
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్) తగ్గింది. రాష్ట్రంలో 2014–16 మధ్య ఎంఎంఆర్ 63 ఉండగా, 2017–19 నాటికి 56కు తగ్గినట్టు రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ బులెటిన్‌ను శుక్రవారం విడుదల చేసింది. దేశంలో ఎంఎంఆర్ 113 నుంచి 103కు తగ్గిందని నివేదికలో పేర్కొంది. కేరళలో అత్యల్పంగా ఎంఎంఆర్ 30 నమోదు కాగా, మహారాష్ట్రలో 38, తెలంగాణలో 56 నమోదైందని తెలిపింది. నివేదికపై మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి 92గా ఉన్న ఎంఎంఆర్‌ను ఇప్పుడు 56కు తగ్గించగలిగామని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ పథకం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
ప్రతి లక్షకు లెక్క..: 15–49 సంవత్సరాల వయసులో ప్రతి లక్ష మంది ప్రసూతి మహిళల్లో సంభవించే మరణాలను ఎంఎంఆర్‌గా లెక్కిస్తారు. పునరుత్పత్తి వయసులో ఉన్న చాలా మంది స్త్రీలు గర్భధారణ సమయంలో లేదా ప్రసవ సమయంలో లేదా గర్భస్రావం తర్వాత వివిధ అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం గర్భవతిగా ఉన్నప్పుడు లేదా గర్భం దాల్చిన 42 రోజుల్లోపు, గర్భం లేదా దానికి సంబంధించిన ఏదైనా కారణంతో మరణిస్తారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ లక్ష్యం.. లక్షకు 70 కంటే తక్కువకు ఎంఎంఆర్‌ను తగ్గించడం.
Comments
Please login to add a commentAdd a comment