
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మాతృత్వ మరణాలు పెరుగుతున్నాయి. 10 జిల్లాల్లో గతేడాది కంటే ఈసారి అధికంగా నమోదయ్యాయి. 15 జిల్లాల్లో 10 కంటే ఎక్కువ మరణాలు చోటుచేసుకున్నాయి. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ యోగితా రాణా సోమవారం సమీక్షించారు. మరణాలకు గల కారణాలు, జిల్లాల వారీగా రూపొందించిన నివేదికపై చర్చించారు. 2018–19లో రాష్ట్ర వ్యాప్తంగా 389 మాతృత్వ మరణాలు నమోదవగా, 2019–2020 (డిసెంబర్ నాటికి) 323 మరణాలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, మెదక్, వికారా బాద్, వనపర్తి, సూర్యాపేట్, గద్వాల్, ములుగు, సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల్లో గతేడాది కంటే ఎక్కువ మంది చనిపోయారు.