ఇదేనా మీ వైద్యం..! | Central medical team takes on gandhi hospital doctors not to action on swine flu virus | Sakshi
Sakshi News home page

ఇదేనా మీ వైద్యం..!

Published Fri, Jan 23 2015 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM

ఇదేనా మీ వైద్యం..!

ఇదేనా మీ వైద్యం..!

* స్వైన్‌ఫ్లూ నివారణ చర్యలపై కేంద్ర వైద్య బృందం అసంతృప్తి   
* గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ వార్డుల సందర్శన

 
 ‘‘తెలంగాణలో ఇప్పటి వరకు ఎంతమంది స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారు. రోగులు ఫ్లూతో చనిపోతుంటే మీరేం చేస్తున్నారు. వైరస్ సోకిన వ్యక్తి నివాస ప్రాంతానికి ఇప్పటి వరకు ఎందుకు వెళ్లలేదు..? ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇంతమంది వైద్యులు ఉండి కూడా ఈ చిన్న వైరస్‌ను ఎందుకు నిలువరించలేకపోయారు..? ఇంతకు మీ వద్ద స్వైన్‌ఫ్లూ బాధితులు, మృతులకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉందా..?’’    
 - రాష్ట్ర స్వైన్‌ఫ్లూ నోడల్ ఆఫీసర్లపై కేంద్ర వైద్య బృందం కురిపించిన ప్రశ్నలివి
 
 సాక్షి, హైదరాబాద్: గతకొద్ది రోజులుగా గ్రేటర్ హైదరాబాద్‌ను వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ వ్యాధిపై ఆరా తీసేందుకు గురువారం గాంధీ ఆస్పత్రికి వచ్చిన కేంద్ర వైద్య బృందం ఇక్కడి ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ రోగులకు అందిస్తున్న చికిత్స, సేవలు, సదుపాయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జాతీయ వ్యాధి నిరోధక కేంద్రం (ఎన్‌డీసీసీ) డెరైక్టర్ జనరల్ అశోక్‌కుమార్, అదనపు డెరైక్టర్ డాక్టర్ శశిరేఖ, సమీకృత వ్యాధుల పర్యవేక్షణ కార్యక్రమం అధికారి ప్రదీప్ ఖస్నోబిస్‌లతో కూడిన కేంద్ర వైద్య బృందం మొదట గాంధీలో స్వైన్‌ఫ్లూ రోగుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్, డిజాస్టర్ వార్డులను తనిఖీ చేసింది. అనంతరం ఆస్పత్రిలోనే తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సురేశ్‌చంద, డీఎంఈ డాక్టర్  శ్రీనివాస్, సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్వీ చంద్రవదన్, నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్, గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ ధైర్యవాన్, స్వైన్‌ఫ్లూ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శుభాకర్ తదితరులతో సమావేశమై స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించింది. స్వైన్‌ఫ్లూతో ఆస్పత్రికి వస్తున్న రోగులు, అందుబాటులో ఉన్న మందులు, వైరస్‌ను అరికట్టేందుకు చేపట్టిన చర్యలు, వైద్యసేవలు తదితర అంశాలపై కేంద్ర బృందం ఆరా తీసింది. ఫ్లూ మరణాలను నివారించలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు వెలుగు చూసిన ఫ్లూ మరణాలకు సంబంధించిన సమగ్ర వివరాలు తమకు అందజేయాల్సిందిగా రాష్ట్ర వైద్య బృందాన్ని కోరడంతో వారు అప్పటికప్పుడు బాధితుల వివరాలు సేకరించి కేంద్ర బృందానికి అందజేశారు.
 
