Swine flu virus
-
మురిగిపోతున్న మందులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యంతో రూ.లక్షల విలువైన మందులు మురిగిపోతున్నాయి. ప్రాణాంతక స్వైన్ ఫ్లూ వైరస్ నివారణలో కీలకమైన వ్యాక్సిన్ల పంపిణీలో వారు చూపుతున్న అలసత్వం పేదలను ఈ టీకాలకు దూరం చేయడంతోపాటు భారీగా ప్రజాధనం వృథాకు కారణమవుతోంది. స్వైన్ ఫ్లూను నివారించేందుకు ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తోం ది. వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదనల మేరకు 2017–18లో వినియోగించేందుకు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) 10 వేల డోసుల వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి జిల్లా స్థాయి ఆస్పత్రులకు పంపిణీ చేసింది. ఒక్కో డోసు ధర రూ. 258 చొప్పున రూ. 25.58 లక్షలు ఖర్చు చేసింది. ఈ వ్యాక్సిన్ కాలపరిమితి 2018 మే వరకే ఉంది. వీటి వినియోగంపై ప్రజారోగ్య విభాగం వైద్యలు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 10 వేల డోసుల్లో 3,138 డోసులనే వినియోగించినట్లు రికార్డులు చెబుతున్నాయి. మిగిలిన డోసులు వినియోగించకుండానే పారేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్స్పైరీ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రజారోగ్యం విభాగం ఉన్నతాధికారులు హడావుడి మొదలుపెట్టారు. ప్రజలు, రోగులకు ఇవ్వకున్నా వైద్య, ఆరోగ్యశాఖలోని సిబ్బంది, వారి కుటుంబసభ్యులు వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిల్వ ఉన్న వ్యాక్సిన్‌ను కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేశారు. ఈ నెలలోనే ఎక్స్పైరీ తేదీ ముగుస్తుండటంతో సిబ్బందీ వినియోగించేందుకు భయపడుతున్నారు. -
విశాఖలో ఏడు స్వైన్‌ఫ్లూ కేసులు
విశాఖపట్టణం: విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు ఏడు స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు నమోదయినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ జనార్దన్ నివాస్ వెల్లడించారు. శనివారం ఆయన స్వైన్‌ఫ్లూ వ్యాప్తిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ఏడు కేసుల్లో రెండు స్వైన్‌ఫ్లూగా నిర్ధారణకాగా, మరో రెండింటి రిపోర్టులు అందాల్సి ఉందని తెలిపారు. మరో రెండు కేసులు నెగిటివ్‌గా తేలాయన్నారు. స్వైన్‌ఫ్లూ కేసులు నిర్ధారణ అయిన ప్రాంతాల్లో 14 బృందాలతో స్క్రీనింగ్ పరీక్షలు జరుపుతున్నట్టు జేసీ తెలిపారు.12 బృందాలతో వైద్య శిబిరాలు కూడా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. దీంతోపాటు వైద్య సిబ్బందికి మాస్క్‌లు అందజేయనున్నట్టు చెప్పారు. -
ఏపీలో విస్తరిస్తున్న స్వైన్‌ఫ్లూ
12 కేసులు నమోదైనట్లు చెప్పిన మంత్రి కామినేని సాక్షి, విజయవాడ బ్యూరో/ విశాఖపట్నం: తెలంగాణను వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ మెల్లగా ఏపీలోనూ విస్తరిస్తోంది. ఒంగోలు, విశాఖపట్నంలో పలువురికి ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 12 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ విశాఖలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. వారం క్రితం సంతమాగులూరు క్వారీలో పనిచేసే శివకృష్ణ (27) ఈ లక్షణాలతో మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శుక్రవారం విశాఖపట్నం కింగ్‌జార్జి ఆస్పత్రిలో ఆరేళ్ల బాలుడు స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో మృతి చెందాడు. అక్కడే మరో ఎనిమిదేళ్ల బాలికకు ఈ వ్యాధి లక్షణాలున్నట్టు అనుమానిస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కేజీహెచ్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నాయనే అనుమానంతో వారి శాంపిల్స్‌ను వైద్య పరీక్షలకు పంపారు. వరుసగా ఈ కేసులు బయటపడుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. అప్రమత్తంగా జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేస్తున్నారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నట్టు అనుమానం