సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరుగుతోంది. ఈసారి వర్షాలు విస్తారంగా పడటంతో పెద్దెత్తున గంజాయి సాగు చేశారు. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలు, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు, ఏపీలో గోదావరి ఏజెన్సీ ప్రాంతాలు, విశాఖ, శ్రీకాకుళం ఏజెన్సీలో గంజాయి సాగు విస్తీర్ణం పెరిగినట్లు ఎక్సైజ్, డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్), ఎన్‌సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అనుమానిస్తోంది. వీటిని ఉత్తర భారతంలోని మహారాష్ట్ర, గుజరాత్‌లకు ఎగుమతి చేసే క్రమంలో హైదరాబాద్‌లో దొరికిపోతున్నారు. కొంతకాలంగా హైదరాబాద్‌లో గంజాయి దొరికిన ప్రతీసారి క్వింటాళ్ల కొద్దీ లభిస్తుండటమే ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మొత్తానికి కరోనా వైరస్‌తో విధించిన లాక్‌డౌన్‌ను స్మగ్లర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. పోలీసుల నిఘా అంతగా లేకపోవడంతో గంజాయి భారీగా సాగు చేశారు.
ఇంతకాలం హైదరాబాద్ దాని పరిసరాలకే పరిమితమైన గంజాయి సరఫరా ఇప్పుడు మెల్లగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకూ పాకుతోంది. లాక్‌డౌన్ కారణంగా గ్రామాల్లో పెద్దగా పనులు లేకపోవడం, కాలేజీలు లేకపోవడంతో కొందరు యువత మత్తు కోసం గంజాయికి అలవాటు పడుతున్నారు. కోల్‌బెల్ట్ ప్రాంతాలైన కొత్తగూడెం, మందమర్రి, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖమ్మం, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో గంజాయి వినియోగం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రామగుండం కమిషనరేట్ పరిధిలోని ఎన్‌టీపీసీ, గోదావరి ఖని, రామగుండం తదితర ప్రాంతాల్లో యువత గంజాయి మత్తులో చిత్తవుతున్నారు. ఈ మత్తులోనే వాళ్లల్లో వాళ్లే తగవులు పెట్టుకోవడం లేదా ఇతరులపై దాడులకు దిగడం చేస్తున్నారు. ఇటీవల రాజధానిలోని అంబర్‌పేట, ఖమ్మం జిల్లాలో యువత గంజాయి మత్తులో దారిన వెళ్లేవారిపై దాడులకు దిగడం కలకలం రేపింది. ఈ విషయంలో జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు తీవ్రంగా వ్యవహరిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాను అరికడుతూనే సరఫరా చేస్తున్న వారిపై పీడీ కేసులు నమోదు చేస్తున్నారు.
ఎన్‌సీబీ, డీఆర్‌ఐ వద్ద క్వింటాళ్లకొద్దీ..
ఈసారి రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా విస్తారంగా గంజాయి సాగు చేసినట్లు ఎన్‌సీబీ, డీఆర్‌ఐ, ఎక్సైజ్‌శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఆగస్టులో హయత్‌నగర్ వద్ద 995 కేజీల గంజాయిని ఎన్‌సీబీ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అదే నెలలో డీఆర్‌ఐ అధికారులు పంతంగి టోల్ గేట్ వద్ద దాదాపు రూ.3.6 కోట్ల విలువైన 1,500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్ తర్వాత వివిధ సందర్భాల్లో దాదాపు 4వేల కిలోల గంజాయిని ఒక్క ఎన్‌సీబీ అధికారులే పట్టుకోవడం గంజాయి అక్రమ రవాణా ఎలా సాగుతోందనడానికి నిదర్శనం.
ఎక్స్‌ట్రా కేబిన్ ఏర్పాటు చేసి..
భద్రాచలం, ములుగు, తూర్పు గోదావరి ఏజెన్సీ నుంచి భద్రాచలం పట్టణానికి గంజాయి తరలిస్తారు. ఆపై సరుకును కొత్త గూడెం, మహబూబాబాద్, నర్సంపేటల మీదుగా వరంగల్ నుంచి హైదరాబాద్ శివార్లకు తీసుకొస్తారు. అక్కడ నుంచి నగర పరిసర జిల్లాలకు రవాణా చేస్తున్నారు. సాధారణంగా పాలు, కూరగాయలు, ఊక లారీల అడుగున గంజాయి రాజధానికి చేర్చేవారు. ఇప్పుడు స్మగ్లర్లు రూటుమార్చారు. భద్రాచలం, ములుగు ఏజెన్సీ ఏరియాలకు వస్తున్న లారీల్లో ఎక్స్‌ట్రా రహస్య కేబిన్ ఏర్పాటు చేసి అందులో గంజాయిని తరలిస్తున్నారు. ఈ లారీలను తనిఖీ చేసినా ఖాళీగా ఉంటుంది కాబట్టి.. పోలీసులకు కూడా అనుమానం రాదు. సమాచారం ఉంటే తప్ప వాటిని గుర్తించడం కష్టం.
గట్టి నిఘా ఏర్పాటు..
‘రాష్ట్రంలో ఈసారి భద్రాచలం, ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా గంజాయి సాగు చేసినట్లు మా వద్ద సమాచారం ఉంది. గంజాయి రవాణాపై కూడా దృష్టిసారించాం. ఈ క్రమంలోనే తాజా తనిఖీల్లో పెద్దెత్తున సరుకు పట్టుబడింది. గంజాయి రవాణా ఏ మార్గంలో జరిగినా.. పట్టుకునేలా గట్టి నిఘా ఏర్పాటు చేశాం. ఆ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం’అని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment