ప్రమాదకరంగా సాయిబాబా ఆరోగ్యం
- నాగ్‌పూర్ జైల్లో ప్రొఫెసర్ నరకం అనుభవిస్తున్నారు
- ములాఖత్ అనంతరం మీడియాకు వివరించిన సతీమణి వసంత
నాగ్‌పూర్: నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయనే నేరంపై యావజ్జీవ శిక్ష అనుభవిస్తోన్న ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆయన భార్య వసంత మీడియాకు తెలిపారు. మంగళవారం నాగ్‌పూర్ జైలులో ములాఖత్ ద్వారా ప్రొఫెసర్ ను కలుసుకున్న ఆమె.. అనంతరం జైలు లోపల జరుగుతున్న విషయాలను వెల్లడించారు.
90 శాతం దివ్యాంగుడైన సాయిబాబా పలు వ్యాధులతో బాధపడుతున్నప్పటికీ జైలులో ఆయనకు ఎలాంటి వైద్య సౌకర్యాలు కల్పించడంలేదని వసంత చెప్పారు. ఈ విషయాలను మరుగునపెడుతూ, సాయిబాబా ఆరోగ్యంగానే ఉన్నారంటూ అక్కడి డాక్టర్లు నకిలీ రిపోర్టులు తయారు చేశారని ఆరోపించారు. ప్రొస్టేట్ సమస్య వల్ల కనీసం కాలకృత్యాలు తీర్చుకోలేని స్థితిలోనూ జైలు అధికారులు, వైద్యులు మిన్నకుండిపోయారని అన్నారు. ప్రొఫెసర్ సాయిబాబాకు వెళ్లే ఉత్తరాలేవీ ఆయనకు అందజేయడంలేదని, పత్రికల్లో ఆయనకు సంబంధించిన వార్తలుగానీ, బయట జరుగుతున్న విషయాలేవీ ఆయనకు తెలియనివ్వడంలేదని వసంత తెలిపారు.
మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నేరం రుజువు కావడంతో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు మహారాష్ట్రలోని గడ్చిరోలి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ సాయిబాబా సహా మరో నలుగురు దోషులు హైకోర్టులు ఆశ్రయించారు. ఈలోపే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటం కుటుంబసభ్యులను, సన్నిహితులను కలవరపాటుకు గురిచేస్తోంది.