ఉంటే వెంటనే సరైన చికిత్స తీసుకుంటే ఆదిలోనే నివారించవచ్చని చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు ముదిరిపోయిన తర్వాత ప్రభుత్వాస్పత్రికి వచ్చే కేసుల్లోనే మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముందుగానే అర్హులైన వైద్యులను సంప్రదిస్తే ఈ వ్యాధిని నివారించవచ్చని, ప్రజలు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ప్రతీ జిల్లాలోనూ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్టు మంత్రి కామినేని శ్రీనివాస్ మీడియాకు చెప్పారు. తిరుమలలో అలర్ట్ సాక్షి, తిరుమల: స్వైన్‌ఫ్లూపై తిరుమల శ్రీవారి భక్తులూ అప్రమత్తమయ్యారు. దీంతో ఎక్కువమంది భక్తులు ఎన్ 95 మాస్కులు, సాధారణ మాస్క్‌లు ధరించి తిరుగుతున్నారు. తక్షణం వైద్యసాయం అందించేందుకు వీలుగా టీటీడీ అశ్విని ఆస్పత్రిలో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేసింది. మాస్క్‌లు, మందులు తెప్పించింది. -
టెంపాస్ డాక్టర్లూ.. వెళ్లిపోండి: ఈటెల
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ, వైద్యుల పనితీరుపై ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లలో చాలామంది టైంపాస్ కోసం వచ్చి వెళుతున్నారే తప్ప.. విధులకు హాజరుకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి డాక్టర్లు స్వచ్ఛందంగా తప్పుకోవాలని, లేకుంటే వారి జాబితాను రూపొందించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం కరీంనగర్‌కు వచ్చిన ఈటెల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై ‘స్వైన్‌ఫ్లూ’ నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. -
ఆత్మరక్షణలో డిప్యూటీ సీఎం రాజయ్య
* వైద్యారోగ్య శాఖలో అవినీతి ఆరోపణలపై రాజయ్య ఆందోళన * సీఎంకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం * ఆరేడు నిమిషాలకు మించి సమయమివ్వని కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలు రావడంతో ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం రాజయ్య ఆత్మరక్షణలో పడిపోయారు. దీనిపై సీఎం కె. చంద్రశేఖర్‌రావుకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. స్వైన్‌ఫ్లూపై కేసీఆర్ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన నేపథ్యంలో గురువారం మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నారని, వైద్య శాఖలో చోటుచేసుకున్న వ్యవహారాలపై ఆగ్రహంగా ఉన్నారని జోరుగా ప్రచారం జరగడంతో ఉదయమే రాజయ్య సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. తన శాఖపై వచ్చిన ఆరోపణలతో తనకు సంబంధంలేదని వివరించి, ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆయనకు కేసీఆర్ ఆరేడు నిమిషాలకు మించి సమయం ఇవ్వలేదని సమాచారం. దీంతో ఆందోళనగా సచివాలయానికి చేరుకున్న రాజయ్య అక్కడ మంత్రి కేటీఆర్‌ను ఆయన చాంబర్లో కలిశారు. గంటన్నరపాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. స్వైన్‌ఫ్లూ పరిస్థితితోపాటు వైద్య శాఖలో చోటుచేసుకున్న అవినీతిపై ఇంటెలిజెన్స్ నివేదిక తదితర అంశాలపై కేటీఆర్‌కు రాజయ్య వివరించినట్లు తెలిసింది. ఈ భేటీ తర్వాత మరో మంత్రి హరీశ్‌రావును సచివాలయంలోనే కలిసేందుకు రాజయ్య ప్రయత్నించారు. కానీ అప్పటికే బయటకు వెళ్లిపోవడానికి హరీశ్‌రావు సిద్ధంకావడంతో కలవలేకపోయారు. అయితే నేరుగా హరీశ్‌రావు ఇంటికే వెళ్లి ఆయన్ను కలిసినట్లు సమాచారం. హరీశ్‌రావు, కేటీఆర్ ద్వారా సీఎంకు వాస్తవాలను వివరించి గండం నుంచి గట్టెక్కేందుకు రాజయ్య ప్రయత్నించారు. కాగా, వైద్య, ఆరోగ్య శాఖలో గురువారం ఇద్దరు అధికారులపై వేటు పడడం, ప్రధానంగా ఆరోగ్య శాఖ డెరైక్టర్‌ను పక్కనబెట్టి, ఆ బాధ్యతలను కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కు అప్పగించడం చర్చనీయాంశమైంది. కాగా, 108 నిర్వహణ సంస్థను ఈ శాఖకు చెందిన కొందరు నెలవారీ పర్సెంటేజీ అడిగినట్లు, అయితే ప్రభుత్వం అందించే నిర్వహణ ఖర్చులే సరిపోవడం లేదంటూ వారు చేతులెత్తేసినట్లు బయటకుపొక్కింది. -
ఇదేనా మీ వైద్యం..!
* స్వైన్‌ఫ్లూ నివారణ చర్యలపై కేంద్ర వైద్య బృందం అసంతృప్తి * గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ వార్డుల సందర్శన ‘‘తెలంగాణలో ఇప్పటి వరకు ఎంతమంది స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారు. రోగులు ఫ్లూతో చనిపోతుంటే మీరేం చేస్తున్నారు. వైరస్ సోకిన వ్యక్తి నివాస ప్రాంతానికి ఇప్పటి వరకు ఎందుకు వెళ్లలేదు..? ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇంతమంది వైద్యులు ఉండి కూడా ఈ చిన్న వైరస్‌ను ఎందుకు నిలువరించలేకపోయారు..? ఇంతకు మీ వద్ద స్వైన్‌ఫ్లూ బాధితులు, మృతులకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉందా..?’’ - రాష్ట్ర స్వైన్‌ఫ్లూ నోడల్ ఆఫీసర్లపై కేంద్ర వైద్య బృందం కురిపించిన ప్రశ్నలివి సాక్షి, హైదరాబాద్: గతకొద్ది రోజులుగా గ్రేటర్ హైదరాబాద్‌ను వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ వ్యాధిపై ఆరా తీసేందుకు గురువారం గాంధీ ఆస్పత్రికి వచ్చిన కేంద్ర వైద్య బృందం ఇక్కడి ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ రోగులకు అందిస్తున్న చికిత్స, సేవలు, సదుపాయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జాతీయ వ్యాధి నిరోధక కేంద్రం (ఎన్డీసీసీ) డెరైక్టర్ జనరల్ అశోక్‌కుమార్, అదనపు డెరైక్టర్ డాక్టర్ శశిరేఖ, సమీకృత వ్యాధుల పర్యవేక్షణ కార్యక్రమం అధికారి ప్రదీప్ ఖస్నోబిస్లతో కూడిన కేంద్ర వైద్య బృందం మొదట గాంధీలో స్వైన్‌ఫ్లూ రోగుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్, డిజాస్టర్ వార్డులను తనిఖీ చేసింది. అనంతరం ఆస్పత్రిలోనే తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సురేశ్‌చంద, డీఎంఈ డాక్టర్ శ్రీనివాస్, సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్వీ చంద్రవదన్, నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్, గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ ధైర్యవాన్, స్వైన్‌ఫ్లూ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శుభాకర్ తదితరులతో సమావేశమై స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించింది. స్వైన్‌ఫ్లూతో ఆస్పత్రికి వస్తున్న రోగులు, అందుబాటులో ఉన్న మందులు, వైరస్‌ను అరికట్టేందుకు చేపట్టిన చర్యలు, వైద్యసేవలు తదితర అంశాలపై కేంద్ర బృందం ఆరా తీసింది. ఫ్లూ మరణాలను నివారించలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు వెలుగు చూసిన ఫ్లూ మరణాలకు సంబంధించిన సమగ్ర వివరాలు తమకు అందజేయాల్సిందిగా రాష్ట్ర వైద్య బృందాన్ని కోరడంతో వారు అప్పటికప్పుడు బాధితుల వివరాలు సేకరించి కేంద్ర బృందానికి అందజేశారు. స్వైన్ ఫ్లూ పై రాష్ట్ర పర్యవేక్షణ సెల్ ఏర్పాటు కేంద్ర వైద్య బృందం మందలింపుతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే 40 వేల స్వైన్‌ఫ్లూ మందులను వివిధ జిల్లాలకు సరఫరా చేసింది. స్వైన్ ఫ్లూపై హుటాహుటిన రాష్ట్రస్థాయి పర్యవేక్షణ సెల్‌ను ఏర్పాటు చేసింది. 104 (టోల్ ఫ్రీ) కాల్ సెంటర్‌తో అనుసంధానం చేస్తూ 24 గంటలు పనిచేసే ఈ కేంద్రానికి ప్రజలు ఫోన్ చేసి స్వైన్ ఫ్లూకు సంబంధించిన వివరాలను అందజేయవచ్చు. ఈ కేంద్రంలోని అధికారుల బృందం ఫ్లూకు సంబంధించిన సమాచారం తెలుసుకొని ఆయా ప్రాంతాల్లోని ఆస్పత్రులను అప్రమత్తం చేస్తుంది. ప్రజలను మరింత అప్రమత్తం చేసేందుకు ప్రచార పోస్టర్లను పంపించింది. జిల్లాస్థాయిలో ఉండే సర్వేలెన్స్ టీంలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఆరోగ్యశ్రీ పరిధిలోకి స్వైన్‌ఫ్లూ... ఆరోగ్యశ్రీ పరిధిలోకి స్వైన్‌ఫ్లూను తెస్తూ తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్టు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆరోగ్యశ్రీ కింద ఫ్లూ బాధితులకు వైద్యం అందించాలని నెట్వర్క్ ఆసుపత్రులకు అత్యవసర ఆదేశాలు ఇచ్చింది. వెంటనే అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మీకెందుకు మాస్కులు, వ్యాక్సిన్లు...? రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో ఇతర రోగులు, వైద్య సిబ్బంది ఫ్లూ బారిన పడకుండా ఎన్- 95 మాస్కులు సరఫరా చేయాలని వైద్యులు కోరడంపై కేంద్ర వైద్య బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ చిన్న వైరస్‌కు వైద్యులే భయపడితే సామాన్యుల సంగతేంటి అని వారిని ప్రశ్నించింది. మాస్కులే కాదు, ముందస్తు వ్యాక్సిన్ కూడా అవసరం లేదని స్పష్టం చేసింది. నగరంలోని ఆస్పత్రుల