Narsapur Government Hospital
-
నర్సాపూర్ ఆసుపత్రిలో నిండు గర్భిణి మృతి
నర్సాపూర్ రూరల్: వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ మృతిచెందిందంటూ నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి తండా, కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ పంచాయతీ పరిధిలోని కుషన్ గూడ తండాలకు చెందిన గిరిజనులు బుధవారం నర్సాపూర్ ఏరియా ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎస్సై గంగరాజు పోలీసులతో అక్కడికి చేరుకొని చెదరగొట్టారు. ఈ సందర్భంగా మృతురాలు కుటుంబ సభ్యులు బంధువులు మాట్లాడుతూ నిండు గర్భిణీ అయిన ధారవత్ సునీతను (27) ఈ నెల 1వ తేదీన ఆమె భర్త రాజు ఇతర కుటుంబ సభ్యులు ప్రసవం కోసం నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చి చేర్పించారు. మంగళవారం రాత్రి సునీతకు లోబీపీతో పాటు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే సంగారెడ్డి ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో సునీతా మృత్యువాత పడినట్లు చెప్పారు. నర్సాపూర్ ఆస్పత్రిలో వైద్యుల సరిగా చూడక పోవడంతోనే సునీతా మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలు సునీతాకు ఐదేళ్ళ కూతురు ఉంది. నర్సాపూర్ ఏరియా ఆస్పత్రి ఎదుట మృతురాలి కుటుంబీకులతో మట్లాడుతున్న ఆంజనేయులు ప్రభుత్వ వైఫల్యమే కారణం.. నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది, పరికరాలు ఇతర సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్ ఆరోపించారు. నిరుపేదల వైద్య సేవల పట్ల ప్రజా ప్రతినిధులు, అధికారులు కపట ప్రేమ కనబర్చడంతోనే నిండు గర్భిణీ మృతిచెందిదన్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డిలు గర్భిణీ మృతికి బాధ్యత వహించి బాధిత కుటుండాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేయలేదు.. మృతురాలు సునీతా వైద్య సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ మీర్జా నజీమ్ బేగ్ వివరణ ఇచ్చారు. సునీతకు రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగ లోబీపీతో పాటు తీవ్ర రక్తస్రావం అయి పరిస్థితి విషమంగా మారిందన్నారు. వెంటనే సంగారెడ్డిలోని హైరిస్క్ కేంద్రానికి రెఫర్ చేశామని తెలిపారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఎక్కడ లేదన్నారు. వెయ్యిలో ఒకరికి ప్రసవ సమయంలో లోబీపీ, రక్తస్రావం అవుతుందన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మంత్రుల కోసం వైద్యుల బిజీ..
- ప్రసవం చేసిన నర్సులు.. తీవ్ర రక్తస్రావమై బాలింత మృతి - నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రిలో మంత్రుల పర్యటనకు ముందు ఘటన నర్సాపూర్ రూరల్: అది మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ప్రభుత్వాస్పత్రి.. 30 పడకలుగా ఉన్న ఆస్పత్రిని 100పడకల వరకు స్థాయి పెంచినందున సోమవారం ఉదయం మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. వైద్యులంతా ఆ కార్యక్రమంలోనే బిజీగా ఉన్నారు. కాగా, అంతకుముందు రోజు ఆదివారం రాత్రి నర్సాపూర్‌కు చెందిన గర్భిణీ బుతల్ ఫాతిమా (28)ను ప్రసవం కోసం ఆమె భర్త సమీర్ షేక్ ఇదే ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం ఉదయం వైద్యులు అందుబాటులో లేకున్నా.. నర్సులు ప్రసవం చేశారు. ఫాతిమా ఆడబిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో గంట తరువాత ఓ నర్సు ఫాతిమాకు ఇంజక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమెకు తీవ్ర రక్తస్రావం ప్రారంభమైంది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు కూడా చేతులెత్తేశారు. ఇంతలోనే ఫాతిమా ప్రాణాలు విడిచింది. కాగా, వైద్యులంతా మంత్రుల పర్యటనలో బిజీగా ఉన్నారనీ, వారంతా తొమ్మిది గంటలకు వస్తారని నర్సులు, సిబ్బంది చెబుతూ నిర్లక్ష్యం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మంత్రులు వస్తున్నారని గర్భిణీకి వైద్యం చేయని వైద్యులు నర్సాపూర్: హత్నూర మండలంలోని మంగాపూర్‌కు చెందిన గర్భిణీ అనితకు సోమవారం ఇంటివద్ద పురిటి నొప్పులు రావడంతో తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెను చూసి మంత్రులు వస్తున్నారని, వారు వెళ్లిపోయాక వైద్యం చేస్తామని చెప్పారు. దీంతో చేసేదేమీలేక అనిత తల్లిదండ్రులు ఆమెను ఓ చెట్టుకింద కూర్చోపెట్టారు. ఈ దృశ్యం విలేకరుల కంటపడటంతో ఫొటోలు తీస్తుండగా.. ఆస్పత్రి సిబ్బంది చూసి ఆమెను లోపలికి రావాలని పిలిచారు. కాగా, ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రులు లక్ష్మారెడ్డి, హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ప్రసవాల కోసం ఇక్కడికే రావాలని సూచించారు.