గా పరిగణిస్తారు. వీరికి ప్రసవం సమయంలో ఇతర ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో ప్రసవానికి ముందే వీరిని పెద్దాస్పత్రులకు తరలించడం ద్వారా ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు వైద్య శాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని హైరిస్క్ గర్భిణిలను డెలివరీ డేట్‌కు సుమారు వారం రోజుల ముందే సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, బోధనాస్పత్రులకు తరలించే కార్యక్రమాన్ని గత నెలలో ప్రారంభించారు. ఇందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. గత నెల 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు 5,398 మందిని తరలించగా.. 4,678 మంది సురక్షితంగా ప్రసవించారు. వీరిలో 332 మంది సీహెచ్‌సీల్లో, 447 మంది ఏరియా, 535 మంది జిల్లా ఆస్పత్రుల్లో, 916 మంది బోధనాస్పత్రుల్లో, 147 మంది ఎంసీహెచ్ సెంటర్లలో, మిగిలిన వారు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ప్రసవం నిర్వహించారు. పక్కా ప్రణాళికతో తరలింపు ప్రసవానికి సిద్ధంగా ఉన్న హైరిస్క్ గర్భిణుల వివరాలను ఏఎన్ఎం యాప్ ద్వారా ఏఎన్ఎంలకు పంపుతున్నారు. ఈ క్రమంలో వారు స్థానిక పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్‌తో కలిసి తమ పరిధిలోని హైరిస్క్ గర్భిణులను ఏ ఆస్పత్రికి తరలించాలనే దానిపై ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఆ మేరకు ప్రసవానికి ముందే గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తారు. ఈ ప్రక్రియపై రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన మెటర్నల్ మానిటరింగ్ సెల్ నుంచి పర్యవేక్షణ ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే నెల 21వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 8,384 మంది హైరిస్క్ గర్భిణులు ప్రసవానికి సిద్ధంగా ఉన్నారు. వీరి వివరాలను ఇప్పటికే ఏఎన్ఎం యాప్‌లో పొందుపరిచారు. తద్వారా వీరిలో ఇప్పటికే 592 మంది గర్భిణులను పెద్దాస్పత్రులకు తరలించారు. మరో 7,792 మందిని ఆస్పత్రులకు తరలించాల్సి ఉంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఏటా 8 లక్షల మందికిపైగా గర్భిణులు ఆర్సీహెచ్ పోర్టల్‌లో రిజిస్టర్ అవుతుంటారు. వీరిలో 10 శాతం మంది హైరిస్క్‌లో ఉంటున్నారు. ఈ లెక్కన నెలకు 5 వేల వరకు హైరిస్క్ గర్భిణుల ప్రసవాలు జరుగుతుంటాయి. -
ప్రసూతి మరణాలపై విచారణ
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట ప్రాంతీయ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన ప్రసూతి మరణాలపై ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, పేట్లబురుజు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాలతిలతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. అసలేం జరిగిందంటే ... నాగర్ కర్నూల్ జిల్లా వెల్లండ మండలం చెదుమ పల్లికి చెందిన సిరివెన్నెల (23), హైదరాబాద్ పూసలబస్తీకి చెందిన శివాని (24) మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వారం కిందట సిజేరియన్ చేయించుకున్నారు. అనంతరం వారి ఆరోగ్యం విషమించడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు 12వ తేదీన, మరొకరు 13వ తేదీన మరణించారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి తీరును నిరసిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాలింతల మృతికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లే కారణమన్న వాదనలు వినిపించాయి. పోస్ట్‌మార్టం రిపోర్టులో కూడా ఇన్ఫెక్షనే కారణమని తేలినట్లు సమాచారం. ఇందుకు ఆసుపత్రిలో పరిశుభ్రత లోపమే ప్రధాన కారణమని గుర్తించారు. కాగా, ఈ ఘటనలకు ముందు సిజేరియన్ చేయించుకున్న మరో 18 మందిని నిమ్స్ అత్యవసర విభాగానికి తరలించారు. అందులో ఇద్దరు బాలింతల కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకడంతో వారికి డయాలసిస్ చేశారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని, అధికార వర్గాలు వెల్లడించాయి. కొందరిని డిశ్చార్జి కూడా చేశామని చెబుతున్నారు. అధిక మోతాదు యాంటీబయోటిక్స్ వాడారా? బాలింతలకు అధిక మోతాదు యాంటీబయోటిక్స్ వాడటం వల్లే ఇన్ఫెక్షన్కు దారితీసిందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించిన పరికరాలను స్టెరిలైజేషన్ చేయడంలో కొంత నిర్లక్ష్యం ఉన్నట్లు కూడా చెబుతున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. గత ఆగస్టులో ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు మహిళలు మరణించిన తర్వాత కూడా ఇటువంటి సంఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇబ్రహీంపట్నం మరణాల తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆసుపత్రి ఇన్ఫెక్షన్ నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయిందనడానికి మలక్‌పేట సంఘటన నిదర్శనంగా చెబుతున్నారు. -
ఇది ముందడుగే కానీ...
