తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన వారు 70 శాతం మంది
రాష్ట్రానికి మరింత భారం కానున్న స్పెషలిస్టుల కొరత
హైదరాబాద్: హైదరాబాద్‌లోని వివిధ బోధనాసుపత్రులు, స్పెషాలిటీ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మెజారిటీ వైద్యులు తెలంగాణకే ఆప్షన్ ఇచ్చినట్టు తెలిసింది. గత రెండు మూడు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో పనిచేస్తూ, ఇక్కడే ప్రైవేట్ నర్సింగ్‌హోంలు, క్లినిక్‌లు ఏర్పాటు చేసుకుని స్థిరపడిన నేపథ్యంలో రెండేళ్ల అదనపు సర్వీసును(60 ఏళ్లకు పదవీ విరమణ) కాదనుకుని తెలంగాణకే ప్రాధాన్యత నిచ్చారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ బోధనాసుపత్రులతో పాటు సరోజిని, ఛాతీ ఆస్పత్రి, మానసిక వైద్యశాల, కోటి మెటర్నిటీ, నయాపూల్ మెటర్నిటీ, ఫీవర్ ఆస్పత్రి, ఎంఎన్‌జే కేన్సర్ వంటి పలు ఆస్పత్రుల్లో స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు సుమారు వందమందికిపైగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైద్యులున్నట్టు తేలింది. వీరిలో 70 శాతం మంది తెలంగాణలో పనిచేసేందుకే మొగ్గు చూపి ఆప్షన్లు ఇచ్చినట్లు సమాచారం.
స్థానికత ఆధారంగా వీరిని ఏపీకే ఇవ్వాల్సి ఉంది. అయితే కొంతమంది తెలంగాణలో వివాహం చేసుకోవడం, ఆరోగ్య సమస్యలు ఇలా పలు కారణాలను చూపించారు. దీంతో ఇప్పటికే స్పెషలిస్టుల కొరత ఎదుర్కొంటున్న ఏపీలోని బోధనాసుపత్రులకు ఇకపై మరిన్ని ఇబ్బందులు తలెత్తనున్నాయి. నెఫ్రాలజీ (కిడ్నీ), గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఆంకాలజీ (కేన్సర్) తదితర విభాగాలకు స్పెషలిస్ట్‌లు లేరు. మరో నెల రోజుల్లో ఆప్షన్లపై నిర్ణయం వెలువడనుంది.
తెలంగాణవైపే ఏపీ వైద్యుల మొగ్గు
Published Wed, Nov 11 2015 10:40 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement