మరో 15 రోజుల్లో పేట్లబురుజు ఆస్పత్రిలో ఐవీఎఫ్ సెంటర్ ఏర్పాటు
వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌లోనూ సంతాన సాఫల్య కేంద్రాలు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సేవలు ఉచితంగా పొందొచ్చని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ తెలిపారు. నిరుపేదలకు మాతృత్వపు మమకారాన్ని అందిస్తామని చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వైద్యవిద్యార్థుల వసతిగృహ భవన సముదాయానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి దామోదర రాజనర్సింహ మంగళవారం భూమిపూజ చేశారు.
అనంతరం ఎంసీహెచ్ భవనంలోని ఐవీఎఫ్ సెంటర్‌ను వైద్య ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఏడాది క్రితం అప్పటి ప్రభుత్వం గాం«దీఆస్పత్రిలో ఐవీఎఫ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి వసతులు కల్పించకపోవడంతో నిరుపయోగంగా మారిందని, తనకు తెలిసిన వెంటనే డైరెక్టర్, గైనకాలజిస్ట్, ఎంబ్రయాలజిస్ట్‌లను నియమించి, రీఏజెంట్స్ కోసం నిధులు కేటాయించి, సంబంధిత శాఖ నుంచి అనుమతులు పొంది, గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.
సంతానలేమితో బాధపడుతున్న వారిక్కడ వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌లలో ప్రభుత్వ సెక్టార్‌లో ఐవీఎఫ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. 15 రోజుల్లో పేట్లబురుజు ఆస్పత్రిలో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి లో ఐవీఎఫ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్య,ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశించారు.
గాందీలో అదనపు విభాగాల ఏర్పాటు
గాం«దీలో ప్రస్తుతం ఉన్న 34 విభాగాలతోపాటు అదనంగా మరో నాలుగు విభాగాలు, యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6 కేన్సర్ కేర్, 74 ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు.
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఐవీఎఫ్ సేవలను ఉచితంగా అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులు పేదలకే అనే అభిప్రాయం పోగొట్టాలని, ఐఏఎస్, ఐపీఎస్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వ వైద్యరంగాన్ని తీర్చిదిద్దేందుకు వైద్యులంతా కృషి చేయాలని పిలుపు నిచ్చారు.
కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ, కమిషనర్ కర్ణన్, డీఎంఈ వాణి, గాంధీ ప్రిన్సిపాల్ ఇందిర, సూపరింటెండెంట్ రాజకుమారి, రాజ్యసభ సభ్యు డు అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీ రియా జ్, టీజీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ హేమంత్‌కుమార్, వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment