
భర్త రాజుతో భార్య రజిత, పిల్లలు (ఫైల్)
టేక్మాల్ (మెదక్): ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందోఏమో.. ఇద్దరు పిల్లలతో కలిసి తానూ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కన్నతల్లి కఠిననిర్ణయంతో గచ్చుకుంట చెరువు కన్నీటిసంద్రమైంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నబిడ్డలను, లోకం చూడని గర్భస్థ శిశువునూ తనతోపాటు కాటికి తీసుకెళ్లింది. ఈ హృదయ విదారక ఘటన మెదక్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. టేక్మాల్ మండలం దాదాయిపల్లికి చెందిన కోటంగారి రాజు, అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌కు చెందిన రజిత(25) కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
రాజుకు అంతకుముందే రేగోడ్ మండలంలోని గజ్జాడ గ్రామానికి చెందిన మహిళతో పెళ్లి అయింది. మొద టి భార్యకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొన్నాళ్లుగా ఇద్దరు భార్యలతో కలసి హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేట్ బస్సు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కోవిడ్ కారణం గా రెండేళ్ల క్రితం దాదాయిపల్లికి ఇద్దరు భా ర్యలు, పిల్లలతో కలసి తిరిగొచ్చాడు. రజితకు రిశ్వంత్(3), రక్షిత(2) సంతానం.
ఆమె ప్రస్తుతం ఆరునెలల గర్భిణి. 4 రోజులుగా కుటుంబసమస్యలతో భార్యాభర్తలు గొడవపడుతున్నారు. సోమవారంరాత్రి కూడా ఇంట్లో గొడవ జరగడంతో మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి పిల్లలతో కలసి రజిత బయటకు వెళ్లింది. గచ్చుకుంట చెరువులో ఇద్దరు పిల్లలు, ఆమె శవమై తేలారు.
భర్తపైనే అనుమానం..
రజిత, ఇద్దరు పిల్లల మృతికి రాజు కారణమంటూ మృతురాలి బంధువులు ఆరోపించారు. మొదటి భార్య ఘటనాస్థలానికి రాకపోవడంతో పలు అనుమానాలను వ్యక్తం చేశారు. రాజే ఆమెను చంపాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొనగా అల్లాదుర్గం సీఐ జార్జ్, ఎస్‌ఐ మోహన్‌రెడ్డి, టేక్మాల్ ట్రైనీ ఎస్‌ఐ శ్రీ కాంత్ వారిని శాంతింపజేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment