సునీత (ఫైల్ ఫొటో)
నర్సాపూర్ రూరల్: వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ మృతిచెందిందంటూ నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి తండా, కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ పంచాయతీ పరిధిలోని కుషన్ గూడ తండాలకు చెందిన గిరిజనులు బుధవారం నర్సాపూర్ ఏరియా ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎస్సై గంగరాజు పోలీసులతో అక్కడికి చేరుకొని చెదరగొట్టారు. ఈ సందర్భంగా మృతురాలు కుటుంబ సభ్యులు బంధువులు మాట్లాడుతూ నిండు గర్భిణీ అయిన ధారవత్ సునీతను (27) ఈ నెల 1వ తేదీన ఆమె భర్త రాజు ఇతర కుటుంబ సభ్యులు ప్రసవం కోసం నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చి చేర్పించారు.
మంగళవారం రాత్రి సునీతకు లోబీపీతో పాటు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే సంగారెడ్డి ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో సునీతా మృత్యువాత పడినట్లు చెప్పారు. నర్సాపూర్ ఆస్పత్రిలో వైద్యుల సరిగా చూడక పోవడంతోనే సునీతా మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలు సునీతాకు ఐదేళ్ళ కూతురు ఉంది.
నర్సాపూర్ ఏరియా ఆస్పత్రి ఎదుట మృతురాలి కుటుంబీకులతో మట్లాడుతున్న ఆంజనేయులు
ప్రభుత్వ వైఫల్యమే కారణం..
నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది, పరికరాలు ఇతర సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్ ఆరోపించారు. నిరుపేదల వైద్య సేవల పట్ల ప్రజా ప్రతినిధులు, అధికారులు కపట ప్రేమ కనబర్చడంతోనే నిండు గర్భిణీ మృతిచెందిదన్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డిలు గర్భిణీ మృతికి బాధ్యత వహించి బాధిత కుటుండాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
నిర్లక్ష్యం చేయలేదు..
మృతురాలు సునీతా వైద్య సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ మీర్జా నజీమ్ బేగ్ వివరణ ఇచ్చారు. సునీతకు రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగ లోబీపీతో పాటు తీవ్ర రక్తస్రావం అయి పరిస్థితి విషమంగా మారిందన్నారు. వెంటనే సంగారెడ్డిలోని హైరిస్క్ కేంద్రానికి రెఫర్ చేశామని తెలిపారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఎక్కడ లేదన్నారు. వెయ్యిలో ఒకరికి ప్రసవ సమయంలో లోబీపీ, రక్తస్రావం అవుతుందన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment