వైద్యం వికటించి బాలింత మృతి
♦ ఆలస్యంగా వెలుగులోకివచ్చి ఘటన
♦ నర్సు,ఎఎన్‌ఎంలపై ఫిర్యాదు
♦ డిప్యూటీ డీఎహెచ్‌వో విచారణ
నక్కపల్లి : ప్రసవ సమయంలో నర్సు, ఏఎన్‌ఎంలు చేసిన వైద్యం వికటించి ఓ బాలింత మృత్యువాతపడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువులు ఫిర్యాదుతో శనివారం డిప్యూటీ డీఎంహెచ్‌వో, అగనంపూడి ఏరియా ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ పి రాధారాణి గొడిచర్ల పీహెచ్‌సీలో విచారణ చేపట్టారు. మృతురాలి తల్లి లక్ష్మి ,భర్త శ్రీను విచారణాధికారికి ఇచ్చిన వాంగ్మూలం, విలేకర్లకు తెలిపి వివరాలిలా..మండలంలోని రాజయ్యపేటకు చెందిన మైలపల్లి అరుణ(25) రెండోకాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. నొప్పులు రావడంతో గతనెల 16నఅర్ధరాత్రి దాటాక ఏఎన్‌ఎం వెంకటలక్ష్మి ఆమెను గొడిచర్ల పీహెచ్‌సీకి తరలించారు. డాక్టర్ లేకపోవడంతో స్టాప్‌నర్సు స్వరూపతో కలిసి పురుడుపోశారు. మగబిడ్డపుట్టాడు. ఈ క్రమంలో ఆమె విపరీతమైన రక్తస్రావానికి గురైంది. అపస్మార క స్థితికి చేరింది.
దీంతో తుని పెద్దాసుపత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు వేడుకున్నా వినకుండా తునిలోని ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారు ఆపరేషన్‌కు రూ.30వేలు అవుతుందన్నారు. మొదటి విడతగా రూ.10వేలు చెల్లించారు. ఆపరేషన్‌చేసినా పరిస్థితి కుదుట పడలేదు. అరుణకు కిడ్నీలు పాడయ్యాయని.. డయాలసిస్ కోసం వెంటనే మరో పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలన్నారు. కేజీహెచ్‌కు వెళ్తామని కుటుంబ సభ్యులంటున్నా వినకుడా కాకినాడలోని సూర్య గ్లోబల్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ మూడురోజులు వైద్యం చేసి రూ.1.36లక్షలు బిల్లు చేశారు. తర్వాత కిడ్నీల కోసం హైదరాబాద్‌నిమ్స్‌కి గాని, విశాఖసెవెన్‌హిల్స్‌లో గాని చేర్చాలని సూచించారు. వెంటనేసెవెన్‌హిల్స్‌కు తీసుకెళ్తే నిరాకరించారు. తర్వాత కేజీహెచ్‌లో జాయిన్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గత నెల 26న అరుణ మరణించిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా వాపోయారు. అరుణకు రెండేళ్లపాప, రెండునెలల బాబు ఉన్నారు.
నర్సు, ఏఎన్‌ఎంలు ఆదిలో వ్యవహరించిన తీరు..ప్రయివేట్ ఆస్పత్రుల ధనాకాంక్ష అరుణను బలిగొన్నాయని వారు ఆరోపించారు. అన్యాయంపై తిరిగి తనపై ఏఎన్‌ఎం పోలీసుకేసు పెట్టారన్నారు. ఏఎన్‌ఎం,నర్సులపై తక్షణమే కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు. విచారణాధికారి రాధారాణి మాట్లాడుతూ ఇరుపక్షాలనుంచి వాంగ్మూలం సేకరించామన్నారు.