మహిళా ఆరోగ్య రంగంలో ఒక శుభవార్త. మన దేశంలో ప్రసూతి మరణాల రేటు గతంతో పోలిస్తే తగ్గింది. భారత రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీఐ) ప్రత్యేక బులెటిన్ ఈ మంచి వార్తను మోసుకొచ్చింది. ప్రసూతి మరణాల రేటును లక్షకు వంద లోపునకు తగ్గించాలంటూ జాతీయ ఆరోగ్య విధానం (ఎన్హెచ్పీ)లో పెట్టుకున్న లక్ష్యాన్ని భారత్ అందుకుంది. తాజా ఘనతలో కేరళ, తెలంగాణ, ఏపీ సహా పలు దక్షిణాది రాష్ట్రాలదే కీలక పాత్ర. 2014–16 మధ్య ప్రతి లక్ష జననాల్లో 130 మంది చనిపోయేవారు. అది 2018–20కి వచ్చేసరికి లక్షకు 97 ప్రసూతి మరణాలకు తగ్గింది. ఈ ధోరణి కొనసాగితే, రానున్న 2030 కల్లా లక్షకు కేవలం 70 లోపలే ఉండాలన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని (ఎస్డీజీ) భారత్ అందుకుంటుంది. కేంద్రం, రాష్ట్రాల ఆరోగ్య పథకాల సానుకూల ఫలితమే ఇది. గర్భిణిగా ఉండగా కానీ, ప్రసవమైన 42 రోజుల లోపల కానీ తలెత్తిన ఆరోగ్య సమస్యల వల్ల 15–49 ఏళ్ళ మధ్యవయసు స్త్రీ మరణిస్తే దాన్ని ‘ప్రసూతి మరణం’ అంటారు. ఇక, ఒక నిర్ణీత కాల వ్యవధిలో ప్రతి లక్ష జననాలకూ ఎందరు ప్రసూతి మహిళలు మరణించారనే సంఖ్యను ‘ప్రసూతి మరణాల రేటు/ నిష్పత్తి’ (ఎంఎంఆర్) అని నిర్వచనం. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్సారెస్) నుంచి నిష్పాదించిన గణాంకాల్ని బట్టి మన దేశంలో ఎంఎంఆర్ నానాటికీ తగ్గుతోంది. ఆ క్రమాన్ని గమనిస్తే 2014–16లో 130 మరణాలు, 2015–17లో 122 మరణాలు, 2016–18లో 113 మరణాలు, 2017–19లో 103 మరణాలు, తాజాగా 2018–20లో 97 మరణాలే నమోదయ్యాయి. అంటే లక్షకు 70 లోపలే మరణాలుండాలనే ఐరాస లక్ష్యం దిశగా భారత్ అడుగులేస్తోందన్న మాట. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర గణనీయం. గతంలో 6 రాష్ట్రాలే ఎస్డీజీని సాధించగా, ఇప్పుడు వాటి సంఖ్య 8కి పెరిగింది. లక్షకు కేవలం 19 మరణాలతో కేరళ అగ్రస్థానంలో ఉండగా, ఆ తరువాత క్రమంగా మహారాష్ట్ర (33), తెలంగాణ (43), ఆంధ్ర ప్రదేశ్ (45), తమిళనాడు (54), జార్ఖండ్ (56), గుజరాత్ (57), కర్ణాటక (69) నిలిచి, లక్ష్య సాధనలో గణుతికెక్కాయి. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద నాణ్యమైన మాతా శిశు ఆరోగ్య సేవలను అందరికీ అందించాలనీ, తద్వారా నివారించదగ్గ ప్రసూతి మరణాలను వీలైనంత తగ్గించాలనీ మన దేశం చేసిన నిరంతర కృషి మెచ్చదగినది. ఆరోగ్య సేవలను సమకూర్చడంపై, ముఖ్యంగా ప్రసూతి ఆరోగ్యకార్యక్రమాల అమలుపై కేంద్రం, రాష్ట్రాల శ్రద్ధ ఈ ఫలితాలకు కారణం. నిజానికి, ప్రసూతి ఆరోగ్యమనేది స్త్రీల స్వస్థత, పోషకాహారం, గర్భనిరోధకాల అందుబాటు సహా అనేక అనుబంధ రంగాల్లోని పురోగతిని తెలిపే కీలకమైన సూచిక. ఎంఎంఆర్ 100 లోపునకు తగ్గడమనేది దేశంలో ఇదే తొలిసారి. పైగా, 2014–16తో పోలిస్తే ఎంఎంఆర్ దాదాపు 25 శాతం తగ్గడం చెప్పుకోదగ్గ విషయం. అయితే, కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన ఈ డేటాను మరింత లోతుగా పరిశీలిస్తే, మెరుగుపడాల్సిన అనేక అంశాలు కనిపిస్తాయి. ఎంఎంఆర్ జాతీయ సగటు తగ్గినప్పటికీ, ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లో పలు పరస్పర వైరుద్ధ్యాలు చోటుచేసుకున్నాయి. కేరళలో ఎంఎంఆర్ ఏకంగా 19కి పడిపోతే, అస్సామ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లాంటి చోట్ల మాత్రం ప్రసూతి మరణాలు 160కి పైన ఉండడమే దీనికి నిదర్శనం. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి నెలకొంది. నిజానికి, దేశాభివృద్ధి ఈ ప్రాంతాలపైనే ఆధారపడ్డది. అనేక ఇతర లోటుపాట్లూ లేకపోలేదు. వివిధ రాష్ట్రాల మధ్యనే కాక, వివిధ జిల్లాల్లో, అలాగే వివిధ జనాభా వర్గాల మధ్యనా అంతరాలున్నట్టు అర్థమవుతోంది. రాష్ట్ర సర్కార్ల శ్రమతో దక్షిణాది రాష్ట్రాల్లో కొన్నేళ్ళుగా ప్రసూతి మరణాలు తగ్గిన మాట వాస్తవమే. కానీ, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో గర్భిణులపై హింసాఘటనలు అత్యధిక సంఖ్యలో నమోదు అవుతున్న చేదునిజాన్ని విస్మరించలేం. అంటే, దేశం మొత్తాన్నీ చూస్తే మన పురోగతి ఇప్పటికీ అతుకుల బొంతే. అసమానతలు అనేకం. ఆ మాటకొస్తే, ఈ ఏడాది జూలైలో ప్రసిద్ధ పీఎల్ఓఎస్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం సైతం మన లెక్కల్లోని లోటుపాట్లను ప్రస్తావించింది. దేశంలోని 70 శాతం (640 జిల్లాల్లో 448) జిల్లాల్లో ఐరాస ఎస్డీజీకి భిన్నంగా ప్రసూతి మరణాలెక్కువని ఎత్తిచూపింది. మునుపటితో పోలిస్తే కొంత మెరుగుపడ్డా, స్వాతంత్య్ర అమృతోత్సవ వేళలోనూ ఈశాన్య రాష్ట్రాల సహా అనేక జిల్లాల్లో ప్రసూతి మరణాల రేటు ఎందుకు ఎక్కువగా ఉందో పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. డబల్ ఇంజన్ సర్కార్ అని గొప్పలు చెబుతున్న రాష్ట్రాలే అధిక మరణాల అపకీర్తిలో ముందుండడం గమనార్హం. మార్పులతో ‘జననీ శిశు సురక్షా కార్యక్రమ్’, ‘జననీ సురక్షా యోజన’ లాంటి ప్రభుత్వ పథకాల స్థాయి పెంచడం బానే ఉంది. కానీ, స్త్రీల సమగ్ర ఆరోగ్య రక్షణను మెరుగుపరచడమెలాగో చూడాలి. గర్భిణుల్లో రక్తహీనత మునుపటికన్నా పెరిగింది. గర్భిణుల్లో వైద్య చెకప్‌లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అందనివారే నేటికీ అనేకం. అందుకే, కీలక ఆరోగ్య డేటాను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. దేశం మొత్తం ఎస్డీజీని చేరేలా తక్షణచర్యలు చేపట్టాలి. వీటిని కేవలం అంకెలుగా భావిస్తే పొరపాటు. ఆ అంకెల వెనకున్నది తల్లులు, అప్పుడే పుట్టిన పిల్లలు, యావత్ కుటుంబాలనే స్పృహ అవసరం. ఆ వైఖరితో నిశితంగా వ్యవహరిస్తే మంచిది. అనేక ప్రాణాలు నిలుస్తాయి. ఆరోగ్య భారతావని గెలుస్తుంది. ఆ కృషిలో ప్రసూతి మరణాల రేటు పదిలోపే ఉండేలా చేసిన బెలారస్, పోలెండ్, బ్రిటన్లే మనకు ఆదర్శం. -
Telangana: గణనీయంగా తగ్గిన మాతృ మరణాలు..
సాక్షి, హైదరాబాద్: మాతా, శిశు సంరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మాతృ మరణాల రేటు (ఎంఎంఆర్) గణనీయంగా తగ్గటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్) ప్రత్యేక బులిటెన్ 2018–20 ప్రకారం, రాష్ట్రంలో ఎంఎంఆర్ 43కు తగ్గింది. 2017–19లో ఇది 56 ఉండగా, వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల ఎంఎంఆర్ ఏకంగా 13 పాయింట్లు తగ్గింది. తద్వారా అతి తక్కువ మరణాలతో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. కేరళ, మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జాతీయ సగటు 97గా నమోదైంది. అంటే తెలంగాణ కన్నా రెట్టింపు అన్నమాట. 2017–19లోనూ తక్కువ ఎంఎంఆర్‌లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రం ఏర్పడేనాటికి ఎంఎంఆర్ 92గా ఉండేది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల క్రమంగా తగ్గుతూ ఇప్పుడు 43కు చేరింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 49 పాయింట్లు తగ్గింది. జాతీయ సగటు 2014లో 130గా ఉండగా... ఇప్పుడు 97కు తగ్గింది. కేవలం 33 పాయింట్లు మాత్రమే తగ్గుదల నమోదైంది. ►అత్యధిక మాతృమరణాలు నమోదవుతున్న టాప్ మూడు రాష్ట్రాల్లో అస్సాం 195, మధ్యప్రదేశ్ 173, ఉత్తర్ ప్రదేశ్ 167గా నమోదయ్యాయి. 2017–19 నుంచి 2018–20 మధ్య ఆయా రాష్ట్రాల్లో ఎంఎంఆర్ తగ్గకపోగా పెరిగింది. మధ్యప్రదేశ్‌లో 10 పాయింట్లు, హరియాణాల్లో 14 పెరగగా, ఉత్తర్ ప్రదేశ్‌లో ఎంఎంఆర్ తగ్గుదలలో ఎలాంటి పురోగతి నమోదు కాలేదు. ఐరాస ప్రకారం 70 కంటే తక్కువ లక్ష్యం... ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ‘మాతృ మరణం అనేది ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు లేదా గర్భం ముగిసిన 42 రోజులలోపు సంబంధిత కారణాల వల్ల జరుగుతుంది. 15–49 ఏళ్ల వయస్సుగల సంబంధిత మహిళల్లో లక్షకు జరిగే మరణాలను లెక్కలోకి తీసుకుంటారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) లక్ష్యం లక్షకు 70 కంటే తక్కువ చేయాలని నిర్ణయించగా, తెలంగాణ ఎప్పుడో ఆ లక్ష్యానికి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కేసీఆర్ కిట్, మాతా శిశు సంరక్షణ చర్యల్లో భాగంగానే ఎంఎంఆర్ తగ్గింది. కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా ప్రతి ఒక్క గర్బిణిని నమోదు చేసుకోవడం, ప్రతి నెలా చెకప్స్ చేయించడం, ఉచితంగా అమ్మ ఒడి వాహన సేవలు అందించడం వల్ల గర్భిణులకు నాణ్యమైన సేవలు అన్ని దశల్లో అందుతున్నాయి. అరికట్టగలిగిన మాతృ మరణాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంలో భాగంగా మిడ్ వైఫరీ వ్యవస్థను ప్రభుత్వం ప్రారంభించింది. ఎంపిక చేసిన నర్సులకు శిక్షణ ఇచ్చి వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు 207 మంది మిడ్ వైఫరీ నర్సులు సేవలు అందిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ కృషి అభినందనీయం: మంత్రి హరీశ్‌రావు ఎంఎంఆర్ 56 నుంచి 43కు తగ్గటం గొప్ప విషయం. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలతో పాటు, ఇతర సంరక్షణ చర్యలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రంలో 300 అమ్మ ఒడి వాహనాలు ఉండగా, ఈ ఏడాది ఇప్పటివరకు 12.61 లక్షల మంది గర్బిణులు లబ్ధి పొందారు. మొత్తం కేసీఆర్ కిట్ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.1,525 కోట్లు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కృషి అభినందనీయం. ఎంఎంఆర్ తగ్గుదలలో డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు వెనుకబడ్డాయి. అత్యధిక మాతృ మరణాలు నమోదవుతున్న టాప్ మూడు రాష్ట్రాలు అస్సాం, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాలే. -
తగ్గిన ప్రసూతి మరణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్) తగ్గింది. రాష్ట్రంలో 2014–16 మధ్య ఎంఎంఆర్ 63 ఉండగా, 2017–19 నాటికి 56కు తగ్గినట్టు రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ బులెటిన్‌ను శుక్రవారం విడుదల చేసింది. దేశంలో ఎంఎంఆర్ 113 నుంచి 103కు తగ్గిందని నివేదికలో పేర్కొంది. కేరళలో అత్యల్పంగా ఎంఎంఆర్ 30 నమోదు కాగా, మహారాష్ట్రలో 38, తెలంగాణలో 56 నమోదైందని తెలిపింది. నివేదికపై మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి 92గా ఉన్న ఎంఎంఆర్‌ను ఇప్పుడు 56కు తగ్గించగలిగామని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ పథకం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రతి లక్షకు లెక్క..: 15–49 సంవత్సరాల వయసులో ప్రతి లక్ష మంది ప్రసూతి మహిళల్లో సంభవించే మరణాలను ఎంఎంఆర్‌గా లెక్కిస్తారు. పునరుత్పత్తి వయసులో ఉన్న చాలా మంది స్త్రీలు గర్భధారణ సమయంలో లేదా ప్రసవ సమయంలో లేదా గర్భస్రావం తర్వాత వివిధ అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం గర్భవతిగా ఉన్నప్పుడు లేదా గర్భం దాల్చిన 42 రోజుల్లోపు, గర్భం లేదా దానికి సంబంధించిన ఏదైనా కారణంతో మరణిస్తారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ లక్ష్యం.. లక్షకు 70 కంటే తక్కువకు ఎంఎంఆర్‌ను తగ్గించడం. -
కొండకోనల్లో ప్రవాసిని వైద్యం
పోషకాహార లేమి, ప్రసూతి మరణాలు ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతుంటాయి. ఒరిస్సాలోని కంధమాల్ జిల్లాలో గిరిజన తండాలు ఎక్కువ. అరకొరగా కూడా అందని వైద్యసేవలు. రోడ్లు, రవాణా, ఫోన్ సదుపాయాలు లేక అటవీ ప్రజానీకం నిత్యం అవస్థలను ఎదుర్కొంటూనే ఉంది. 33 ఏళ్ల ప్రవాసినీ భట్నాగర్ ఈ పరిస్థితిని గుర్తించి, అవసరమైన మెడిసిన్స్ పట్టుకొని కొండకోనల్లో ఉన్న గిరిజనులకు అందజేస్తోంది. ప్రసూతి మరణాల నివారణకు కృషి చేస్తోంది. ఆరోగ్య అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తోంది. మూడేళ్లుగా ఆత్మశక్తి ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రవాసిని మారుమూల గ్రామాల్లోని దాదాపు 21 వేల మంది గిరిజనుల్లో ఆరోగ్య స్పృహ కల్పిస్తోంది. గిరిజన గ్రామాలు కొండకోనల్లో ఉంటాయి. వాటికి చేరుకోవాలంటే కాలువలు, కొండగట్లు, రాళ్లూ రప్పలు, ముళ్ల పొదలు.. దాటుకుంటూ ప్రయాణించాలి. అలా ప్రవాసిని రోజూ కొన్ని మైళ్ల దూరం నడుస్తూనే గిరిజనులను కలుసుకుంటుంది. ఎలాంటి రవాణా సదుపాయాలు లేని ఈ ప్రాంతాల్లో పనిచేయడం తనకు కష్టమని ప్రవాసినికి తెలుసు. కానీ, వీటి గురించి పట్టించుకోలేదు ప్రవాసిని. గిరిజనులు నేటికీ మొరటైన సాంప్రదాయ వైద్యపద్ధతులనే అనుసరిస్తున్నారు. ఆరోగ్య వృద్ధి లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తన సేవలను విస్తరించింది. గిరిజన, ఇతర అట్టడుగు వర్గాలకు కరోనా మహమ్మారి మరిన్ని సమస్యలను సృష్టించింది. దీంతో ప్రవాసిని పాత్ర గతంలో కంటే మరింత ముఖ్యమైంది. ఆరోగ్య పథకాల పట్ల అవగాహన గిరిజన ప్రాంతాల పరిస్థితి గురించి ప్రవాసిని వివరిస్తూ –‘పోషకాహార లోపం వారికి అన్నిరకాల ఆరోగ్యసమస్యలకు మూలమైంది. ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం వల్ల తల్లీ పిల్లల మరణాల రేటు పెంచుతోంద’ని వివరిస్తుంది. 2018 లో లాభాపేక్షలేని ఆత్మశక్తి ట్రస్టు ద్వారా తన సేవలను అందించడానికి సిద్ధపడింది ప్రవాసిని. మూడునెలలు ఆ సంస్థలో పనిచేసిన తర్వాత పోషకాహారం లేని మారుమూల గ్రామాల ప్రజలకు చేరువకావడానికి ఆసక్తి చూపించింది. అప్పటి నుండి ‘హెల్త్ యానిమేటర్‌గా’గా పనిచేస్తోంది. శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తగా గిరిజనులకు కావల్సిన ఔషధాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో గిరిజనులు భాగం పంచుకునే లా చేస్తోంది. కష్టపడలేక మధ్యలోనే సేవలను ఆపేసే కొందరిలా కాకుండా ఇష్టంతో తన పనిని కొనసాగిస్తోంది. ప్రతి రోజూ 2–3 గ్రామాలను సందర్శించి ఇల్లిల్లూ తిరిగి ఆరోగ్య సంరక్షణ చేపడుతోంది. తుడిబంధ బ్లాకులో 76 మంది పురుషులు, 37 మంది మహిళలను గ్రామ కార్యకర్తలు గా ఆరోగ్య పరిరక్షకులుగా తయారు చేసింది. కష్టం తీరింది.. ‘ఈ గిరిజన ప్రాంతాల మహిళలు, బాలికలు తమ ఆరోగ్య సమస్యలను పంచుకోవడానికి వెనకాడతారు. కానీ, నాతో ఎలాంటి జంకు లేకుండా పంచుకుంటారు. దీని వల్ల వారి అవసరాలను తెలుసుకోవడానికి, సరైన మార్గం చూపడానికి నాకు వీలవుతుంది’ అని చెబుతుంది ప్రవాసిని. ‘గతంలో జ్వరం వచ్చి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లాలంటే పదేసి కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. దీనికి 200 నుంచి 500 రూపాయలు ఖర్చు కూడా అయ్యేది. ఎంతో కష్టపడి ఆసుపత్రి కి వెళ్లినా అక్కడ సిబ్బంది ఉండేవాళ్లు కాదు. ఇప్పుడు ప్రవాసిని ద్వారా మాకు ఆ కష్టం తీరింది. చిన్న చిన్న జబ్బులకు మందులు అందుబాటులో ఉండటంతో త్వరగా కోలుకోగలుగుతున్నాం’ అని గుమా గ్రామ పంచాయితీ సర్పంచ్ సుస్మిత వివరిస్తారు. ఈ ప్రాంతాల్లో 102, 108 అంబులెన్స్ సర్వీసులు అందుబాటులో లేవు. అందుకే జబ్బులు ముదరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా వారిలో అవగాహన కల్పించడంతోపాటు బాల్య వివాహాలు, రుతు శుభ్రతకు సంబంధించిన అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తోంది. పోషకాహారం ఆవశ్యకత గురించి చెబుతూ పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రవాసిని లాంటి మహిళలు ఈ సమాజానికి ఎంతో మంది అవసరం. ఇలాంటి వారి వల్లే గ్రామాల అభివృద్ధి మెరుగుపడుతుంది. ఆదివాసీలతో ప్రవాసినీ భట్నాగర్ -
అమ్మ పదిలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మాతృత్వపు మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్) గణనీయంగా తగ్గింది. దేశంలో అత్యంత తక్కువ ఎంఎంఆర్ నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. 2016–18 ఏళ్ల మధ్య దేశంలో నమోదైన ఎంఎంఆర్పై కేంద్ర ప్రభుత్వం గురువారం స్పెషల్ బులెటిన్ విడుదల చేసింది. జాతీయస్థాయి సగటు ఎంఎంఆర్ లక్షకు 113గా ఉండగా అందులో అత్యంత తక్కువ ఎంఎంఆర్ నమోదైన రాష్ట్రం కేరళ (43). ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (46), తమిళనాడు (60), తెలంగాణ (63) నిలిచాయి. దక్షిణాది రాష్ట్రాల్లో సగటు ఎంఎంఆర్ 67గా నిలిచింది. అస్సాంలో ఎంఎంఆర్ అత్యంత ఎక్కువగా 215గా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గతం కంటే తక్కువ... రాష్ట్రంలో ఎంఎంఆర్ క్రమంగా తక్కువగా నమోదవుతోంది. 2015–17 మధ్య ఎంఎంఆర్ 76గా ఉంటే ఇప్పుడు 63కు తగ్గింది. తెలంగాణలో 2017లో ప్రారంభించిన కేసీఆర్ కిట్‌తో ఎంఎంఆర్ తగ్గిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ కిట్ ద్వారా గర్భిణులకు ప్రభుత్వం రూ. 12 వేల నుంచి రూ. 13 వేల వరకు ఇస్తుండటం తెలిసిందే. అలాగే తల్లీబిడ్డల సంరక్షణకు వివిధ రకాల వస్తువులతో కూడిన కిట్‌ను అందిస్తోంది. అందువల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. అలాగే గతంలో ఇళ్ల వద్ద జరిగే ప్రసవాలు కూడా తగ్గిపోయాయి. దీంతో ఎంఎంఆర్ తగ్గింది. కేసీఆర్ కిట్ ప్రారంభానికి ముందు అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హయాంలో ప్రసూతి దవాఖానాల్లో ప్రారంభించిన లేబర్ రూంలు, ఇతర మౌలిక సదుపాయాల వల్ల కూడా ఎంఎంఆర్ తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఐరాస లక్ష్యాన్ని చేరుకున్నాం 15–49 ఏళ్ల వయసులోని మాతృత్వపు మహిళల్లో జరిగే మరణాలను ఎంఎంఆర్ కింద లెక్కిస్తారు. గర్భధారణ, ప్రసవం లేదా గర్భస్రావం సమయంలో జరిగే మరణాలను ఎంఎంఆర్‌గా పరిగణిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ‘మాతృత్వపు మరణం అంటే గర్భవతిగా ఉన్నప్పుడు లేదా ఆ తర్వాత 42 రోజుల్లోపు ఏదైనా కారణంతో చనిపోవడం’. ఐక్యరాజ్య సమితి (ఐరాస) నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) ప్రకారం ఎంఎంఆర్‌ను 70కన్నా తగ్గించడంకాగా దీన్ని మొదటిసారి రాష్ట్రం సాధించడం విశేషమని అధికారులు పేర్కొన్నారు. -
పెరుగుతున్న మాతృత్వ మరణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మాతృత్వ మరణాలు పెరుగుతున్నాయి. 10 జిల్లాల్లో గతేడాది కంటే ఈసారి అధికంగా నమోదయ్యాయి. 15 జిల్లాల్లో 10 కంటే ఎక్కువ మరణాలు చోటుచేసుకున్నాయి. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ యోగితా రాణా సోమవారం సమీక్షించారు. మరణాలకు గల కారణాలు, జిల్లాల వారీగా రూపొందించిన నివేదికపై చర్చించారు. 2018–19లో రాష్ట్ర వ్యాప్తంగా 389 మాతృత్వ మరణాలు నమోదవగా, 2019–2020 (డిసెంబర్ నాటికి) 323 మరణాలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, మెదక్, వికారా బాద్, వనపర్తి, సూర్యాపేట్, గద్వాల్, ములుగు, సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల్లో గతేడాది కంటే ఎక్కువ మంది చనిపోయారు. -
తల్లుల మరణాల నియంత్రణ శూన్యం
సాక్షి, అమరావతి: ప్రసవం లేదా గర్భిణీగా ఉన్న సమయంలో తల్లుల మరణాలు దేశంలోని చాలా రాష్ట్రాల్లో తగ్గగా.. ఆంధ్రప్రదేశ్‌లో 2014–17 మధ్య కాలంలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే (ఎస్ఆర్ఎస్) విడుదల చేసిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా మాతా శిశు మరణాల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని, అందుకు కేంద్రం సహకరిస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు పిలుపునిచ్చినా అప్పటి చంద్రబాబు సర్కారు పెద్దగా స్పందించకపోవడాన్ని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2015–17 మధ్యకాలంలో వివిధ రాష్ట్రాల్లో మాతా మరణాల నియంత్రణ (మెటర్నల్ మోర్టాలిటీ రేట్–ఎంఎంఆర్)పై ఎస్ఆర్ఎస్ బులెటిన్ రూపొందించింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 2014 –16 మధ్యకాలానికి ఇచ్చిన బులెటిన్‌కూ.. 2015–17 కాలానికి ఇచ్చిన బులెటిన్‌కూ మరణాల్ని నియంత్రించడంలో ఎలాంటి వృద్ధి కనిపించలేదని వెల్లడించింది. 2014–16లో సగటున లక్ష మందికి 74 మంది మృతి చెందగా.. 2015–17 కాలానికి అదే రేటు కొనసాగింది. చాలా రాష్ట్రాల్లో 2014–16, 2015–17 మధ్య కాలానికి విడుదల చేసిన సూచీల్లో గణనీయమైన వృద్ధి కనిపించింది. నియంత్రించిన మిగతా దక్షిణాది రాష్ట్రాలు 2015–17 మధ్య మాతా మరణాలపై ఈనెల 7న ఎస్ఆర్ఎస్ బులెటిన్ విడుదల చేసింది. పక్క రాష్ట్రం తెలంగాణలో 2014–16లో ప్రతి లక్ష మందికి 81 మరణాలు నమోదు కాగా.. 2015–17 కాలానికి ఆ సంఖ్య 76కు తగ్గింది. కర్ణాటకలో 108 నుంచి 97కి నియంత్రించగా.. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఎప్పటిలానే తాజా సర్వేలోనూ మరింతగా మరణాల నియంత్రణలో ముందంజలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా సగటున ప్రతి లక్ష మందికి 130 మరణాలు చోసుచేసుకుంటుండగా.. ఆ సంఖ్య 2015–17 సర్వేలో 122కు తగ్గింది. మన రాష్ట్రంలో ఎలాంటి తగ్గుదల లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. జాతీయ మిషన్, రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేసినా మార్పు రాలేదని, దీనిపై గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. -
మంత్రుల కోసం వైద్యుల బిజీ..
- ప్రసవం చేసిన నర్సులు.. తీవ్ర రక్తస్రావమై బాలింత మృతి - నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రిలో మంత్రుల పర్యటనకు ముందు ఘటన నర్సాపూర్ రూరల్: అది మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ప్రభుత్వాస్పత్రి.. 30 పడకలుగా ఉన్న ఆస్పత్రిని 100పడకల వరకు స్థాయి పెంచినందున సోమవారం ఉదయం మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. వైద్యులంతా ఆ కార్యక్రమంలోనే బిజీగా ఉన్నారు. కాగా, అంతకుముందు రోజు ఆదివారం రాత్రి నర్సాపూర్‌కు చెందిన గర్భిణీ బుతల్ ఫాతిమా (28)ను ప్రసవం కోసం ఆమె భర్త సమీర్ షేక్ ఇదే ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం ఉదయం వైద్యులు అందుబాటులో లేకున్నా.. నర్సులు ప్రసవం చేశారు. ఫాతిమా ఆడబిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో గంట తరువాత ఓ నర్సు ఫాతిమాకు ఇంజక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమెకు తీవ్ర రక్తస్రావం ప్రారంభమైంది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు కూడా చేతులెత్తేశారు. ఇంతలోనే ఫాతిమా ప్రాణాలు విడిచింది. కాగా, వైద్యులంతా మంత్రుల పర్యటనలో బిజీగా ఉన్నారనీ, వారంతా తొమ్మిది గంటలకు వస్తారని నర్సులు, సిబ్బంది చెబుతూ నిర్లక్ష్యం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మంత్రులు వస్తున్నారని గర్భిణీకి వైద్యం చేయని వైద్యులు నర్సాపూర్: హత్నూర మండలంలోని మంగాపూర్‌కు చెందిన గర్భిణీ అనితకు సోమవారం ఇంటివద్ద పురిటి నొప్పులు రావడంతో తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెను చూసి మంత్రులు వస్తున్నారని, వారు వెళ్లిపోయాక వైద్యం చేస్తామని చెప్పారు. దీంతో చేసేదేమీలేక అనిత తల్లిదండ్రులు ఆమెను ఓ చెట్టుకింద కూర్చోపెట్టారు. ఈ దృశ్యం విలేకరుల కంటపడటంతో ఫొటోలు తీస్తుండగా.. ఆస్పత్రి సిబ్బంది చూసి ఆమెను లోపలికి రావాలని పిలిచారు. కాగా, ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రులు లక్ష్మారెడ్డి, హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ప్రసవాల కోసం ఇక్కడికే రావాలని సూచించారు. -
ప్రసూతి మరణాలపై హెచ్చార్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: ప్రసూతి ఆస్పత్రుల్లో మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా నేతలు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. అంతకుముందు గాంధీభవన్ నుంచి మానవ హక్కుల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రసూతి ఆస్పత్రుల్లో మరణాలు ప్రభుత్వ హత్యలే అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, సునీత లక్ష్మారెడ్డి, ఆకుల లలిత, నేరేళ్ల శారద తదితరులు పాల్గొన్నారు. -
‘అమ్మ’ ఆరోగ్యంపై అలక్ష్యమేనా..?
⇒ మొన్న నిలోఫర్, నిన్న గాంధీలో వరుస సంఘటనలు ⇒ నిలోఫర్‌లో మరణాలపై ఇప్పటికీ రాని కలెక్టర్ నివేదిక సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న బాలిం తల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిలోఫర్‌లో ఐదుగురు బాలింతల మృతి మరవకముందే... తాజాగా గాంధీ ఆస్పత్రిలో మరో ఇద్దరు మరణించడంపై విమర్శలు వినిపిస్తున్నా యి. ఈ ఘటనలు ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యమేనని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిలోఫర్ ఘటన ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యమేనని వైద్య ఆరోగ్యశాఖ అధికారులే చెప్పారు. నిలోఫర్ ఘటనపై కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించారు. ఇన్నేళ్లయినా కలెక్టర్ నివేదికను సమర్పించకపోవడంపై అనుమానాలు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికీ నివేదిక ఇవ్వకుం డా, బాధ్యులను ఆస్పత్రిలోనే కొనసాగిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అక్కడి ఇద్దరు అధికారులను సరెండర్ చేసి వదిలేయడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలపై సర్కారు సరైన చర్యలు తీసుకోకపోవడంతో అసలు నిర్లక్ష్యపు మరణాలకు బ్రేక్ పడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యుల పై చర్యలు తీసుకోవడానికి వైద్య ఆరోగ్యశాఖ జంకుతోందన్న విమర్శలూ ఉన్నాయి. బాధ్యులైన అధికారులు, వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటే ఉద్యోగులనుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆందోళన వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో ఉంది. మరణాలు సహజమన్న సర్కారు..! రాష్ట్రంలో ఏడాదికి 6.50 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. కేంద్రం లెక్కల ప్రకారం రాష్ట్రం లో ఏడాదికి 650 మంది తల్లులు చనిపోతున్నారని అంచనా. సాధారణంగా మారుమూల ప్రాంతాల్లో వైద్య వసతి లేకపోవడం వంటి కార ణాలతో తల్లుల మరణాలు సంభవి స్తుం టాయి. కానీ హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో కేవలం నిర్లక్ష్యంతో తల్లుల మరణాలు సంభవించడమేంటి? నిలోఫర్ çఘటనపై కలెక్టర్ నివేదికంటూ కాలయాపనకే వైద్య ఆరోగ్యశాఖ యత్నిస్తోందన్న చర్చ జరుగుతోంది. గతంలో సరోజిని కంటి ఆస్పత్రి ఘటననూ కాలయాపనతో మరుగునపడేశారంటున్నారు. ‘బాలింత ఎం దుకు చనిపోయిందో నిర్ధారించడం 51% సాధ్యం కాదు. ఫలానా కారణంగానే చనిపోయారని చెప్పడం అసాధ్యం ’అని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. సరోజిని, నిలోఫర్, గాంధీ ఆస్పత్రులన్నీ బోధనాసుపత్రులే. వాటన్నింటికీ ప్రధాన బాధ్యత వహించే వ్యక్తిపై ఇప్పటికీ చర్యలు లేకపోవడం గమనార్హం. ‘మేము ఎంతో చేయాలనే వచ్చాం. కానీ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనలో వైఫల్యం కారణంగానే ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితులకు వైద్యులెలా బాధ్యులవుతారు?’ అని ఒక వైద్యుడు వ్యాఖ్యానించారు. -
గాంధీ’లో ఇద్దరు బాలింతల మృతి!
