ప్రొఫెసర్‌ సాయిబాబాకు కన్నీటి వీడ్కోలు | Prof Saibaba Family To Donate His Body To Gandhi Hospital | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ సాయిబాబాకు కన్నీటి వీడ్కోలు

Oct 15 2024 4:13 AM | Updated on Oct 15 2024 4:13 AM

Prof Saibaba Family To Donate His Body To Gandhi Hospital

నివాళులు అర్పించిన వివిధ రంగాల ప్రముఖులు

అమరవీరుల స్తూపం వద్దకు ప్రొఫెసర్‌ మృతదేహం

అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు.. గన్‌పార్కు వద్ద ఉద్రిక్తత

పరిశోధనల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి మృతదేహం అప్పగింత

మల్కాజిగిరి/ నాంపల్లి/ గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్‌): పౌర హక్కుల నేత, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా(56)కు కుటుంబ సభ్యులు, అభిమానులు, పౌర హక్కుల నేతలు కన్నీటి వీడ్కోలు పలికారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని మౌలాలి జవహర్‌న­గర్‌­లో ఉన్న నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు చేరుకుని సాయిబాబాకు నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ మెడికల్‌ కాలేజీ వరకు ఆయన అంతిమయాత్ర నిర్వహించారు. అంతిమ యాత్రలో భాగంగా ప్రొఫెసర్‌ సాయిబాబా (56) భౌతికకాయాన్ని అసెంబ్లీ ఎదుట గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు తీసుకువచ్చారు.

 అంబులెన్స్‌ నుంచి బాడీ ఫ్రీజర్‌ను కిందికి దింపి, స్తూపం వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. స్తూపం వద్ద ఐదు నిమిషాల పాటు ఉంచి సంతాపం తెలియజేస్తామని పౌర హక్కుల నేతలు కోరినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. అభిమానులు, పౌర హక్కుల నేతలు ‘కామ్రేడ్‌ సాయిబాబా అమర్‌రహే.. లాల్‌ సలాం.. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేశారు.

బాడీ ఫ్రీజర్‌ మూతను తెరిచి స్తూపానికి చూపించారు. అనంతరం తిరిగి ర్యాలీగా గాంధీ మెడికల్‌ కాలేజీకి భౌతికకాయాన్ని తరలించారు. సాయిబాబా చివరికోరిక మేరకు ఆయన కుటుంబ సభ్యులు భౌతికకాయాన్ని సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీకి అప్పగించారు. కాగా, మౌలాలిలోని నివాసంలో సాయిబాబా భౌతికకాయం వద్ద పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. సాయిబాబా మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని పౌర హక్కుల నేతలు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement