మంత్రుల కోసం వైద్యుల బిజీ..
- ప్రసవం చేసిన నర్సులు.. తీవ్ర రక్తస్రావమై బాలింత మృతి
- నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రిలో మంత్రుల పర్యటనకు ముందు ఘటన
నర్సాపూర్ రూరల్: అది మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ప్రభుత్వాస్పత్రి.. 30 పడకలుగా ఉన్న ఆస్పత్రిని 100పడకల వరకు స్థాయి పెంచినందున సోమవారం ఉదయం మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. వైద్యులంతా ఆ కార్యక్రమంలోనే బిజీగా ఉన్నారు. కాగా, అంతకుముందు రోజు ఆదివారం రాత్రి నర్సాపూర్‌కు చెందిన గర్భిణీ బుతల్ ఫాతిమా (28)ను ప్రసవం కోసం ఆమె భర్త సమీర్ షేక్ ఇదే ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం ఉదయం వైద్యులు అందుబాటులో లేకున్నా.. నర్సులు ప్రసవం చేశారు.
ఫాతిమా ఆడబిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో గంట తరువాత ఓ నర్సు ఫాతిమాకు ఇంజక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమెకు తీవ్ర రక్తస్రావం ప్రారంభమైంది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు కూడా చేతులెత్తేశారు. ఇంతలోనే ఫాతిమా ప్రాణాలు విడిచింది. కాగా, వైద్యులంతా మంత్రుల పర్యటనలో బిజీగా ఉన్నారనీ, వారంతా తొమ్మిది గంటలకు వస్తారని నర్సులు, సిబ్బంది చెబుతూ నిర్లక్ష్యం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
మంత్రులు వస్తున్నారని గర్భిణీకి వైద్యం చేయని వైద్యులు
నర్సాపూర్: హత్నూర మండలంలోని మంగాపూర్‌కు చెందిన గర్భిణీ అనితకు సోమవారం ఇంటివద్ద పురిటి నొప్పులు రావడంతో తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెను చూసి మంత్రులు వస్తున్నారని, వారు వెళ్లిపోయాక వైద్యం చేస్తామని చెప్పారు. దీంతో చేసేదేమీలేక అనిత తల్లిదండ్రులు ఆమెను ఓ చెట్టుకింద కూర్చోపెట్టారు. ఈ దృశ్యం విలేకరుల కంటపడటంతో ఫొటోలు తీస్తుండగా.. ఆస్పత్రి సిబ్బంది చూసి ఆమెను లోపలికి రావాలని పిలిచారు. కాగా, ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రులు లక్ష్మారెడ్డి, హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ప్రసవాల కోసం ఇక్కడికే రావాలని సూచించారు.