 స్వైన్ ఫ్లూ పై రాష్ట్ర పర్యవేక్షణ సెల్ ఏర్పాటు
 కేంద్ర వైద్య బృందం మందలింపుతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే 40 వేల స్వైన్‌ఫ్లూ మందులను వివిధ జిల్లాలకు సరఫరా చేసింది. స్వైన్ ఫ్లూపై హుటాహుటిన రాష్ట్రస్థాయి పర్యవేక్షణ సెల్‌ను ఏర్పాటు చేసింది. 104 (టోల్ ఫ్రీ) కాల్ సెంటర్‌తో అనుసంధానం చేస్తూ 24 గంటలు పనిచేసే ఈ కేంద్రానికి ప్రజలు ఫోన్ చేసి స్వైన్ ఫ్లూకు సంబంధించిన వివరాలను అందజేయవచ్చు. ఈ కేంద్రంలోని అధికారుల బృందం ఫ్లూకు సంబంధించిన సమాచారం తెలుసుకొని ఆయా ప్రాంతాల్లోని ఆస్పత్రులను అప్రమత్తం చేస్తుంది. ప్రజలను మరింత అప్రమత్తం చేసేందుకు ప్రచార పోస్టర్లను పంపించింది. జిల్లాస్థాయిలో ఉండే సర్వేలెన్స్ టీంలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేసింది.
 
 ఆరోగ్యశ్రీ పరిధిలోకి స్వైన్‌ఫ్లూ...
 ఆరోగ్యశ్రీ పరిధిలోకి స్వైన్‌ఫ్లూను తెస్తూ తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్టు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆరోగ్యశ్రీ కింద ఫ్లూ బాధితులకు వైద్యం అందించాలని నెట్‌వర్క్ ఆసుపత్రులకు అత్యవసర ఆదేశాలు ఇచ్చింది. వెంటనే అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
 
 మీకెందుకు మాస్కులు, వ్యాక్సిన్లు...?
 రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో ఇతర రోగులు, వైద్య సిబ్బంది ఫ్లూ బారిన పడకుండా ఎన్- 95 మాస్కులు సరఫరా చేయాలని వైద్యులు కోరడంపై కేంద్ర వైద్య బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ చిన్న వైరస్‌కు వైద్యులే భయపడితే సామాన్యుల సంగతేంటి అని వారిని ప్రశ్నించింది. మాస్కులే కాదు, ముందస్తు వ్యాక్సిన్ కూడా అవసరం లేదని స్పష్టం చేసింది. నగరంలోని ఆస్పత్రుల నుంచి వస్తున్న అనుమానిత స్వైన్‌ఫ్లూ నమూనాలకు ఉచితంగా పరీక్షలు చేయాలని ఐపీఎం అధికారులకు సూచించింది. ఫీవర్ ఆస్పత్రిలోనూ స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. కాగా, హైదరాబాద్ తర్వాత మహబూబ్‌నగర్‌లోనే స్వైన్‌ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో ఆ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించడానికి కేంద్ర వైద్యబృందం శుక్రవారం అక్కడికి వెళ్లనుంది. అక్కడి వైద్యులతో సమావేశమై ఆస్పత్రిలో సౌకర్యాలపై సమీక్షించనుంది.  
 
 స్వైన్‌ఫ్లూతో మరో యువతి మృతి
 స్వైన్‌ఫ్లూ లక్షణాలతో రెండు రోజుల నుంచి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందిన బాసరకు చెందిన అర్ష(19) గురువారం గాంధీ ఆస్పత్రిలో మృతి చెందింది. కాగా ఇదే ఆస్పత్రిలో ప్రస్తుతం 36 మంది హెచ్1ఎన్1 పాజిటివ్ బాధితులు, మరో ఏడుగురు అనుమానిత స్వైన్‌ఫ్లూ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో నలుగురు జూనియర్ వైద్యులతో పాటు ఒక నర్సు కూడా ఫ్లూతో బాధపడుతోంది. అపోలో, కేర్, కిమ్స్, యశోద, ప్రీమియర్, స్టార్, రెయిన్‌బో ఆస్పత్రుల్లో కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు చిన్నారులుండగా, ఆరుగురు మహిళలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement