నిలోఫర్ ఆసుపత్రి వద్ద ధర్నా చేస్తున్న బాధితుల బంధువులు.
నిలోఫర్‌లో విచారణకు ఆదేశించిన డీఎంఈ
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రిలో బాలింతల మరణాలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. వైద్య ఆరోగ్య మంత్రి ఆదేశాల మేరకు డీఎంఈ రమణి ఆస్పత్రికి చేరుకుని, బాలింతల మరణాలపై సమగ్ర విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఉస్మానియా డాక్టర్ భీంరావుసింగ్, గాంధీ ప్రొఫెసర్ డాక్టర్ రాణి, పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి చెందిన డాక్టర్ ప్రతిభతో కమిటీ ఏర్పాటైంది. ఈ బృందం సోమవారం నిలోఫర్ ఆస్పత్రిని సందర్శించి, సిజేరియన్‌లో వైద్యపరమైన నిర్లక్ష్యంపై ఆరా తీసింది. ప్రభుత్వానికి రెండు రోజుల్లో సమగ్ర నివవేదిక అందే అవకాశం ఉంది.
నివేదిక అందిన వెంటనే చర్యలు...
ఇదిలా ఉండగా డీఎంఈ రమణి.. సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్‌కుమార్ సహా ఆర్‌ఎంలు, ఇతర వైద్యులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బాలింతల మరణాలపై ఆరా తీశారు. ఈ సంద ర్భంగా ఆస్పత్రిలో బాలింతల మరణాలు చోటు చేసుకోవడం వాస్తవమేనని ఆమె అంగీకరించారు. గత నెల 28 నుంచి ఈ నెల మూడో తేదీ వరకు ఆస్పత్రిలో 44 సిజేరియన్లు చేయగా వీరిలో ఐదుగురు (రీనా, బుష్రబేగం, ఫరా ఫాతిమా, నజ్రత్, అనుష) బాలింతలు మృతి చెందారన్నారు. ఈ మరణాలపై విచారణ కొనసాగుతోందని, నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కొంత మంది వైద్యులు, పీజీ విద్యార్థులు.. సీఎస్ ఆర్‌ఎంఓపై డీఎంఈకి ఫిర్యాదు చేశారు.
బంధువుల ఆందోళన..
ఆస్పత్రిలో సిజేరియన్ల కోసం మూడు ఆపరేషన్ థియేటర్లు ఉండగా, ఇప్పటికే రెండింటిని మూసివేశారు. అత్యవసర చికిత్సల కోసం తెరిచి ఉన్న ఆ ఒక్క ఓటీని కూడా సోమవారం మూసివేశారు. త్రిసభ్య కమిటీ నివేదిక వచ్చే వరకు సిజేరియన్లు నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. సాధారణ ప్రసవాలు మాత్రమే చేస్తున్నారు. బ్యాక్టీరియా, వైరస్‌ల నిర్మూలన కోసం ఓటీల్లో ఫ్యూమిగేషన్ చేపట్టారు. మరోవైపు బాలింతల మరణాలకు కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుల బంధువులు, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన నేతలు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగాయి. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.