⇒ గోప్యంగా ఉంచేందుకు ఆస్పత్రి వర్గాలు శతవిధాలా ప్రయత్నం ⇒ అధిక రక్తస్రావమే కారణమంటున్న వైద్యులు ⇒ వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆందోళన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో నిలోఫర్ ఘటన మరవక ముందే సికింద్రా బాద్‌లోని గాంధీ ఆస్పత్రిలోనూ మరణ మృదంగం మోగింది. 24 గంటల వ్యవధిలో ఇద్దరు బాలింతలు తనువు చాలించారు. బాలింతల మృతి విషయం బయటకు పొక్కకుండా ఆస్పత్రి వర్గాలు శతవిధాలా ప్రయత్నించాయి. చివరకు అధిక రక్తస్రావంతో బాలింతలు మృతి చెందినట్లు పేర్కొని, తర్వాత ఎవరూ మృతి చెందలేదని మాటమార్చి కేస్‌షీట్లు కనిపించడం లేదని, రేపు వివరాలు వెల్లడిస్తామని ప్రకటించాయి. కాగా, వైద్యుల నిర్లక్ష్యం పట్ల మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. కర్నాటకలోని బిజాపూర్ షోలాపూర్‌నాకాకు చెందిన రమీజా జబీన్ అనే గర్భిణీ ఈ నెల 18వ తేదీన గాంధీ ఆస్పత్రిలో చేరింది. ఈ నెల 20న వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించగా కొద్దిసేపటికే తీవ్ర రక్తస్రావం కావడంతో రమీజా జబీన్ మృతి చెందింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి (25) ప్రసవం కోసం కొద్దిరోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చేరింది. శస్త్రచికిత్స అనంతరం రక్రస్రావం తీవ్రమై మరణించింది. బయటకు పొక్కకుండా.... గాంధీ ఆస్పత్రి వర్గాలు బాలింతల మృతి వివరాలు బయటికి పొక్కకుండా తీవ్రంగా ప్రయత్నించడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్, గైనకాలజీ విభాగాధిపతి జేవీరెడ్డిలను‘సాక్షి’ వివరణ కోరగా దాటవేత ధోరణిని ప్రదర్శిం చారు. వివరాలివ్వాలంటూ గైనకాలజీ విభాగం మహిళా ప్రొఫెసర్‌కు పురమాయించి ముఖం చాటేశారు. బాలింతలు మృతి చెందిన విషయం వాస్తమేనని, మానవ తప్పిందంతో వారు చనిపోలేదని వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. రమీజాజబీన్‌కు గతంలో మూడుసార్లు సిజేరియన్ జరిగిందని, నాల్గవసారి విజయవంతంగా చేశామని, అనంతరం రక్తస్రావం జరగడంతో మృతి చెందిందంటూ చెప్పుకొచ్చారు. మరో బాలింత లక్ష్మి కడుపులో బిడ్డ అడ్డం తిరగడంతోపాటు ఉమ్మనీరు తక్కువగా ఉందని సర్జరీ చేసి బిడ్డను బయటకు తీశామని, తర్వాత ఆమె కూడా రక్తస్రావంతో మృతి చెందిందని పేర్కొన్నారు. మాటమార్చేశారు... గాంధీ ఆస్పత్రిలోని గైనకాలజీ విభాగంలో 20, 21 తేదీల్లో ఎటువంటి మరణాలు సంభవించలేదని గాంధీ ఆస్పత్రి వర్గాలు మాటమార్చాయి. సూపరింటెండెంట్ పేషీ ముందు బాలింతల మృతి వివరాల కోసం పాత్రికేయులు చాలా సమయం వేచిచూసినా ఫలితం లేకుండా పోయింది. డీఎంఈకి పూర్తి వివరాలు అందిస్తున్నామని అదే కాపీని రేపు మీడియాకు అందజేస్తామని చెప్పారు. ఆ తర్వాతా మాటమార్చి గైనకాలజీ విభాగంలో ఎటువంటి మరణాలు సంభవించలేదన్నారు. సంబంధిత కేస్‌షీట్లు కూడా కనిపించడం లేదని పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి బుధవారం వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
బాలింతల మరణాలపై త్రిసభ్య కమిటీ
నిలోఫర్‌లో విచారణకు ఆదేశించిన డీఎంఈ సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రిలో బాలింతల మరణాలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. వైద్య ఆరోగ్య మంత్రి ఆదేశాల మేరకు డీఎంఈ రమణి ఆస్పత్రికి చేరుకుని, బాలింతల మరణాలపై సమగ్ర విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఉస్మానియా డాక్టర్ భీంరావుసింగ్, గాంధీ ప్రొఫెసర్ డాక్టర్ రాణి, పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి చెందిన డాక్టర్ ప్రతిభతో కమిటీ ఏర్పాటైంది. ఈ బృందం సోమవారం నిలోఫర్ ఆస్పత్రిని సందర్శించి, సిజేరియన్‌లో వైద్యపరమైన నిర్లక్ష్యంపై ఆరా తీసింది. ప్రభుత్వానికి రెండు రోజుల్లో సమగ్ర నివవేదిక అందే అవకాశం ఉంది. నివేదిక అందిన వెంటనే చర్యలు... ఇదిలా ఉండగా డీఎంఈ రమణి.. సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్‌కుమార్ సహా ఆర్ఎంలు, ఇతర వైద్యులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బాలింతల మరణాలపై ఆరా తీశారు. ఈ సంద ర్భంగా ఆస్పత్రిలో బాలింతల మరణాలు చోటు చేసుకోవడం వాస్తవమేనని ఆమె అంగీకరించారు. గత నెల 28 నుంచి ఈ నెల మూడో తేదీ వరకు ఆస్పత్రిలో 44 సిజేరియన్లు చేయగా వీరిలో ఐదుగురు (రీనా, బుష్రబేగం, ఫరా ఫాతిమా, నజ్రత్, అనుష) బాలింతలు మృతి చెందారన్నారు. ఈ మరణాలపై విచారణ కొనసాగుతోందని, నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కొంత మంది వైద్యులు, పీజీ విద్యార్థులు.. సీఎస్ ఆర్‌ఎంఓపై డీఎంఈకి ఫిర్యాదు చేశారు. బంధువుల ఆందోళన.. ఆస్పత్రిలో సిజేరియన్ల కోసం మూడు ఆపరేషన్ థియేటర్లు ఉండగా, ఇప్పటికే రెండింటిని మూసివేశారు. అత్యవసర చికిత్సల కోసం తెరిచి ఉన్న ఆ ఒక్క ఓటీని కూడా సోమవారం మూసివేశారు. త్రిసభ్య కమిటీ నివేదిక వచ్చే వరకు సిజేరియన్లు నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. సాధారణ ప్రసవాలు మాత్రమే చేస్తున్నారు. బ్యాక్టీరియా, వైరస్ల నిర్మూలన కోసం ఓటీల్లో ఫ్యూమిగేషన్ చేపట్టారు. మరోవైపు బాలింతల మరణాలకు కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుల బంధువులు, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన నేతలు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగాయి. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. -
మరో మాతృ మరణం
