గాంధీ’లో ఇద్దరు బాలింతల మృతి!
⇒ గోప్యంగా ఉంచేందుకు ఆస్పత్రి వర్గాలు శతవిధాలా ప్రయత్నం
⇒ అధిక రక్తస్రావమే కారణమంటున్న వైద్యులు
⇒ వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో నిలోఫర్ ఘటన మరవక ముందే సికింద్రా బాద్‌లోని గాంధీ ఆస్పత్రిలోనూ మరణ మృదంగం మోగింది. 24 గంటల వ్యవధిలో ఇద్దరు బాలింతలు తనువు చాలించారు. బాలింతల మృతి విషయం బయటకు పొక్కకుండా ఆస్పత్రి వర్గాలు శతవిధాలా ప్రయత్నించాయి. చివరకు అధిక రక్తస్రావంతో బాలింతలు మృతి చెందినట్లు పేర్కొని, తర్వాత ఎవరూ మృతి చెందలేదని మాటమార్చి కేస్‌షీట్లు కనిపించడం లేదని, రేపు వివరాలు వెల్లడిస్తామని ప్రకటించాయి.
కాగా, వైద్యుల నిర్లక్ష్యం పట్ల మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. కర్నాటకలోని బిజాపూర్ షోలాపూర్‌నాకాకు చెందిన రమీజా జబీన్ అనే గర్భిణీ ఈ నెల 18వ తేదీన గాంధీ ఆస్పత్రిలో చేరింది. ఈ నెల 20న వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించగా కొద్దిసేపటికే తీవ్ర రక్తస్రావం కావడంతో రమీజా జబీన్ మృతి చెందింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి (25) ప్రసవం కోసం కొద్దిరోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చేరింది. శస్త్రచికిత్స అనంతరం రక్రస్రావం తీవ్రమై మరణించింది.
బయటకు పొక్కకుండా....
గాంధీ ఆస్పత్రి వర్గాలు బాలింతల మృతి వివరాలు బయటికి పొక్కకుండా తీవ్రంగా ప్రయత్నించడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్, గైనకాలజీ విభాగాధిపతి జేవీరెడ్డిలను‘సాక్షి’ వివరణ కోరగా దాటవేత ధోరణిని ప్రదర్శిం చారు. వివరాలివ్వాలంటూ గైనకాలజీ విభాగం మహిళా ప్రొఫెసర్‌కు పురమాయించి ముఖం చాటేశారు. బాలింతలు మృతి చెందిన విషయం వాస్తమేనని, మానవ తప్పిందంతో వారు చనిపోలేదని వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. రమీజాజబీన్‌కు గతంలో మూడుసార్లు సిజేరియన్ జరిగిందని, నాల్గవసారి విజయవంతంగా చేశామని, అనంతరం రక్తస్రావం జరగడంతో మృతి చెందిందంటూ చెప్పుకొచ్చారు. మరో బాలింత లక్ష్మి కడుపులో బిడ్డ అడ్డం తిరగడంతోపాటు ఉమ్మనీరు తక్కువగా ఉందని సర్జరీ చేసి బిడ్డను బయటకు తీశామని, తర్వాత ఆమె కూడా రక్తస్రావంతో మృతి చెందిందని పేర్కొన్నారు.
మాటమార్చేశారు...
గాంధీ ఆస్పత్రిలోని గైనకాలజీ విభాగంలో 20, 21 తేదీల్లో ఎటువంటి మరణాలు సంభవించలేదని గాంధీ ఆస్పత్రి వర్గాలు మాటమార్చాయి. సూపరింటెండెంట్ పేషీ ముందు బాలింతల మృతి వివరాల కోసం పాత్రికేయులు చాలా సమయం వేచిచూసినా ఫలితం లేకుండా పోయింది. డీఎంఈకి పూర్తి వివరాలు అందిస్తున్నామని అదే కాపీని రేపు మీడియాకు అందజేస్తామని చెప్పారు. ఆ తర్వాతా మాటమార్చి గైనకాలజీ విభాగంలో ఎటువంటి మరణాలు సంభవించలేదన్నారు. సంబంధిత కేస్‌షీట్లు కూడా కనిపించడం లేదని పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి బుధవారం వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.