ఆత్మరక్షణలో డిప్యూటీ సీఎం రాజయ్య
* వైద్యారోగ్య శాఖలో అవినీతి ఆరోపణలపై రాజయ్య ఆందోళన
* సీఎంకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం
* ఆరేడు నిమిషాలకు మించి సమయమివ్వని కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలు రావడంతో ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం రాజయ్య ఆత్మరక్షణలో పడిపోయారు. దీనిపై సీఎం కె. చంద్రశేఖర్‌రావుకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. స్వైన్‌ఫ్లూపై కేసీఆర్ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన నేపథ్యంలో గురువారం మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నారని, వైద్య శాఖలో చోటుచేసుకున్న వ్యవహారాలపై ఆగ్రహంగా ఉన్నారని జోరుగా ప్రచారం జరగడంతో ఉదయమే రాజయ్య సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.
తన శాఖపై వచ్చిన ఆరోపణలతో తనకు సంబంధంలేదని వివరించి, ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆయనకు కేసీఆర్ ఆరేడు నిమిషాలకు మించి సమయం ఇవ్వలేదని సమాచారం. దీంతో ఆందోళనగా సచివాలయానికి చేరుకున్న రాజయ్య అక్కడ మంత్రి కేటీఆర్‌ను ఆయన చాంబర్‌లో కలిశారు. గంటన్నరపాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. స్వైన్‌ఫ్లూ పరిస్థితితోపాటు వైద్య శాఖలో చోటుచేసుకున్న అవినీతిపై ఇంటెలిజెన్స్ నివేదిక తదితర అంశాలపై కేటీఆర్‌కు రాజయ్య వివరించినట్లు తెలిసింది. ఈ భేటీ తర్వాత మరో మంత్రి హరీశ్‌రావును సచివాలయంలోనే కలిసేందుకు రాజయ్య ప్రయత్నించారు.
కానీ అప్పటికే బయటకు వెళ్లిపోవడానికి హరీశ్‌రావు సిద్ధంకావడంతో కలవలేకపోయారు. అయితే నేరుగా హరీశ్‌రావు ఇంటికే వెళ్లి ఆయన్ను కలిసినట్లు సమాచారం. హరీశ్‌రావు, కేటీఆర్ ద్వారా సీఎంకు వాస్తవాలను వివరించి గండం నుంచి గట్టెక్కేందుకు రాజయ్య ప్రయత్నించారు. కాగా, వైద్య, ఆరోగ్య శాఖలో గురువారం ఇద్దరు అధికారులపై వేటు పడడం, ప్రధానంగా ఆరోగ్య శాఖ డెరైక్టర్‌ను పక్కనబెట్టి, ఆ బాధ్యతలను కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కు అప్పగించడం చర్చనీయాంశమైంది. కాగా, 108 నిర్వహణ సంస్థను ఈ శాఖకు చెందిన కొందరు నెలవారీ పర్సెంటేజీ అడిగినట్లు, అయితే ప్రభుత్వం అందించే నిర్వహణ ఖర్చులే సరిపోవడం లేదంటూ వారు చేతులెత్తేసినట్లు బయటకుపొక్కింది.