హిందూపురం టౌన్ : జిల్లాలో మరో మాతృ మరణం సంభవించింది. గుమ్మఘట్ట మండలం గొల్లపల్లిలో ఆదివారం సరస్వతి అనే బాలింత బ్లీడింగ్ అయ్యి మరణించగా.. అలాంటి రక్తహీనత సమస్యతతోనే సోమవారం హిందూపురం ఆస్పత్రిలో అంజినమ్మ (30) అనే మహిళ ప్రసమైన మూడు గంటలకు మృత్యువాత పడింది. వివరాలిలా ఉన్నాయి. పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లికి చెందిన అంజినమ్మ 4వ కాన్పు నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి ఆదివారం వచ్చింది. సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో డాక్టర్ మాధవి వైద్యపరీక్షలు చేసి సిజరిన్ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. సాయంత్రం సిజరిన్ చేసిన తర్వాత షాక్‌కు గురై చనిపోయింది. కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించాం : డాక్టర్ మాధవి అంజినమ్మ వాంతులు, విరేచనాలు అవడంతో ఆదివారం ఆస్పత్రికి వచ్చింది. సోమవారం ఉదయం ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. అన్ని పరీక్షలు చేస్తే రక్తహీనతతో బాధపడున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు సాధారణ కాన్పులతో పాటు ఒక సిజరిన్ ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి సిజరిన్ ఆపరేషన్ చేస్తే షాక్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నాయని బంధువులకు వివరించాం. వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచించినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావడంతో శస్త్ర చికిత్స చేశాం. శస్త్ర చికిత్స పూర్తి అయ్యి బిడ్డను సాయంత్రం 4.45కు బయటకు తీసి కుట్లు వేసే సమయంలో ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురైంది. వైద్య బృందం అంతా కలిసి ఆమెను బతికించడానికి తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రాత్రి 7.20 నిమిషాలకు అంజినమ్మ మృతి చెందింది. ఈమెకు పుట్టిన ఆడబిడ్డ క్షేమంగా ఉంది. -
పీలేరులో బాలింత మృతి
* ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన * వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణ పీలేరు : వైద్యులు ఆపరేషన్ చేసిన తరువాత మగబిడ్డను ప్రసవించిన కొంతసేపట్లోనే బాలింత మృతి చెందింది. పీలేరు పట్టణంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి గురువారం రాత్రి కాన్పుకోసం గర్భిణి రాగా, రాత్రి 10-45 గంటల ప్రాంతంలో ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేశారు. మగ బిడ్డను ప్రసవించిన ఆమె మరికొన్ని గంటల్లోనే మరణించింది. దీనిపై ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. బాదితుల కథనం మేరకు కేవీపల్లె మండలం గువ్వలగుడ్డం గ్రామానికి చెందిన సీ. సుధాకర్‌రెడ్డి వాల్మీకిపురంలో ట్రాన్స్‌కోలో లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. పీలేరు పట్టణం కావలిపల్లెలో కాపురం ఉంటున్నారు. సుధాకర్‌రెడ్డి భార్య కుమారి(30)ని కాన్పు కోసం గురువారం రాత్రి 10 గంటల సమయంలో పట్టణంలోని గుప్త ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు రాత్రి 10.45 గంటలకు ఆపరేషన్ చేసి మగ బిడ్డను బయటకు తీశారు. అనంతరం రాత్రి సుమారు 1.30 గంటల సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా ఉందని ఆమె భర్తకు చెప్పారు. ఆస్పత్రి యాజమాన్యమే అంబులెన్స్‌లో తిరుపతిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి పంపించారు. అక్కడికెళ్లగానే పరీక్షించిన డాక్టర్లు ఆమె మృతి చెందిందని చెప్పారు. దాంతో ఆమె బంధువులు,కుటుంబసభ్యులు పీలేరు ఆస్పత్రి వద్దకు చేరుకుని శుక్రవారం ఆందోళనకు దిగారు. ఆపరేషన్‌లో తేడా రావడంవల్లే ఆమె చనిపోయిందని, ఆ విషయం బయటకు పొక్కనీయకుండా హడావుడిగా తిరుపతికి పంపేశారని ఆరోపించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రిపై దాడికి యత్నించారు. ఆందోళనకారులు, ఆస్పత్రి యాజమాన్యంతో పోలీసులు, ఇతర పెద్దలు చర్చించి గొడవను సద్దుమణిచారు. మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి పంపేశారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆస్పత్రి వద్ద ఆందోళన, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర రక్తస్రావంతోనే మృతి రిస్క్ కేసు అయినందున ఆపరేషన్ కేసి ఉండకూడ దు. ఈ కేసును మెటర్నటీ, సీఎంసీకి రెఫర్ చేసి ఉండాలి. సాహసం చేసి ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగిం చారు. రక్తస్రావం ఎక్కువ కావడంతో ఆమె మృతి చెందింది. సంఘటనపై ప్రాథమిక విచారణ చేసి నివేదికను జిల్లా కలెక్టర్, డీఎంఅండ్‌హెచ్‌వోకు అందజేస్తాను. మృతురాలి బంధువులు, డాక్టర్, నర్సులను విచారించాల్సి ఉంది. - అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో వెంకటప్రసాద్ -
వైద్యం వికటించి బాలింత మృతి
♦ ఆలస్యంగా వెలుగులోకివచ్చి ఘటన ♦ నర్సు,ఎఎన్‌ఎంలపై ఫిర్యాదు ♦ డిప్యూటీ డీఎహెచ్‌వో విచారణ నక్కపల్లి : ప్రసవ సమయంలో నర్సు, ఏఎన్ఎంలు చేసిన వైద్యం వికటించి ఓ బాలింత మృత్యువాతపడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువులు ఫిర్యాదుతో శనివారం డిప్యూటీ డీఎంహెచ్‌వో, అగనంపూడి ఏరియా ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ పి రాధారాణి గొడిచర్ల పీహెచ్సీలో విచారణ చేపట్టారు. మృతురాలి తల్లి లక్ష్మి ,భర్త శ్రీను విచారణాధికారికి ఇచ్చిన వాంగ్మూలం, విలేకర్లకు తెలిపి వివరాలిలా..మండలంలోని రాజయ్యపేటకు చెందిన మైలపల్లి అరుణ(25) రెండోకాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. నొప్పులు రావడంతో గతనెల 16నఅర్ధరాత్రి దాటాక ఏఎన్ఎం వెంకటలక్ష్మి ఆమెను గొడిచర్ల పీహెచ్‌సీకి తరలించారు. డాక్టర్ లేకపోవడంతో స్టాప్‌నర్సు స్వరూపతో కలిసి పురుడుపోశారు. మగబిడ్డపుట్టాడు. ఈ క్రమంలో ఆమె విపరీతమైన రక్తస్రావానికి గురైంది. అపస్మార క స్థితికి చేరింది. దీంతో తుని పెద్దాసుపత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు వేడుకున్నా వినకుండా తునిలోని ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారు ఆపరేషన్‌కు రూ.30వేలు అవుతుందన్నారు. మొదటి విడతగా రూ.10వేలు చెల్లించారు. ఆపరేషన్చేసినా పరిస్థితి కుదుట పడలేదు. అరుణకు కిడ్నీలు పాడయ్యాయని.. డయాలసిస్ కోసం వెంటనే మరో పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలన్నారు. కేజీహెచ్‌కు వెళ్తామని కుటుంబ సభ్యులంటున్నా వినకుడా కాకినాడలోని సూర్య గ్లోబల్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ మూడురోజులు వైద్యం చేసి రూ.1.36లక్షలు బిల్లు చేశారు. తర్వాత కిడ్నీల కోసం హైదరాబాద్నిమ్స్కి గాని, విశాఖసెవెన్హిల్స్లో గాని చేర్చాలని సూచించారు. వెంటనేసెవెన్హిల్స్కు తీసుకెళ్తే నిరాకరించారు. తర్వాత కేజీహెచ్‌లో జాయిన్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గత నెల 26న అరుణ మరణించిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా వాపోయారు. అరుణకు రెండేళ్లపాప, రెండునెలల బాబు ఉన్నారు. నర్సు, ఏఎన్ఎంలు ఆదిలో వ్యవహరించిన తీరు..ప్రయివేట్ ఆస్పత్రుల ధనాకాంక్ష అరుణను బలిగొన్నాయని వారు ఆరోపించారు. అన్యాయంపై తిరిగి తనపై ఏఎన్ఎం పోలీసుకేసు పెట్టారన్నారు. ఏఎన్ఎం,నర్సులపై తక్షణమే కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు. విచారణాధికారి రాధారాణి మాట్లాడుతూ ఇరుపక్షాలనుంచి వాంగ్మూలం సేకరించామన్నారు. -
డిప్యూటీ సీఎం తనిఖీ చేస్తుండగానే.. బాలింత మృతి
కరీంనగర్ హెల్త్ : డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ రాజయ్య కరీంనగర్‌లోని ప్రధాన ఆస్పత్రిని తనిఖీ చేస్తుండగానే.. సిబ్బంది నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందింది. వివరాలు.. పెద్దపల్లి మండలం రాఘవపురానికి చెందిన వసంత పురిటినొప్పులతో అక్కడి పీహెచ్సీలో చేరింది. శుక్రవారం ఉదయం సాధారణ కాన్పులో మగశిశువుకు జన్మనిచ్చింది. రక్తస్రావం ఎక్కువై పరిస్థితి విషమించడంతో సిబ్బంది 108లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వసంత మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఆ సమయంలో మంత్రి ఆస్పత్రిలోనే ఉండటంతో మృతదేహాన్ని ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే అంబులెన్స్‌లో తరలించారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని మంత్రి తెలిపారు. -
స్వైన్ ఫ్లూ కలకలం
* విస్తరిస్తున్న వైరస్ * వ్యాధి నిర్ధారణలో ఆలస్యం * జిల్లా కేంద్రానికి చెందిన బాలింత మృతి కరీంనగర్ హెల్త్ : రెండేళ్ల క్రితం గడగడలాడించిన ప్రాణాంతక స్వైన్‌ఫ్లూ వైరస్ ఇప్పుడు జిల్లాకూ పాకింది. విదేశాలతోపాటు ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో అప్పుడు కలకలం రేపిన ఈ వైరస్ జాడ ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. అంతా తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో జిల్లాకేంద్రంలోని ఓ మహిళ స్వైన్‌ఫ్లూతో మరణించిందని తెలిసి కలవరపడుతున్నారు. జిల్లాలో కొంతకాలంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. జ్వరాలతోపాటు డెంగీ లక్షణాలతో మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదు కావడం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. జిల్లాకేంద్రానికి చెందిన కాపరవేణి సరిత(30) రెండో కాన్పు కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. గత నెల 18న సిజేరియన్ నిర్వహించగా, ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఆరోగ్యంగానే ఉన్నారని డిశ్చార్జి చేశారు. ఇంటికి వచ్చిన కొద్దిరోజులకే తీవ్ర దగ్గు, అస్తమాతో బాధపడుతూ ఆమె అనారోగ్యానికి గురికాగా, స్థానికంగా చికిత్స అందించినా నయం కాలేదు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించగా, అక్కడి వైద్యులు స్వైన్‌ఫ్లూగా నిర్ధారించారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం రాత్రి మరణించింది. వివరాలు గోప్యంగా.. స్వైన్‌ఫ్లూతో మరణించిందన్న విషయం ఎక్కువగా ప్రచారం కాకుండా ఉండేందుకు బాధిత కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు. స్వైన్‌ఫ్లూతో మరణించిందని ముందుగా తెలిపిన బంధువులు ఆ తర్వాత కడుపునొప్పితో, కడుపువాపుతో, ఆపరేషన్ వికటించి మరణించిందని రక రకాలుగా చెబుతున్నారు. వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని ఎందుకు వచ్చారంటూ ఎదురు ప్రశ్నించి అక్కడినుంచి పంపించారు. ఈ విషయంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కొమురం బాలును వివరణ కోరగా సరిత స్వైన్‌ప్లూతో మరణించినట్లు తమకు సమాచారం ఉందన్నారు. జిల్లాలో మొదటి కేసు అని చెప్పారు. బాధితురాలికి ఈ వైరస్ ఎలా సోకిందనే విషయం పరిశీలిస్తున్నామన్నారు. బాధిత కుటుంబసభ్యులకు ఈ వైరస్ రాకుండా ఉండేందుకు ఓసెల్టర్ మందు బిళ్లలు కొనుగోలు చేసి 24 గంటల్లోపు పంపిణీ చేస్తామని తెలిపారు. స్వెన్‌ఫ్లూ లక్షణాలివే... - డాక్టర్ బాలు, డీఎంహెచ్‌వో స్వైన్‌ప్లూ హెచ్1, ఎన్1 అనే వైరస్ ద్వారా సోకుతుంది. ఇది రెండు రకాలుగా వస్తుంది. మొదటిది పందులకు అతి సమీపంలో నివసించే వారికి ఈ వ్యాధి వస్తుంది. రెండోది పందులతో సావాసం లేకపోయినా సదరు వ్యాధిగ్రస్తుల నుంచి కూడా సోకుతుంది. వైరస్ బారిన పడినవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఇతరులకు సోకుతుంది. ముక్కు నుంచి ద్రవం ఇతరులకు అంటుకున్నపుడు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదముంది. వ్యాధిగ్రస్తుడు దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం, తలనొప్పి, శరీరం నొప్పులు, కాళ్లు చేతులు తీవ్రంగా వణుకుతాయి. ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. వ్యాధి రాకుండా ముందస్తుగా ముక్కుకు మాస్కులు ధరించాలి. రోగ నివారణకు మందులు అందుబాటులోకి వ చ్చాయి.