Prof Saibaba
-
ప్రొఫెసర్ సాయిబాబాకు కన్నీటి వీడ్కోలు
మల్కాజిగిరి/ నాంపల్లి/ గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): పౌర హక్కుల నేత, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా(56)కు కుటుంబ సభ్యులు, అభిమానులు, పౌర హక్కుల నేతలు కన్నీటి వీడ్కోలు పలికారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని మౌలాలి జవహర్‌నగర్‌లో ఉన్న నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు చేరుకుని సాయిబాబాకు నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ మెడికల్ కాలేజీ వరకు ఆయన అంతిమయాత్ర నిర్వహించారు. అంతిమ యాత్రలో భాగంగా ప్రొఫెసర్ సాయిబాబా (56) భౌతికకాయాన్ని అసెంబ్లీ ఎదుట గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు తీసుకువచ్చారు. అంబులెన్స్ నుంచి బాడీ ఫ్రీజర్‌ను కిందికి దింపి, స్తూపం వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. స్తూపం వద్ద ఐదు నిమిషాల పాటు ఉంచి సంతాపం తెలియజేస్తామని పౌర హక్కుల నేతలు కోరినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. అభిమానులు, పౌర హక్కుల నేతలు ‘కామ్రేడ్ సాయిబాబా అమర్‌రహే.. లాల్ సలాం.. ఇంక్విలాబ్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.బాడీ ఫ్రీజర్ మూతను తెరిచి స్తూపానికి చూపించారు. అనంతరం తిరిగి ర్యాలీగా గాంధీ మెడికల్ కాలేజీకి భౌతికకాయాన్ని తరలించారు. సాయిబాబా చివరికోరిక మేరకు ఆయన కుటుంబ సభ్యులు భౌతికకాయాన్ని సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు. కాగా, మౌలాలిలోని నివాసంలో సాయిబాబా భౌతికకాయం వద్ద పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. సాయిబాబా మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని పౌర హక్కుల నేతలు ఆరోపించారు. -
మౌలాలీలో కేటీఆర్ కు నిరసన సెగ
-
ప్రమాదకరంగా సాయిబాబా ఆరోగ్యం
- నాగ్‌పూర్ జైల్లో ప్రొఫెసర్ నరకం అనుభవిస్తున్నారు - ములాఖత్ అనంతరం మీడియాకు వివరించిన సతీమణి వసంత నాగ్‌పూర్: నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయనే నేరంపై యావజ్జీవ శిక్ష అనుభవిస్తోన్న ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆయన భార్య వసంత మీడియాకు తెలిపారు. మంగళవారం నాగ్‌పూర్ జైలులో ములాఖత్ ద్వారా ప్రొఫెసర్ ను కలుసుకున్న ఆమె.. అనంతరం జైలు లోపల జరుగుతున్న విషయాలను వెల్లడించారు. 90 శాతం దివ్యాంగుడైన సాయిబాబా పలు వ్యాధులతో బాధపడుతున్నప్పటికీ జైలులో ఆయనకు ఎలాంటి వైద్య సౌకర్యాలు కల్పించడంలేదని వసంత చెప్పారు. ఈ విషయాలను మరుగునపెడుతూ, సాయిబాబా ఆరోగ్యంగానే ఉన్నారంటూ అక్కడి డాక్టర్లు నకిలీ రిపోర్టులు తయారు చేశారని ఆరోపించారు. ప్రొస్టేట్ సమస్య వల్ల కనీసం కాలకృత్యాలు తీర్చుకోలేని స్థితిలోనూ జైలు అధికారులు, వైద్యులు మిన్నకుండిపోయారని అన్నారు. ప్రొఫెసర్ సాయిబాబాకు వెళ్లే ఉత్తరాలేవీ ఆయనకు అందజేయడంలేదని, పత్రికల్లో ఆయనకు సంబంధించిన వార్తలుగానీ, బయట జరుగుతున్న విషయాలేవీ ఆయనకు తెలియనివ్వడంలేదని వసంత తెలిపారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నేరం రుజువు కావడంతో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు మహారాష్ట్రలోని గడ్చిరోలి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ సాయిబాబా సహా మరో నలుగురు దోషులు హైకోర్టులు ఆశ్రయించారు. ఈలోపే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటం కుటుంబసభ్యులను, సన్నిహితులను కలవరపాటుకు గురిచేస్తోంది.