స్వైన్ ఫ్లూ కలకలం
* విస్తరిస్తున్న వైరస్
* వ్యాధి నిర్ధారణలో ఆలస్యం
* జిల్లా కేంద్రానికి చెందిన బాలింత మృతి
కరీంనగర్ హెల్త్ : రెండేళ్ల క్రితం గడగడలాడించిన ప్రాణాంతక స్వైన్‌ఫ్లూ వైరస్ ఇప్పుడు జిల్లాకూ పాకింది. విదేశాలతోపాటు ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో అప్పుడు కలకలం రేపిన ఈ వైరస్ జాడ ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. అంతా తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో జిల్లాకేంద్రంలోని ఓ మహిళ స్వైన్‌ఫ్లూతో మరణించిందని తెలిసి కలవరపడుతున్నారు.
జిల్లాలో కొంతకాలంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. జ్వరాలతోపాటు డెంగీ లక్షణాలతో మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదు కావడం ప్రజలను బెంబేలెత్తిస్తోంది.
జిల్లాకేంద్రానికి చెందిన కాపరవేణి సరిత(30) రెండో కాన్పు కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. గత నెల 18న సిజేరియన్ నిర్వహించగా, ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఆరోగ్యంగానే ఉన్నారని డిశ్చార్జి చేశారు. ఇంటికి వచ్చిన కొద్దిరోజులకే తీవ్ర దగ్గు, అస్తమాతో బాధపడుతూ ఆమె అనారోగ్యానికి గురికాగా, స్థానికంగా చికిత్స అందించినా నయం కాలేదు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించగా, అక్కడి వైద్యులు స్వైన్‌ఫ్లూగా నిర్ధారించారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం రాత్రి మరణించింది.
వివరాలు గోప్యంగా..
స్వైన్‌ఫ్లూతో మరణించిందన్న విషయం ఎక్కువగా ప్రచారం కాకుండా ఉండేందుకు బాధిత కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు. స్వైన్‌ఫ్లూతో మరణించిందని ముందుగా తెలిపిన బంధువులు ఆ తర్వాత కడుపునొప్పితో, కడుపువాపుతో, ఆపరేషన్ వికటించి మరణించిందని రక రకాలుగా చెబుతున్నారు. వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని ఎందుకు వచ్చారంటూ ఎదురు ప్రశ్నించి అక్కడినుంచి పంపించారు. ఈ విషయంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కొమురం బాలును వివరణ కోరగా సరిత స్వైన్‌ప్లూతో మరణించినట్లు తమకు సమాచారం ఉందన్నారు. జిల్లాలో మొదటి కేసు అని చెప్పారు. బాధితురాలికి ఈ వైరస్ ఎలా సోకిందనే విషయం పరిశీలిస్తున్నామన్నారు. బాధిత కుటుంబసభ్యులకు ఈ వైరస్ రాకుండా ఉండేందుకు ఓసెల్టర్ మందు బిళ్లలు కొనుగోలు చేసి 24 గంటల్లోపు పంపిణీ చేస్తామని తెలిపారు.
స్వెన్‌ఫ్లూ లక్షణాలివే...
- డాక్టర్ బాలు, డీఎంహెచ్‌వో
స్వైన్‌ప్లూ హెచ్1, ఎన్1 అనే వైరస్ ద్వారా సోకుతుంది. ఇది రెండు రకాలుగా వస్తుంది. మొదటిది పందులకు అతి సమీపంలో నివసించే వారికి ఈ వ్యాధి వస్తుంది. రెండోది పందులతో సావాసం లేకపోయినా సదరు వ్యాధిగ్రస్తుల నుంచి కూడా సోకుతుంది. వైరస్ బారిన పడినవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఇతరులకు సోకుతుంది. ముక్కు నుంచి ద్రవం ఇతరులకు అంటుకున్నపుడు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదముంది. వ్యాధిగ్రస్తుడు దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం, తలనొప్పి, శరీరం నొప్పులు, కాళ్లు చేతులు తీవ్రంగా వణుకుతాయి. ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. వ్యాధి రాకుండా ముందస్తుగా ముక్కుకు మాస్కులు ధరించాలి. రోగ నివారణకు మందులు అందుబాటులోకి వ చ్చాయి.