నుంచి వస్తున్న అనుమానిత స్వైన్‌ఫ్లూ నమూనాలకు ఉచితంగా పరీక్షలు చేయాలని ఐపీఎం అధికారులకు సూచించింది. ఫీవర్ ఆస్పత్రిలోనూ స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. కాగా, హైదరాబాద్ తర్వాత మహబూబ్‌నగర్‌లోనే స్వైన్‌ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో ఆ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించడానికి కేంద్ర వైద్యబృందం శుక్రవారం అక్కడికి వెళ్లనుంది. అక్కడి వైద్యులతో సమావేశమై ఆస్పత్రిలో సౌకర్యాలపై సమీక్షించనుంది. స్వైన్‌ఫ్లూతో మరో యువతి మృతి స్వైన్‌ఫ్లూ లక్షణాలతో రెండు రోజుల నుంచి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందిన బాసరకు చెందిన అర్ష(19) గురువారం గాంధీ ఆస్పత్రిలో మృతి చెందింది. కాగా ఇదే ఆస్పత్రిలో ప్రస్తుతం 36 మంది హెచ్1ఎన్1 పాజిటివ్ బాధితులు, మరో ఏడుగురు అనుమానిత స్వైన్‌ఫ్లూ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో నలుగురు జూనియర్ వైద్యులతో పాటు ఒక నర్సు కూడా ఫ్లూతో బాధపడుతోంది. అపోలో, కేర్, కిమ్స్, యశోద, ప్రీమియర్, స్టార్, రెయిన్బో ఆస్పత్రుల్లో కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు చిన్నారులుండగా, ఆరుగురు మహిళలు ఉన్నారు. -
స్వైన్ రన్...
స్వైన్‌ఫ్లూ... గ్రేటర్లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. నగరవాసుల ప్రాణాలను మింగేస్తోంది. వారం రోజుల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. గాంధీ, బంజారాహిల్స్ కేర్, అపోలో, యశోద, కిమ్స్, ఉస్మానియా, సిటీజన్స్, పీస్ ఇలా ఏ ఆస్పత్రిలో చూసినా స్వైన్ ఫ్లూ రోగులే. కేవలం 17 రోజుల్లో 136 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చలికాలంలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది.. స్వైన్ ఫ్లూ పేరు వింటే ప్రజలు హడలిపోతున్నారు. దీని నుంచి ప్రజలను కాపాడడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కనీసం వైద్యానికి కావాల్సిన కిట్స్ కూడా అందుబాటులో లేవు. సిబ్బంది సైతం జంకుతున్నారు. ⇒ సిటీపై స్వైన్ ఫ్లూ దాడి ⇒మృత్యువాత పడుతున్న నగర వాసులు ⇒వారం రోజుల్లో ఏడుగురి మృతి ⇒17 రోజుల్లో 136 కేసులు ⇒తీవ్ర చలిలో వేగంగా విస్తరిస్తున్న వైరస్ ⇒హడలిపోతున్న జనం సాక్షి, సిటీబ్యూరో: రెండేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాంచిన హెచ్1ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా (స్వైన్ ఫ్లూ) వైరస్ గ్రేటర్‌ను హడలెత్తిస్తోంది. సాధారణంగా ఈ సీజన్లో చాలా తక్కువగా వ్యాపిస్తుంది. జూన్ నుంచి అక్టోబర్ మాసాల్లో విస్తరించే ఈ వైరస్ జనవరిలో కూడా తన ప్రతాపాన్ని చూపుతోంది. అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ కూడా ప్రస్తుతం సాధారణ వైరస్‌లా రూపాంతరం చెంది గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలపై ప్రతాపాన్ని చూపుతోంది. తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల తో పోలిస్తే గ్రేటర్ హైదరాబాద్‌లోనే వైరస్ తీవ్రత ఎక్కువ ఉంది. స్వైన్‌ఫ్లూ వ్యాధి నిరోధక వాక్సిన్ను ప్రభుత్వం ముందస్తుగా సరఫరా చేయక పోవడంతో ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తోంది. ఇదే అదనుగా భావించిన పలు కార్పొరే ట్ ఆస్పత్రులు, ప్రైవేటు మెడికల్ షాపుల్లో వ్యాక్సిన్‌ను విక్రయిస్తుండడంతో ప్రజలు ఎగబడుతున్నారు. ఏడురోజుల్లో ఏడుగురు మృతి.. గ్రేటర్ హైదరాబాద్‌లో కేవలం ఏడు రోజుల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. పదోతేదీ నుంచి వరుసగా ఆరురోజుల్లో ఐదుగురు బాధితులు మృతి చెందగా, గాంధీ ఆస్పత్రిలో శనివారం సాయంత్రం మరో ఇద్దరు మరణించారు. మృతుల్లో ఒకరు ఆసీఫ్‌నగర్‌కు చెందిన 37 ఏళ్ల మహిళ కాగా, ఏఎస్రావునగర్కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. కొత్తగా మరో 21 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరంతా గాంధీ , బంజారాహిల్స్ కేర్, అపోలో, యశోద, కిమ్స్, ఉస్మానియా, సిటిజన్స్, పీస్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 10 మంది మహిళలు ఉండగా, నలుగురు పిల్లలు ఉన్నారు. చాపకింది నీరులా విస్తరిస్తోన్న ఈ వైరస్ బారి నుంచి గ్రేటర్ వాసులను కాపాడడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. వైరస్ విస్తరించకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. 17 రోజుల్లో 136 కేసులు నమోదు.. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది 81 పాజిటివ్ కేసులు న మోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు అంటే 17 రోజుల్లో 136 స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరుసగా గురువారం 24, శుక్రవారం 11, శనివారం 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో అత్యధికులు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన వారుండగా, ఇద్దరు నిజామాబాద్, తొమ్మిది మంది మహబూబ్‌నగర్, ముగ్గురు నల్లగొండకు చెందిన వారున్నారు. ఒక వైపు వైరస్ విజృంభిస్తుంటే మరో వైపు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పుతుండడం గమనార్హం. గాంధీ సహా ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లోనూ స్వైన్‌ఫ్లూ నోడల్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నా.. అక్కడ వైద్యానికి కావాల్సిన కనీసం కిట్స్‌ను కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఆయా ఆస్పత్రుల్లో చేరిన బాధితుల వద్దకు వెళ్లి వైద్యసేవలు అందించేందుకు సిబ్బంది జంకుతున్నారు. వ్యాక్సిన్ కోసం పరుగులు.. స్వైన్‌ఫ్లూ వైరస్ బారిన పడకుండా ముందస్తుగా మందులు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాక్సిన్ సరఫరా ఖరీదైన వ్యవహారం కావడమే ఇందుకు కారణం. ప్రభుత్వం కూడా ఇందుకోసం అవసరమైన బడ్జెట్ కేటాయించలేదు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపినా.. ఫలితం లేకుండా పోయింది. చేసేది లేక ప్రజలు ముందస్తు భద్రత కోసం ప్రైవేటు వాక్సిన్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. ‘సనోఫీ అవెంటీస్’కంపెనీకి చెందిన వ్యాక్సిన్ బహిరంగ మార్కెట్లో రూ.750 ఉండగా, బంజారాహిల్స్ కేర్ అవుట్పేషంట్ విభాగంతో పాటు నాంపల్లికేర్, ముషీరాబాద్, సికింద్రాబాద్ కేర్ ఆస్పత్రుల్లో రూ.450కే వేస్తుండడంతో సిటిజన్లు ఆయా ఆస్పత్రుల ముందు బారులు తీరుతున్నారు. ఇలా ఒక్క కేర్ గ్రూప్ ఆఫ్ ఆస్పత్రుల్లోనే ప్రతి రోజూ సుమారు 500 మంది వాక్సిన్ వేయించుకుంటున్నట్లు సమాచారం. అయితే స్వైన్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర స్వై న్‌ఫ్లూ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శుభకర్ చెప్పారు. కొన్ని ఫార్మాకంపెనీలు ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని వాక్సిన్ ధరలు అమాంతం పెంచేశాయన్నారు. వైద్యులు కూడా అవసరం లేకపోయినా వచ్చిన ప్రతి ఒక్కరికి స్వైన్‌ఫ్లూ పరీక్షలు చేస్తూ ప్రజలను గందర గోళపరుస్తున్నారని ఆరోపించారు. ముందస్తు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం లేదని, వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆయన స్పష్టం చేశారు. లక్షణాలు ఇలా.. స్వైన్‌ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వైరస్ గాల్లోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒకసారి వాతారణంలోకి ప్రవేశించిన వైరస్ సాధారణంగా రెండు, మూడు గంటలకు మించి బతుకదు. కానీ ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల వల్ల వైరస్ బలపడుతోంది. సాధారణ ఫ్లూ జ్వరాలు వచ్చే వ్యక్తిలో కన్పించే లక్షణాలన్నీ స్వైన్‌ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి. తీవ్ర జ్వరం, గొంతు నొప్పి, ఒంటి పై బొబ్బలు, ఉన్నట్టుండి వాంతులు, తరచూ విరేచనాలు అవుతుండటం, ముక్కు దిబ్బడ, ముక్కు, కళ్ల నుంచి నీరు కారడం, భరించలేని ఒంటి నొప్పలు ఉంటే దాన్ని హెచ్1ఎన్1 వైరస్‌గా అనుమానించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. - డాక్టర్ శుభకర్, నోడల్ ఆఫీసర్, స్వైన్‌ఫ్లూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి... సాధ్యమైనంత వరకు రద్దీగా ఉండే హాట్స్పాట్ల (ఎగ్జిబిషన్లు, సినిమా థియేటర్లు, తీర్థయాత్రలు, దేవాలయాలు, మసీదులు, పార్కులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు)కు వెళ్లకపోవడమే ఉత్తమం. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ఇతరులకు షేక్‌హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం చేయరాదు. చిన్న పిల్లలతో సహా ఎవరినీ ముద్దు పెట్టుకోకూడదు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వ్యాధి నిర్ధారణ కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. కాళ్లు, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. డాక్ట ర్ను సంప్రదించకుండా స్వయంగా మందులు వాడకూడదు. - డాక్టర్ శ్రీహర్ష యాదవ్, సర్వేలెన్స్ అధికారి, హైదరాబాద్ జిల్లా -
స్వైన్‌ఫ్లూతో ఇద్దరి మృతి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ వైరస్ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఈ ఏడాది తొలి రెండువారాల్లో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా తాజాగా గురు, శుక్రవారాల్లో మరో ఇద్దరు బలయ్యారు. మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన 60 ఏళ్ల మహిళ గురువారం, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మృత్యువాత పడ్డారు. గ్రేటర్లో రెండు రోజుల్లో 35 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వీరిలో అత్యధికులు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందినవారే. గురువారం 24, శుక్రవారం 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 16 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మరో 11మంది కేర్, అపోలో, యశోద, శ్రీరాం మల్టీస్పెషాలిటీ, కిమ్స్, హోలిస్టిక్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి(38) ఉన్నట్లు తెలిసింది. -
స్వైన్‌ఫ్లూపై సమరభేరి
ఐపీఎంలో 24 గంటలూ శాంపిల్స్ పరీక్షలు ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే కేసుల వివరాల సేకరణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్వైన్‌ఫ్లూ వైరస్ విస్తరిస్తోంది. 15 రోజుల్లో ఐదుగురు చనిపోగా, ఈ ఏడాది మొత్తం ఈ వ్యాధితో 9 మంది చనిపోయినట్లయింది. ఆరేళ్లలో 10 వేలమంది రక్త నమూనాలను పరీక్షించగా 1,800 స్వైన్‌ఫ్లూ కేసులను గుర్తించారు. నెల రోజులుగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతుండటంతో వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ప్రైవేటు ఆస్పత్రులకు స్వైన్‌ఫ్లూ కేసులు వస్తే వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలని... వారిని ప్రభుత్వాసుపత్రులకు తరలించాలని సూచించింది. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ చంద బుధవారం సమీక్ష నిర్వహించారు. అనుమానిత కేసుల శాంపిల్స్ సేకరించి వ్యాధి నిర్ధారణ చేసే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)ను 24 గంటలూ పనిచేసేలా చర్యలు చేపట్టాలని, షిఫ్టులవారీగా సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గాంధీ ఆస్పత్రితోపాటు ఉస్మానియా, ఫీవర్, ఛాతి ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయనున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నారని... వారు అంతకుముందు తిరుపతి వెళ్లొచ్చారని సమాచారం. తిరుపతిలో ఎవరి నుంచైనా వీరికి సోకిందా? లేక వీళ్ల ద్వారా అక్కడ ఎవరికైనా సోకిందా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాగా, కేవలం స్వైన్‌ఫ్లూతో కాకుండా ఇతరత్రా అనారోగ్యం ఉన్న వ్యాధిగ్రస్తులే చనిపోయారని సురేష్‌చంద ‘సాక్షి’కి చెప్పారు. చిన్నారులు జాగ్రత్త తీసుకోవాలి రెండేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని అటువంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డెరైక్టర్ సాంబశివరావు బుధవారం చెప్పారు. అలాగే కిడ్నీ, లివర్, షుగర్, బీపీ తదితర వ్యాధులున్నవారూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, చేతులు తరచుగా కడుక్కోవాలని సూచించారు. ఎక్కువ నీరు తాగాలని, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి రుమాలు అడ్డం పెట్టుకోవాలన్నారు. అవసరమైన మందులు జిల్లాల్లోనూ అందుబాటులో ఉన్నాయన్నారు. గాంధీలో మరో స్వైన్‌ఫ్లూ రోగి మృతి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్‌ఫ్లూ రోగి మృతి చెందాడు. దీంతో ఇక్కడ మృతి చెందిన స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య ఐదుకు చేరింది. ఆలస్యంగా తెలిసిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి యాదమ్మబండకు చెందిన సూర్యప్రకాశ్ (50) చలి జ్వరంతో ఈనెల 29న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు అతని నమూనాలను పరీక్షల కోసం పంపారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి సూర్యప్రకాశ్ మృతి చెందాడు. కాగా, బుధవారం అందిన నివేదికలో స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలింది. దీంతో అతడు స్వైన్ఫ్లూతోనే మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. కాగా, గతంలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు స్వైన్‌ఫ్లూ బాధితులు మృతి చెందారు. -
ఒకే కుటుంబంలో ఐదుగురికి స్వైన్‌ఫ్లూ!
* నలుగురికి మహబూబ్‌నగర్‌లో చికిత్స * చికిత్స పొందుతున్న బాధితులు * పరారైనట్లు వదంతులు * వీటిని కొట్టిపారేసిన అధికారులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్వైన్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు స్వైన్‌ఫ్లూ బారినపడ్డారు. అందులో ఒకరికి వైరస్ లక్షణాలు బయటపడటంతో శనివారం నుంచి హైదరాబాద్‌లో చికిత్స చేస్తున్నారు. అనుమానంతో వైద్య బృందం ఆ వ్యక్తి కుటుంబాన్ని కూడా పరిశీలించగా, వారికీ స్వైన్‌ఫ్లూ సోకినట్లు వెల్లడైంది. దీంతో మిగతా నలుగురికీ మహబూబ్‌నగర్‌లో చికిత్స చేస్తున్నారు. ప్రజలు భయాందోళనకు గురవుతారన్న అనుమానంతో ఈ విషయాన్ని అధికారులు బయటకు పొక్కనీయడం లేదు. మరోవైపు ఆస్పత్రి నుంచి కొందరు స్వైన్‌ఫ్లూ బాధితులు పరారయ్యారని ప్రచా రం జరగడంతో వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది. వారు పరారు కాలేదని... వైరస్ లక్షణాలు తగ్గడంతో వెళ్లిపోయారని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు 8 మంది మృతి ఈ ఏడాది ఇప్పటివరకు అధికారికంగా 70 కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు. గత 15 రోజుల్లోనే నలుగురు మృత్యువాత పడ్డారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అన్నిచోట్లా స్వైన్‌ఫ్లూ మందులున్నాయని చెబుతున్నా, జిల్లాల్లో స్వైన్‌ఫ్లూను గుర్తించే పరీక్షా కేంద్రాలు లేకపోవడంతో బాధితులు హైదరాబాద్‌కే వస్తున్నారు. అన్ని జిల్లాలకు కలిపి కేవలం 13 వేల స్వైన్‌ఫ్లూ మందులే అందుబాటులో ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నగరంలోని ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రుల్లోనూ స్వైన్‌ఫ్లూ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ‘గాంధీ’లోనే స్వైన్‌ఫ్లూ ప్రత్యేక వార్డులున్నాయి. ప్రజల్లో వైరస్‌ను తట్టుకునే శక్తి వచ్చింది స్వైన్‌ఫ్లూను చూసి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డెరైక్టర్ డాక్టర్ పి.సాంబశివరావు ‘సాక్షి’కి చెప్పారు. ఇప్పటికే స్వైన్‌ఫ్లూను తట్టుకునే రోగ నిరోధక శక్తి ప్రజలకు వచ్చిందన్నారు. ఈ వైరస్ మామూలుగా వచ్చి పోతుందని, దీని తీవ్రత ఏమాత్రం లేదని ఆయన భరోసా ఇచ్చారు. కొందరు స్వైన్‌ఫ్లూ బాధితులు పారిపోయారని వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టంచేశారు. వారి జబ్బు నయమయ్యాక ఆస్పత్రిలో ఎందుకుంటారని ఎదురు ప్రశ్నించారు. భయాందోళనకు గురిచేసే అనవసర ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. తలనొప్పి, ఒంటినొప్పులు, జలుబు, దగ్గు, జ్వరం ఉంటే అనుమానించి సమీపంలో ఉన్న ఆసుపత్రులకు వెళ్లి చూపించుకోవాలని సూచించారు. -
విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ
ఒకరు మృతి.. మరో కేసు నమోదు సాక్షి, హైదరాబాద్ : స్వైన్‌ఫ్లూ వైరస్ మళ్లీ నగరంలో స్వైరవిహారం చేస్తోంది. ఫ్లూజ్వరంతో బాధపడుతూ పది రోజుల నుంచి ప్రీమియర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ ఆసిఫ్(23) శనివారం మృతి చెందగా, తాజాగా మలక్‌పేట్ యశోదా ఆస్పత్రిలో మరో కేసు నమోదైంది. నగరంలో ఇప్పటికే 18 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 22 రోజుల్లోనే 16 ఫ్లూ అనుమానిత కేసులు న మోదు కావడం విశేషం. గ్రేటర్ వాతావరణంలో 18 రకాల స్వైన్‌ఫ్లూ కారక వైరస్లు స్వైర విహారం చేస్తున్నట్లు వైద్యుల పరిశోధనలో తేలింది. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వైరస్ గాల్లోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒక సారి వాతారణంలోకి ప్రవేశించిన వైరస్ సాధారణంగా రెండు, మూడు గంటలకు మించి బతకదు. నగరంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల సీజన్‌తో సంబంధం లేకుండానే వైరస్ విస్తరిస్తూనే ఉంది. స్వైన్ ఫ్లూతో రైతు మృతి మొయినాబాద్: స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న ఓ రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌కు చెందిన మహ్మద్ ఆసిఫ్(29)కు దగ్గు, జ్వరం రావడంతో ఈనెల 6వ తేదీన నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు 15 రోజులపాటు ఆసిఫ్‌కు వెంటిలేషన్‌పై చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆయన శుక్రవారం రాత్రి మృతి చెందాడు. -
స్వైన్ ఫ్లూ కలకలం
* విస్తరిస్తున్న వైరస్ * వ్యాధి నిర్ధారణలో ఆలస్యం * జిల్లా కేంద్రానికి చెందిన బాలింత మృతి కరీంనగర్ హెల్త్ : రెండేళ్ల క్రితం గడగడలాడించిన ప్రాణాంతక స్వైన్‌ఫ్లూ వైరస్ ఇప్పుడు జిల్లాకూ పాకింది. విదేశాలతోపాటు ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో అప్పుడు కలకలం రేపిన ఈ వైరస్ జాడ ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. అంతా తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో జిల్లాకేంద్రంలోని ఓ మహిళ స్వైన్‌ఫ్లూతో మరణించిందని తెలిసి కలవరపడుతున్నారు. జిల్లాలో కొంతకాలంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. జ్వరాలతోపాటు డెంగీ లక్షణాలతో మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదు కావడం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. జిల్లాకేంద్రానికి చెందిన కాపరవేణి సరిత(30) రెండో కాన్పు కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. గత నెల 18న సిజేరియన్ నిర్వహించగా, ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఆరోగ్యంగానే ఉన్నారని డిశ్చార్జి చేశారు. ఇంటికి వచ్చిన కొద్దిరోజులకే తీవ్ర దగ్గు, అస్తమాతో బాధపడుతూ ఆమె అనారోగ్యానికి గురికాగా, స్థానికంగా చికిత్స అందించినా నయం కాలేదు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించగా, అక్కడి వైద్యులు స్వైన్‌ఫ్లూగా నిర్ధారించారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం రాత్రి మరణించింది. వివరాలు గోప్యంగా.. స్వైన్‌ఫ్లూతో మరణించిందన్న విషయం ఎక్కువగా ప్రచారం కాకుండా ఉండేందుకు బాధిత కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు. స్వైన్‌ఫ్లూతో మరణించిందని ముందుగా తెలిపిన బంధువులు ఆ తర్వాత కడుపునొప్పితో, కడుపువాపుతో, ఆపరేషన్ వికటించి మరణించిందని రక రకాలుగా చెబుతున్నారు. వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని ఎందుకు వచ్చారంటూ ఎదురు ప్రశ్నించి అక్కడినుంచి పంపించారు. ఈ విషయంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కొమురం బాలును వివరణ కోరగా సరిత స్వైన్‌ప్లూతో మరణించినట్లు తమకు సమాచారం ఉందన్నారు. జిల్లాలో మొదటి కేసు అని చెప్పారు. బాధితురాలికి ఈ వైరస్ ఎలా సోకిందనే విషయం పరిశీలిస్తున్నామన్నారు. బాధిత కుటుంబసభ్యులకు ఈ వైరస్ రాకుండా ఉండేందుకు ఓసెల్టర్ మందు బిళ్లలు కొనుగోలు చేసి 24 గంటల్లోపు పంపిణీ చేస్తామని తెలిపారు. స్వెన్‌ఫ్లూ లక్షణాలివే... - డాక్టర్ బాలు, డీఎంహెచ్‌వో స్వైన్‌ప్లూ హెచ్1, ఎన్1 అనే వైరస్ ద్వారా సోకుతుంది. ఇది రెండు రకాలుగా వస్తుంది. మొదటిది పందులకు అతి సమీపంలో నివసించే వారికి ఈ వ్యాధి వస్తుంది. రెండోది పందులతో సావాసం లేకపోయినా సదరు వ్యాధిగ్రస్తుల నుంచి కూడా సోకుతుంది. వైరస్ బారిన పడినవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఇతరులకు సోకుతుంది. ముక్కు నుంచి ద్రవం ఇతరులకు అంటుకున్నపుడు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదముంది. వ్యాధిగ్రస్తుడు దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం, తలనొప్పి, శరీరం నొప్పులు, కాళ్లు చేతులు తీవ్రంగా వణుకుతాయి. ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. వ్యాధి రాకుండా ముందస్తుగా ముక్కుకు మాస్కులు ధరించాలి. రోగ నివారణకు మందులు అందుబాటులోకి వ చ్చాయి.